విమానం నుంచి దూకెసిన ప్రయాణికులు...

Updated:13/03/2018 05:37 AM

passengers are getting down from flight...

ఓ విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్‌ చేయడంతో భయభ్రాంతులకు గురైన ప్రయాణికులు వెంటనే విమానం నుంచి కిందకి దూకేశారు. అమెరికాలోని అల్బక్వెర్‌క్యూ ఇంటర్నేషనల్‌ సన్‌పోర్ట్‌ విమానాశ్రయంలో ఆదివారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. అరిజోనాలోని ఫోనిక్స్‌ నుంచి బయలుదేరిన డల్లాస్‌కు చెందిన సౌత్‌వెస్ట్‌ విమానం- 3562 అల్బక్వెర్‌క్యూ విమానాశ్రయంలో అత్యవసరంగా దించారు. ల్యాండ్‌ చేసే ముందు విమాన సిబ్బంది క్యాబిన్‌లో ఏదో వాసన వస్తుందని అందుకే విమానం ల్యాండ్‌ చేస్తున్నట్లు తెలిపారు.

దీంతో భయభ్రాంతులకు లోనైన ప్రయాణికులు విమానం ల్యాండ్‌ కాగానే, కొందరు ఒక్కసారిగా విమానం రెక్క పక్కనే ఉండే కిటికిలో నుంచి కిందకి దూకేశారు. ‘భయంతో ఎనిమిది అడుగుల ఎత్తులో నుంచి దూకేశాను’ అని అందులో ప్రయాణిస్తున్న బ్రాండన్‌ కాక్స్‌ అనే వ్యక్తి చెప్పుకొచ్చాడు. వెంటనే విమాన సిబ్బంది ఎమర్జెన్సీ ఎగ్జిట్‌ తెరిచి ప్రయాణికులంతా వెంటనే కిందకి దిగేయాలని బిగ్గరగా కేకలు వేశారు. విమానంలో నుంచి దూకేయడంతో ఇద్దరు ప్రయాణికులు గాయపడ్డారని వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్లు అల్బక్వెర్‌క్యూ అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపారు. విమాన సిబ్బంది వెంటనే ప్రయాణికులందరినీ ఖాళీ చేయించడంతో ప్రమాదం తప్పిందని సౌత్‌వెస్ట్‌ వెల్లడించింది.