ఎన్నికలకు సిద్ధమవ్వండి..

- పిలుపునిచ్చిన మంత్రి కేటీఆర్..
- సిట్టింగ్ ఎమ్మెల్యేలపై తీవ్ర అసంతృప్తి..
- మంత్రి సంకేతాలకు అర్ధం ఏమిటి..?
- పీకే నిర్ణయమే ఫైనల్.. వారికే టికెట్లు..
- జోరందుకున్న ఊహాగానాలు..
- ఆందోళనలో ప్రస్తుత శాసనసభ్యులు..
- పీకే ను కాకా పట్టే పనిలో పలువురు ఎమ్మెల్యేలు..
- ఏమి జరుగబోతోందన్న లెక్కలు వేస్తున్న మేధావులు..
హైదరాబాద్, 12 జూన్ ( ఆదాబ్ హైదరాబాద్ ) :
తెలంగాణ శాసనసభను రద్దుచేస్తారన్న ఊహాగానాలు ఊపిరిపోస్తుకుంటున్నాయి.. ఎవరికీ వారు తమ అంచనాలు వేసుకోవడంతో నిమగ్నులయ్యారు.. త్వరలోనే శాసనసభ సమావేశాలు నిర్వహించి తెలంగాణపై కేంద్ర ప్రభుత్వ వివక్ష, రుణాలు తీసుకోవడంలో కేంద్రం నుంచి ఎదురవుతున్న సహాయ నిరాకరణ, రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయం తదితర అంశాలపై సభలో చర్చ జరగబోతున్నట్లు తెలుస్తోంది. ఎప్పుడనేది త్వరలోనే తేదీలు ఖరారు చేస్తారని తెలంగాణ రాష్ట్రసమితి వర్గాలు వెల్లడించాయి. ఈ ఏడాది చివరిలోనే తెలంగాణ ఎన్నికలు జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది..
నిజానికి షెడ్యూల్ ప్రకారం 2023 డిసెంబరులో తెలంగాణ శాసనసభకు ఎన్నికలు జరగాలి. అయితే ఎమ్మెల్యేలపై ప్రజల్లో వ్యతిరేకత నెలకొందని ప్రశాంత్ కిషోర్ టీమ్ సర్వే నిర్వహించి నివేదిక అందజేసింది. ఈసారి సిట్టింగ్ల్లో ఎక్కువమందికి టికెట్లు దక్కవని, వారికి ప్రత్యామ్నాయ పదవులిస్తానని కేసీఆర్ నేరుగా వారికి హామీ ఇవ్వబోతున్నట్లు టీఆర్ ఎస్ వర్గాల సమాచారం. ఐటీ మంత్రి కేటీఆర్ ఖమ్మం జిల్లా పర్యటనలో ఎన్నికలకు సిద్ధమవ్వాలంటూ నేతలకు పిలుపునివ్వడం ఈ ఊహాగానాలను మరింత బలపరుస్తోంది. కేసీఆర్ రూపొందించుకున్న ప్రణాళిక ప్రకారం ఈనెల 18 లేదా 19 తేదీల్లో జాతీయ పార్టీని ప్రకటిస్తారు. రాబోయే ఎన్నికల్లో గెలుపొందడానికి అభ్యర్థుల మార్పుతోపాటు ప్రచార వ్యూహాన్ని కూడా ఖరారు చేయనున్నారు. శాసనసభను వీలైనంత తొందరగా రద్దుచేసి ఎన్నికలకు వెళ్లాలన్న ఆలోచనలో కేసీఆర్ ఉన్నారు. అదే తనకు కలిసొస్తుందని ఆయన ప్రగాఢ నమ్మకం..
త్వరలో నిర్వహించబోయే శాసనసభ ప్రత్యేక సమావేశాలే చివరి సమావేశాలనే వార్తలు వస్తున్నాయి. ప్రశాంత్ కిషోర్ నిర్వహించిన సర్వేలో ముఖ్యమంత్రి కేసీఆర్పై ఎటువంటి వ్యతిరేకత లేనప్పటికీ దాదాపు 50 మంది ఎమ్మెల్యేలపై తీవ్రస్థాయిలో వ్యతిరేకత వ్యక్తమవుతోందని తేలింది. ముందుగా రాష్ట్రంలో పార్టీని అధికారంలోకి తేవాలన్న పట్టుదలతో ఉన్న కేసీఆర్ నిర్మొహమాటంగా ఈ 50 మందిని పక్కన పెట్టబోతున్నట్లు తెలుస్తోంది. పార్టీకోసం త్యాగం చేయాల్సిందేనని వారికి స్పష్టం చేయబోతున్నారు. రాష్ట్రంలో అధికారం చేజిక్కించుకున్న తర్వాత జాతీయస్థాయిలో బీజేపీపై పోరాడటం సులువవుతుందని కేసీఆర్ భావిస్తున్నారు.
మన దేశంలో ఎంతో పేరుమోసిన ఎన్నికల వ్యూహకర్త. ఈయన ఏదైనా పార్టీ కోసం పనిచేశాడంటే.. ఆ పార్టీ ఎన్నికల్లో విజయం సాధించాల్సిందే. గతంలో జరిగిన పలు ఎన్నికలు కూడా ఇదే విషయాన్ని చెబుతున్నాయి. ఐతే ప్రస్తుతం పీకే టీమ్ తెలంగాణలో టీఆర్ఎస్తో జత కట్టింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల కోసం ఇప్పటి నుంచే వ్యూహాలను రూపొందిస్తున్నారు ప్రశాంత్ కిశోర్. అసలు టికెట్లు ఎవరికి ఇవ్వాలి? ఎవరికి ఇవ్వొదన్నది కూడా ప్రశాంత్ కిశోరే డిసైడ్ చేయనున్నారు. ఆయన ఇచ్చే నివేదిక ఆధారంగానే టికెట్ల పంపిణీ ఉంటుంది. ఇదేదో రాజకీయ విశ్లేషకులు చేసిన కామెంట్స్ కాదు. స్వయంగా మంత్రి కేటీఆర్ ఈ విషయాన్ని వెల్లడించినట్లు ఓ ప్రముఖ పత్రిక కథనంలో పేర్కొంది. ప్రశాంత్ కిశోర్ ఇచ్చిన సర్వే రిపోర్టు ఆధారంగా టికెట్ల కేటాయింపు ఉంటుదని ఆయన స్పష్టం చేసినట్లు సమాచారం.
ప్రస్తుతం తెలంగాణలో ప్రశాంత్ కిశోర్ టీమ్ సర్వే చేస్తోంది. అన్ని నియోజకవర్గాల్లోనే క్షేత్రస్థాయిలో ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తోంది. ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది? కేసీఆర్ పాలన పట్ల సంతృప్తికరంగా ఉన్నారా? మీ ఎమ్మెల్యే ఎలా పనిచేస్తున్నాడు? ప్రజలకు అందుబాటులో ఉంటున్నాడా? వంటి అంశాలపై ప్రజల స్పందనను తెలుసుకుంటోంది. అనంతరం ఓ నివేదిక రూపొందిస్తారు. ఏయే ఎమ్మెల్యే పట్ల ప్రజలు అసంతృప్తిగా ఉన్నారన్న వివరాలను సీఎం కేసీఆర్కు అందజేస్తారు. దాని ఆధారంగానే టికెట్ల కేటాయింపు ఉంటుందని.. మంత్రి కేటీఆర్ మాటలను బట్టి అర్ధమవుతోంది. ఈ నేపథ్యంలో చాలా మంది ఎమ్మెల్యేల్లో టెన్షన్ మొదలయింది. ప్రజలకు తమకు వ్యతిరేకంగా చెబితే.. పరిస్థితి ఏంటని ఇప్పుడి నుంచే ఆలోచిస్తున్నారు.