ఖమ్మం మార్కెట్లో కనికట్టు మోసాలు

ఖమ్మం మార్కెట్లో కనికట్టు మోసాలు


కవర్ లేకుండా అమ్మకానికి ససేమిరా.
కవర్ తోపాటే ఇత్తడి సామాగ్రి తూకాలు.
కవర్ కూడా మెటల్ ధరలకే అమ్ముతున్న వైనం 
కనికట్టు మోసాలకు బలవుతున్న సామాన్యులు 
బిల్లులు లేకుండా సాగుతున్న జీర్ దందాలు 
కోట్లల్లో వ్యాపారం .. అడ్డుఅదుపులేని వ్యవహారంపై 
ఆదాబ్  హైదరాబాద్ అందిస్తున్న ప్రత్యేక కథనం 
ఖమ్మం జూన్ 15 ఆదాబ్ హైదరాబాద్.

 ఖమ్మంలో మెటల్ వ్యాపారుల అక్రమాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ధనార్జనే ధ్యేయంగా వ్యాపారులు కనికట్టు మోసాలతో  వినియోగదారులను అందిన కాడికి  దోచుకుంటున్నారు.ఓక పక్క  ప్రభుత్వ నిబంధనల తుంగలో తొక్కి, మరో వైపు ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతునే వినియోగదారుడికి పంగనామాలు పెడుతున్నారు. వినియోగదారులకు  ధరల పెరుగుదల బూచిని సాకుగా చూపించి కొనేవారికి చుక్కలు చూపిస్తున్నారు. ఖమ్మం జిల్లాలో అన్ని వ్యాపారాలు ఓ వైపు మెటల్ వ్యాపారాలు మరో వైపు అన్న చందంగా కొత్త కొత్త కిటుకులతో మెటల్  వ్యాపారులు సరి కొత్త మోసాలకు పాల్పడుతున్నారు. మెటల్ షాపుల్లో ఏ వస్తువు కొనుగోలు చేసిన కవర్ లేకుండ విక్రయించేందుకు వ్యాపారులు సాహసించడంలేదు. 

కవర్ కూడా మెటల్ ధరలకే అమ్ముతున్న వైనం 
అల్యూమినియం, రాగి, ఇత్తడి వస్తువులకు ఉన్న కవర్లతో పాటే తూకం వేసి వ్యాపారులు డబ్బులు దండుకుంటున్నారు . ప్రస్తుత మార్కెట్లో రాగి, వెండి, ఇత్తడి అల్యూమినియం ధరలు ఎలా ఉన్నప్పటికీ వాటి భారం వినియోగదారుడు కావాలనుకున్నప్పుడు  భరించాల్సి ఉంటుంది. అయితే  వినియోగదారుల అవసరాలను అవకాశంగా తీసుకున్న  వ్యాపారస్తులు చేస్తున్న మోసాలపై ఎవరికి పిర్యాదు చేయాలో అర్థం కావడంలేదంటున్నారు శ్రీనివాస మూర్తి (కొనుగోలుదారుడు ). మార్కెట్లో వాపారస్తులు అమ్మే వస్తువుల ధరల సూచికల బోర్డు లు కూడా ఎక్కడా  లేకపోవడంతో వ్యాపారస్తులు చెప్పిన ధరలను  చెల్లించి వినియోగదారులు కొనుగోళ్లు జరుపుతున్నారు. 

వ్యాపారస్తులు ఎంత చెబితే అంత 
వాస్తవానికి వస్తువుల ధరలు ఎంత ఉండాలి.. వ్యాపారస్తులు  ఎంత మేరకు ధరను నిర్ణయించి అమ్మకాలు జరుపాలి .. అన్న అంశాలపై ఎక్కడా స్పష్టత ఉండటంలేదు. వ్యాపారస్తులు ఎంత చెబితే అంత ధరలుగా అమ్మకాలు  కొనసాగుతున్నాయి.  వీరిని అడిగే నాధుడు గాని, ప్రశ్నించే పాలకుడు గాని లేరు.దీంతో ఖమ్మం జిల్లా వ్యాపారులు ఆడింది ఆటగా పాడింది  పాటగా కొనసాగుతూ వస్తుంది. అమ్మకాలు జరిపే  రాగి,ఇత్తడి,అల్యూమినియం వస్తువులకు ప్లాస్టిక్ కవర్ తో పాటు తూకం వేయడంతో  వినియోగదారుడు భారీ ఎత్తున నష్టపోతున్నాడు .

బిల్లులు లేకుండా సాగుతున్న జీర్ దందాలు 
ప్రతి వస్తువుకు ఉపయోగించే ప్లాస్టిక్ కవర్ సగటున 30 నుంచి 100 గ్రాముల వరకు బరువు ఉంటుంది. దీని ధర కూడా వినియోగదారుడు అదనంగా చెల్లించాల్సి వస్తుంది.  ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఈ మెటల్ వ్యాపారం కోట్లల్లో నడుస్తుంది . ఎవ్వరు దీనిని పట్టించుకోకపోవడంతో వ్యాపారులు ఈ దందాను నిరాటంకంగా కోనసాగిస్తున్నారు. ఈ వ్యాపారం జిల్లాకేంద్రమైన ఖమ్మం తో పాటు వైరా,తల్లాడ,మధిర, కల్లూరు, సత్తుపల్లి, పెనుబల్లి,కూసుమంచి తదితర ప్రాంతాల్లో వ్యాపారులకు మంచి  లాభాలను తెచ్చిపెడుతున్నాయి. ఈ వ్యాపారులు పలు సందర్భాల్లో తూకంలోనూ, బిల్లుల్లో  కూడా మోసాలకు పాల్పడుతున్నారు. వినియోగదారుడికి విక్రయించిన ప్రతి వస్తువుకు ఒరిజినల్ బిల్లు ఇవ్వకుండానే నోటి లెక్కలు చెప్పి డబ్బులు తీసుకుంటున్నారు.  ఒకవేళ ఎవరైనా బిల్లు అడిగితే షాప్ పేరు  వున్నా బిల్ ఇచ్చి  ప్రభుత్వానికి చెల్లించాల్సిన టాక్స్ కు  పంగనామాలు పెడుతున్నారు.

ఖమ్మం జిల్లా ఆ  నలుగురు వ్యాపారులదే 
 ఓ నలుగురు వ్యాపారులే ఖమ్మం జిల్లా ను శాసిస్తున్నారు. మిగతా వ్యాపారులను వీరి కనుసన్నల్లో ఉంచుకొని హవా చెలాయిస్తున్నారు. బిల్లులు లేకుండా వ్యాపారం చేసిన ప్రభుత్వానికి టాక్స్ చెల్లించక పోయిన, ప్లాస్టిక్ కవర్ కు మెటల్ రేట్ ను నిర్ణయించినా, సాహసించి అడిగే నాథుడే కరువయ్యాడు. ప్రస్తుతం ఇత్తడి ధర 600 నుంచి వెయ్యి రూపాయల వరకు ఉన్నప్పటికీ ఖమ్మం వ్యాపారులు మాత్రం వేయి పైనే వసూలుచేస్తున్నారు.  జిల్లా వ్యాప్తంగా వేలాది మంది వ్యాపారులు నిత్యవసర వస్తువులైన ఇత్తడి, రాగి, అల్యూమినియం కొనుగోలు చేయక తప్పడం లేదు గుట్టుచప్పుడు కాకుండా ఈ అక్రమ వ్యాపారం నిరాటంకంగా కొనసాగుతుంది. ఈ అక్రమ వ్యాపారం పై ఎవరు చర్య తీసుకుంటారు తెలీయక వినియోగదారులు  విస్మయానికి గురవుతున్నారు. ఇప్పటికైనా  ఈ అక్రమాలపై  పాలకులు దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉందని .. స్థానికులు కోరుతున్నారు. .

Tags :