సరికొత్తగా మై జీహెచ్‌ఎంసీ

Updated:16/04/2018 07:00 AM

my ghmc app huge response from people

నగర ప్రజలకు పౌర సేవలు అందిస్తున్న మై జీహెచ్‌ఎంసీ యాప్ సరికొత్తగా ముందుకొచ్చింది. అదనపు సేవలు, ఆధునిక ఫీచర్లతో హైదరాబాదీలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు సిద్ధమైంది. జీహెచ్‌ఎంసీ పరిధిలోని ప్రధాన సేవలను యాప్‌తో జోడిస్తూ రెండేండ్ల కిందట మై జీహెచ్‌ఎంసీ యాప్‌ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఆ యాప్‌నకు మరిన్ని విభాగాల సమాచారం జోడిస్తూ రూపొందించిన అప్‌గ్రేడెడ్ వెర్షన్‌ను ఆదివారం జీహెచ్‌ఎంసీ అధికారులు అందుబాటులోకి తీసుకొచ్చారు. లోగో డిజైన్ నుంచి ఫీచర్ల వరకు ఈ యాప్‌లో అన్నీ కొత్తగా ఉండటం విశేషం. మై జీహెచ్‌ఎంసీ యాప్ ద్వారా ఇప్పటికే రోడ్లు, నాలాలు తదితర ఫిర్యాదులు సమర్పించడంతోపాటు జనన-మరణ ధ్రువపత్రాలు పొందేందుకు అవకాశం ఉండేది. వీటికి అదనంగా మరిన్ని విభాగాల సమాచారం, చెల్లింపులు, సౌకర్యాలు వంటి అంశాలను ఈ యాప్‌నకు జోడించారు. మొత్తంగా మై జీహెచ్‌ఎంసీ యాప్ ద్వారా జీహెచ్‌ఎంసీకి సంబంధించిన అన్ని సేవలను వినియోగించుకునేలా ఆధునీకరించారు. ఈ యాప్ ద్వారా ఆస్తిపన్ను, ట్రేడ్ లైసెన్సు ఫీజుల చెల్లింపు, ఫిర్యాదులు అందించడం, సమీపంలో పార్కింగ్ సౌకర్యం, టాయిలెట్ సౌకర్యం ఎక్కడుందో తెలుసుకోవడం, బల్దియాకు సంబంధించిన కార్యాలయాలు, ఆట మైదానాలు, పార్కులు, స్విమ్మింగ్ పూల్స్ , ఫంక్షన్ హాళ్లు, మార్కెట్లు వంటివాటి సమాచారం, ఎల్‌ఆర్‌ఎస్ సమాచారం వంటివి తెలుసుకునే అవకాశాన్ని జీహెచ్‌ఎంసీ కల్పించింది.

ఫిర్యాదులన్నీ ఒకే గొడుగు కిందికి..
ప్రస్తుతం జీహెచ్‌ఎంసీకి అనేక మార్గాల ద్వారా ఫిర్యాదులు అందుతున్నాయి. ఆన్‌లైన్, కాల్ సెంటర్, టోల్ ఫ్రీ నం-100, మై జీహెచ్‌ఎంసీ యాప్, కమిషనర్, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శికి నేరుగా మ్యాన్యువల్‌గా వచ్చే ఫిర్యాదులు, ప్రజావాణి తదితర విధానాలు ఇందులో ప్రధానమైనవి. ఎన్ని మార్గాల ద్వారా ఫిర్యాదులు వచ్చినా అవన్నీ ఒకే గొడుగు కిందకు వచ్చి వాటి పరిష్కారం ఒక క్రమపద్ధతిలో జరిగే విధంగా జీహెచ్‌ఎంసీ అధికారులు సరికొత్త సాఫ్ట్‌వేర్‌ను అందుబాటులోకి తెచ్చారు. ఎవరు, ఏ విధంగా, ఏ విభాగంలో ఫిర్యాదుచేసినా వెంటనే రిజిస్ట్రేషన్ నంబర్ జనరేట్ అయ్యి ఫిర్యాదుదారు మోబైల్ నంబర్‌కు ఆ రిజిస్ట్రేషన్ నంబర్ చేరుతుంది. తర్వాత ఆ ఫిర్యాదు సంబంధిత శాఖకు బదిలీ అవుతుంది. ఫిర్యాదు పురోగతిని ఎప్పటికప్పుడు సందేశాల రూపంలో ఫిర్యాదుదారుకు అందుతుంది. ఆ నంబర్ ఆధారంగా ఎప్పుడైనా ఫిర్యాదు స్థితిని తెలుసుకోవచ్చు. ఫిర్యాదు పరిష్కారమయ్యేవరకు ఈ రిజిస్ట్రేషన్ నంబర్ పనిచేస్తుంది.