ఇప్పుడు ప్రతిభావంతులకే పీహెచ్‌డీ అంటా...

Updated:10/03/2018 10:58 AM

ph d for entrance exam

పీహెచ్‌డీ ప్రవేశానికి రాష్ట్రవ్యాప్తంగా ఒక తరహా నిబంధనలు రానున్నాయి. జాతీయ స్థాయిలో నిర్వహిస్తున్న నెట్‌, గేట్‌, జీప్యాట్‌ లాంటి ప్రవేశ పరీక్షల ర్యాంకులతోపాటు..రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే రాష్ట్ర అర్హత పరీక్ష(టీఎస్‌సెట్‌)లో ఉత్తీర్ణులు కావడం తప్పనిసరి. ముగ్గురు ఉపకులపతులతో కూడిన త్రిసభ్య కమిటీ తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలికి ఇవే సిఫారసులు చేసింది.

పీహెచ్‌డీ సీట్ల భర్తీకి ఒక్కో విశ్వవిద్యాలయం ఒక్కో విధానాన్ని అవలంభిస్తుండటంతో తరచూ వివాదాలు రేగుతున్నాయి. ఫలితంగా సీట్ల భర్తీ ఏళ్లు గడిచినా పూర్తికావడం లేదు. విశ్వవిద్యాలయం నిర్వహించే ప్రవేశ పరీక్ష అర్హత మార్కుల్లో కూడా ఎవరి ఇష్టం వారిది. ఒకరు 50 శాతం కటాఫ్‌ మార్కులుగా నిర్ణయిస్తే...మరో వర్సిటీ 35 మార్కులకు సీట్లు ఇస్తుంది. అర్హులు తక్కువ సంఖ్యలో ఉత్తీర్ణులైనా...విద్యార్థి సంఘాలు ఒత్తిడి చేసినా కటాఫ్‌ మార్కులను ఎంతకైనా తగ్గించే పరిస్థితీ ఉంది. తెలంగాణ విశ్వవిద్యాలయం, కాకతీయ విశ్వవిద్యాలయంలో పలు సమస్యల వల్ల పీహెచ్‌డీ సీట్ల భర్తీ ఆగిపోయింది. ఈ పరిణామాలతో తెలంగాణ ఉన్నత విద్యామండలి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్సిటీల్లో ఆ సీట్ల భర్తీకి ఏకీకృత విధానం ఉండాలని నిర్ణయించింది. ఆ మేరకు గత ఏడాది జులైలో జేఎన్‌టీయూ, ఓయూ, అంబేడ్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయం ఉపకులపతులతో కమిటీని నియమించింది. ఈ కమిటీ ఆయా వర్సిటీలు ప్రస్తుతం పాటిస్తున్న విధానాలు, యూజీసీ మార్గదర్శకాలను అధ్యయనం చేసి..ముసాయిదా నివేదికను ఉన్నత విద్యామండలికి ఇటీవలే సమర్పించింది.

ప్రవేశ పరీక్షలు వద్దన్న యూజీసీ 
ప్రస్తుతం సైన్స్‌ అభ్యర్థుల కోసం కేంద్ర ప్రభుత్వం సీఎస్‌ఐఆర్‌-యూజీసీ నెట్‌, ఇతర సబ్జెక్టుల వారికి యూజీసీ నెట్‌ నిర్వహిస్తోంది. ఇంజినీరింగ్‌ విద్యార్థులకు గేట్‌, ఫార్మసీ  అభ్యర్థులకు జీప్యాట్‌ ప్రవేశ పరీక్షలున్నాయి. ఇక రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలంగాణ రాష్ట్ర అర్హత పరీక్ష(టీసెట్‌) నిర్వహిస్తోంది. ఇన్ని ప్రవేశ పరీక్షలు ఉండగా మళ్లీ విశ్వవిద్యాలయాలు ప్రత్యేకంగా పరీక్షలు జరపడం ఎందుకని కమిటీ నిర్ణయానికి వచ్చింది. ‘కేవలం న్యాక్‌ ఏ ఫ్లస్‌, ఏ గ్రేడ్‌ ఉన్న వర్సిటీలు మాత్రమే అవసరమైతే సొంతగా ప్రవేశ పరీక్షలు జరుపుకోవచ్చని, ఇతర విశ్వవిద్యాలయాలు జాతీయ, రాష్ట్రస్థాయి ప్రవేశ పరీక్షల్లో ర్యాంకర్లకే ముఖాముఖీ నిర్వహించి ఎంపిక చేయాలని సూచిస్తూ’ 2017 జూన్‌లో పీహెచ్‌డీ ప్రవేశాలకు సంబంధించి యూజీసీ ఇచ్చిన కొత్త మార్గదర్శకాలనూ కమిటీ పరిగణనలోనికి తీసుకుంది. ఉప ముఖ్యమంత్రి కడియం సైతం తాజాగా జరిగిన ఉపకులపతుల సమావేశంలో..ఈ సిఫార్సులపై సానుకూలత వ్యక్తంచేసిన క్రమంలో వాటికి  ఆమోదం లభించినట్లేనని భావిస్తున్నారు.