Friday, April 19, 2024

అక్రమ పనులకు సహకరించాలని…అధికారులపై భూ మాఫియా ఒత్తిడి. ⁉️

తప్పక చదవండి

పాతబస్తీలో వివిధ శాఖల్లో ప్రభుత్వాధికారులు పని చెయ్యాలంటే కత్తి మీద సాము లాంటిదే. ఇక్కడ ఓ వర్గ రాజకీయ నాయకుల ఒత్తిడి మరోపక్క భూకబ్జా మాఫియా. ఈ ఇద్దరి మధ్య నలుగుతున్న ప్రభుత్వధికారుల మానసిక వేదన అంతా ఇంతా కాదు. ముఖ్యంగా రెవెన్యూ, రిజిస్ట్రేషన్, విద్యుత్ శాఖ అధికారులపై భూ మాఫియా అక్రమ పనుల ఫైళ్లు చెయ్యాలని దాబాయిస్తున్నారు. రూల్స్ ఒప్పుకోవని స్పష్టంగా అధికారులు చెప్పినా కూడా అధిక లంచం ఆశ చూపి తమవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. అదికూడా నడవకపోతే పై అధికారులకు తప్పుడు ఫిర్యాదులు చేస్తూ ఫలానా అధికారి న్యాయం చెయ్యట్లేదని, లంచాలకు అలవాటుపడి ఎక్కువ డిమాండ్ చేస్తున్నాడని, వర్గ విబేధాలు చేస్తున్నాడని ఇలా ఉన్నతాధికారుల నుండి సీఎం వరకు అబండాలు వేస్తూ తప్పుడు ఫిర్యాదులు చేస్తూ మానసిక ఒత్తిడికి గురిచేస్తున్నారు. కాగా ఈ భూ మాఫియాలో కొందరు లాయర్లు సహకరించడం విడ్డూరం. తాజాగా పాతబస్తీ ప్రాంతంలో రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో ఓ భూ మాఫియా 7వ నవాబు వారసులకు సంబంధించిన తొమ్మిది వేల గజాల భూమిని పార్టీషన్ చేసుకొని, రిజిస్ట్రేషన్ చెయ్యాలని వచ్చారు. ఆ ఫైల్ ని పరిశీలించిన పిదప సంబంధిత అధికారికి కొన్ని అనుమానాలు వచ్చాయి. అయితే రెవెన్యూ రికార్డులు, భూమికి సంబంధించిన పూర్వ రికార్డుల వివరాలు రెవెన్యూ కార్యాలయం నుండి తీసుకురావాల్సిందిగా కోరారు. ఇలా పూర్వ దస్తవేజులు అడిగినందుకు, కార్యాలయంలో తాండవం చేశారు. అంతే కాకుండా పై అధికారులకు తప్పుడు ఫిర్యాదులు చేసి ఇమేజి డ్యామేజ్ చేస్తే, అధికారి దిగొస్తాడాని ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలా చేస్తూ లోకల్ లీడర్లతో బేరసారాలు ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. అంతే కాకుండా వచ్చే ఎన్నికల్లోపు సులువుగా డబ్బు సంపాదించాలనే తపనతో భూమాఫియా నాయకుడు ఎమ్మెల్యే టిక్కెట్ కోసం ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఇలా భూ మాఫియాల ఆగడాలు ఈ ఒక్క అధికారికే పరిమితం కాదు. వివిధ శాఖల్లో ఇదే తంతు కొనసాగిస్తున్నారు. అందుకేనేమో పాతబస్తీలో ప్రభుత్వాధికారులు పనిచెయ్యాలంటేనే జంకుతున్నారు. ఉన్నతాధికారులు ఈ విషయాన్ని గమనించి వచ్చిన ఫిర్యాదులపై తుది నిర్ణయం తీసుకునే ముందు పూర్వాపరాలు పరిశీలించి చర్యలు తీసుకుంటే బాగుంటుందని కొందరు అధికారులు తమ గోడును మీడియాతో పంచుకున్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు