ఫలించిన 19 ఏళ్ల నిరీక్షణ..

- వరల్డ్ అథ్లెటిక్స్ పోటీల్లో నీరజ్ చోప్రాకు రజతం..
- జావెలిన్ త్రోలో 88.13 మీటర్లు రెండోస్థానంలో చోప్రా..
- 2003లో అంజూ బాబీ జార్జ్ కు కాంస్యం..
- మళ్లీ ఇన్నాళ్లకు వరల్డ్ పోటీల్లో భారత్ కు పతకం..
-- నీరజ్ చోప్రాపై ప్రధాని మోదీ ప్రశంసల వర్షం..
న్యూ ఢిల్లీ, 24 జూలై ( ఆదాబ్ హైదరాబాద్ ) :
ఒలింపిక్స్ గోల్డ్ మెడలిస్ట్, భారత జావెలిన్ త్రో స్టార్ నీరజ్ చోప్రా మరో మారు సంచలనం సృష్టించాడు. అమెరికాలోని యుజీన్ వేదికగా జరుగుతోన్న ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్-2022లో నీరజ్ చోప్రా రజత పతకం సాధించాడు. ఆదివారం జరిగిన ఫైనల్లో 88.13 మీటర్ల త్రోతో రెండో స్థానంలో నిలిచిన నీరజ్ చోప్రా.. సిల్వర్ మెడల్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. నీరజ్ చోప్రా తన తొలి ప్రయత్నాన్ని ఫౌల్ త్రో తో ప్రారంభించాడు. రెండో ప్రయత్నంలో 82.39మీ విసిరి నాలుగో స్థానానికి చేరుకున్నాడు. ఇక మూడో ప్రయత్నంలో 86.37 మీటర్లు విసిరాడు. నాలుగో ప్రయత్నంలో 88.13 మీటర్లు త్రో చేశాడు. ఇక తన అఖరి ప్రయత్నంలో నీరజ్ ఫౌల్ త్రో చేశాడు. దీంతో నాలుగో ప్రయత్నంలో విసిన దూరాన్ని అత్యధికంగా లెక్కించారు. ఇక గ్రెనేడియన్ జావెలిన్ త్రోయర్ అండర్సన్ పీటర్స్ 90.54 దూరం విసిరి గోల్డ్ మెడల్ కైవసం చేసుకున్నాడు. ఇక సిల్వర్ మెడల్ సాధించిన నీరజ్ చోప్రా అరుదైన ఘనత సాధించాడు. ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో పతకం నెగ్గిన రెండో భారత అథ్లెట్‌గా నీరజ్ చోప్రా రికార్డులకెక్కాడు. అంతకు ముందు 2003లో పారిస్‌లో జరిగిన ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో భారత లాంగ్ జంపర్ అంజూ బాబి జార్జ్ కాంస్య పతకం సాధించింది.
దీనిపై నీరజ్ చోప్రా స్పందిస్తూ.. వరల్డ్ అథ్లెటిక్స్ పోటీల్లో పతకం కోసం 19 ఏళ్ల భారత్ నిరీక్షణకు ముగింపు పలకడం సంతోషంగా ఉందని వెల్లడించాడు. ఇక, తాను రజతంతో సరిపెట్టుకోవడంపై ఈ ఒలింపిక్ చాంపియన్ వివరణ ఇచ్చాడు. ఒలింపిక్స్ తో పోల్చితే వరల్డ్ అథ్లెటిక్స్ చాంపియన్ షిప్ లో పోటీ అత్యంత కఠినంగా ఉంటుందని, పైగా, త్రోయర్లందరూ పూర్తి ఫిట్ నెస్ తో ఫామ్ లో ఉన్నారని వివరించాడు. సవాళ్లతో కూడిన పరిస్థితుల్లో, ఈ చాంపియన్ షిప్ లో రజతం సాధించడం తనకు సంతృప్తినిచ్చిందని వెల్లడించాడు. టోక్యో ఒలింపిక్స్ కంటే ఈ వరల్డ్ చాంపియన్ షిప్ లో మెరుగైన ప్రదర్శన కనబర్చానని తెలిపాడు. టోక్యో ఒలింపిక్స్ లో 87.58 మీటర్లు విసిరి స్వర్ణం సాధించిన చోప్రా, తాజాగా అమెరికాలోని యూజీన్ లో జరిగిన వరల్డ్ అథ్లెటిక్స్ చాంపియన్ షిప్ లో 88.13 మీటర్లతో రజతం సాధించాడు. ఒలింపిక్స్ కంటే ఎక్కువదూరమే జావెలిన్ విసిరినప్పటికీ చోప్రాకు రెండోస్థానం లభించిందంటే, వరల్డ్ చాంపియన్ షిప్ లో పోటీ ఎంత తీవ్రంగా ఉంటుందో స్పష్టమవుతోంది. ఈ చాంపియన్ షిప్ లో గ్రెనడాకు చెందిన ఆండర్సన్ పీటర్స్ 90.54 మీటర్లు విసిరి పసిడి చేజిక్కించుకున్నాడు.
నీరజ్ చోప్రాపై ప్రధాని మోదీ ప్రశంసల వర్షం :
ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో రజత పతకం సాధించి సంచలనం సృష్టించిన భారత జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రాపై ప్రధాని మోదీ ట్విటర్ వేదికగా ప్రశంసల వర్షం కురిపించారు. ప్రపంచపు అత్యుత్తమ అథ్లెట్లలో నీరజ్ ఒకడని కీర్తించారు. ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో 19 ఏళ్ల భారత నిరీక్షణకు తెరదించుతూ నీరజ్ పతకం సాధించినందుకు అభినందనలు తెలుపుతూ..భారత క్రీడల చరిత్రలో ఇదో ప్రత్యేకమైన రోజని అన్నారు. నీరజ్.. భవిష్యత్తులో మరిన్ని పతకాలు సాధించాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాని మోదీతో పాటు చాలామంది ప్రముఖులు, రాజకీయ నాయకులు నీరజ్‌కు అభినందనలు తెలిపారు.