మోడీ దేశభవిష్యత్తును తాకట్టుపెట్టారు.. - మేకిన్ ఇండియా పేరుతో మోసం చేశారు..

మోడీ దేశభవిష్యత్తును తాకట్టుపెట్టారు..
- మేకిన్ ఇండియా పేరుతో మోసం చేశారు..
- చైనా వస్తువులు దిగుమతి చేసుకోవడం గొప్పా.. ?
- దీనిపై దేశంలో ఎక్కడైనా చర్చకు సిద్దమే..
- అసత్య ప్రచారాగాళ్లను నమ్మితే నట్టేట మునుగుతాం..
- జగిత్యాల సభలో బిజెపిపై నిప్పులు చెరిగిన సీఎం కేసీఆర్..
జగిత్యాల, 07 డిసెంబర్ ( ఆదాబ్ హైదరాబాద్ ) :
భారతదేశ భవిష్యత్ గురించి, బాగుపడటం కోసం ఈ దేశం పిడికిలి ఎత్తాలి.. మన ఆస్తులను కాపాడుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునిచ్చారు. బీజేపీ దేశానికి చాలా ప్రమాదకరమని సీఎం కేసీఆర్ అన్నారు. ఈ దేశం మారాల్సిన అవసరం ఉందన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంపై నిప్పులు కేసీఆర్ చెరిగారు. జగిత్యాల జిల్లాలో పలు అభివృద్ధి పనులకు సీఎం ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేశారు. మోతె వద్ద జరిగిన బహిరంగ సభలో పాల్గొన్నారు. ప్రధాని మోదీ, కేంద్ర సర్కారు తీరుపై ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ’మేకిన్ ఇండియా ఏం కనిపిస్తుంది? కోరుట్ల మిషన్ దవాఖాన పక్కన చైనా బజార్ తప్ప ఏవిూ లేదని అన్నారు. బిజెపి తీరును ఎండగట్టారు. దండం పెట్టి మాట్లాడుతున్నా. నా వెంట నడవండి తెలంగాణ వస్తదని చెప్పాను. విూ అందరి తోడ్పాటు, ధర్మపురి నరసింహ్మా స్వామి దయ వల్ల తెలంగాణ వచ్చింది. మన చుట్టూ జరిగే దాన్ని గమనించకపోతే ప్రమాదంలో పడుతాం. గోల్ మాట్ గోవిందం గాళ్లు, కారుకూతులు కూసేవాళ్లు తిరుగుతున్నారు. మనం అప్రమత్తంగా లేకపోతే మునిగిపోయే ప్రమాదం ఉంటది. చాలా పెద్ద దెబ్బ తగిలే ప్రమాదం ఉంటది. భారతదేశ రాజకీయాలను తెలంగాణ ప్రభావితం చేయాలి. తప్పకుండా ఈ దుష్ట సంప్రదాయాలు పోవాలన్నారు. కరెక్ట్‌గా మనం వచ్చినప్పుడే దేశంలో మోదీ ప్రధాని అయ్యిండు. ఒక్క మంచి పనైనా జరిగిందా? సాగు, మంచినీటి, కరెంట్ రంగంలో మంచి జరిగిందా? ఆయనకు డైలాగులు బాగా చెప్తాడు. మేకిన్ ఇండియా అంటడు. పిల్లలు కాల్చే పటాకులు, పతంగులను ఎగురవేసే మాంజా చైనా నుంచి వస్తాయా? ఇదేనా మేకిన్ ఇండియా. దీపాంతలు కూడా చైనా నుంచి వస్తాయా. భారతదేశ జాతీయ జెండా చైనా నుంచి దిగుమతి అయితదా? ఇదేనా మేకిన్ ఇండియా. ఉన్న ఆస్తులను ఊడగొడుతూ, ప్రభుత్వ రంగ సంస్థలను అమ్ముతుండు. కరెంట్ ప్రయివేటీకరణ చేస్తాం, ముక్కు పిండి వసూలు చేస్తామని మాట్లాడుతు న్నారు. చితాలు ఇవ్వకూడదంట. కానీ ఎన్పీఏల పేరిట ఇప్పటికే 14 లక్షల కోట్ల రూపాయాలను ప్రజల ఆస్తులను దోచి పెట్టింది బీజేపీ పార్టీ 8 సంవత్సరాల నుంచి. లక్షలాది మంది ఉద్యోగులు ఉన్న ఎల్ఐసీని అమ్మేస్తాం అంటున్నారు. కేంద్ర బడ్జెట్‌కు సమానంగా ఎల్ఐసీ రూ. 35 లక్షల కోట్ల ఆస్తులు కలిగి ఉంది. ప్రజల సొత్తు విూ జాగీర్ లాగా, విూ అబ్బ సొత్తులాగా, ప్రజల సొత్తును షావుకార్లకు కట్టబెడుతామంటే భారతదేశం పిడికిలి ఎత్తాలి అని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. ఎల్ఐసీలో ఉండే ఏజెంట్ మిత్రులు పిడికిలి బిగించి సైనికులు కావాలి. మన ఆస్తులను కాపాడుకోవాలి. కరెంట్‌ను ఎలా ప్రయివేటికరిస్తారు. ఈ అరాచకం ఇలానే కొనసాగితే పెట్టుబడిదారుల రాజ్యం అవుతది తప్పపేద ప్రజల సంక్షేమం చూడరు. దయచేసి ఆలోచించాలి. సబ్ కా వికాస్ అన్నారు కానీ వికాసం లేదు. అంగన్వాడీల నిధులు కోతపెట్టి బేటీ పడావో బేటీ బచావో అని నినాదాలు ఇస్తారు. ఎన్ని రోజుల ఈ మోసపు నినాదాలు అంటూ ప్రశ్నలు గుప్పించారు. బీజేపీ పాలిత రాష్టాల్లో నిత్యం మహిళలపై రేప్‌లు, దళితుల విూద దౌర్జన్యాలు జరగకుండా ఉండని రోజు ఉందా? ఈ దేశం మారాలి.
లేకపోతే అన్ని రకాలుగా నష్టపోతాం. మేకిన్ ఇండియాలో ఏం రాకపోయినప్పటికీ.. దేశంలో 10 వేల పరిశ్రమలు మూతపడ్డాయి. ఈ దేశంలో ఏ నగరంలో అంటే అక్కడ నేను చర్చకు సిద్ధం అని చెప్పారు. 50 లక్షల మంది ఉద్యోగాలు ఊడిపోయాయి. 10 వేల మంది పెట్టుబడిదారులు దేశాన్ని వదిలిపెట్టి పోతున్నారు. ఉన్నవి ఊసిపోతున్నాయి.. కొత్తగా వచ్చిందేవిూ లేదు. దేశానికి ఏ రంగంలో ఏం జరిగిందో యువకులు, మేధావులు, విద్యావంతులు ఆలోచించాలి. మనమంతా అప్రమత్తంగా ఉండాలి అని కేసీఆర్ సూచించారు. ఇకపోతే ఊరూరుకి చైనా బజార్లు విస్తరిస్తున్నాయని.. ఇదేనా మేకిన్ ఇండియా ? అంటూ ప్రధాని నరేంద్ర మోదీపై సీఎం కేసీఆర్ ధ్వజమెత్తారు. జగిత్యాల అంగడి గ్దదెలకాడ చైనా బజార్. కరీంనగర్ సర్కస్‌గ్రౌండ్ చైనా బజార్. ఇదేనా మేకిన్ ఇండియా. మేకిన్ ఇండియా బజార్ ఎటువాయే? ఊరూరుకి చైనా బజార్ ఎందుకు రావట్టే. గోర్లు కత్తిరించుకునే నేయిల్ కట్టర్లు, గడ్డంగీసుకునే బ్లేడ్లు, కూసుండే కూర్చీలు, సోఫాలు, దీపావళి పటాకులు సైతం చైనా నుంచి రావాలా? ఎవరిని ప్రోత్సహిస్తున్నరు ? ఏం జరుగుతుందీ దేశంలో ? దీనిపై పెద్ద ఎత్తున ఆలోచన లేయాలే. లేకుంటే పెద్ద ఎత్తున దెబ్బతింటాం. మోసపోయి ఉంటే గోసపడుతాం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ విషయాలపై చర్చించాలే’ అన్నారు. భారతదేశ భవిష్యత్, దేశం బాగు కోసం, ఈ దేశంలో ఉన్న నదులు భూమి విూదకు వచ్చిందో.. తెలంగాణ ఎలా పచ్చపడ్డదో దేశమంతా బాగుపడే పద్ధతులు రావాలన్నారు. కడుపునిండా కరెంటు రావాలే. ప్రధాని సొంత రాష్ట్రంలో కరెంటు రాదు. దేశ రాజధాని ఢల్లీలో 75 సంవత్సరాల తర్వాత కడుపునిండా నీళ్లు రావు. కరెంటు కోతలు తప్పడం లేదు. ఈ భారతదేశమేనా మనకు కావాల్సింది ? స్వతంత్రం కోసం పోరాటం చేసిన పెద్దలు, సమరయోధులు త్యాగాలు చేసింది ఇందుకేనా? ఈ దేశం మారాలి. ఒక్క తెలంగాణ బాగుపడితే కాదు. తెలంగాణ జీడీపీ 5లక్షల నుంచి 11.50లక్షల కోట్లకు పెరిగింది. తెలంగాణ పని చేసిన మందం కేంద్ర ప్రభుత్వం పని చేసి ఉంటే మన జీఎస్డీపీ 11.50లక్షల కోట్లు కాదు.. 14.50లక్షల కోట్లుండేదని అన్నారు. కేంద్రం దద్దమ్మ చేతగాని తనం వల్ల తెలంగాణ రాష్ట్రం 3లక్షల కోట్లు నష్టపోయింది. ఇంటికి వెళ్లిన తర్వాత మేధావులను అడిగితే వాస్తవ విషయాలు తెలుస్తాయి. అప్రమత్తంగా లేకపోతే.. ఒక ఒరవడి, ప్రచార హోరులో కొట్టుకొని పోతే మళ్లీ ఆగమై పోతాం. ఆనాటి తెలంగాణ నాయకత్వం చేసిన ఒక్క చిన్న పొరపాటు వల్ల 60 సంవత్సరాలు గోసపడ్డాం. ఎంత మంది చనిపోయారు ? ఎన్ని ఉద్యమాలు చేయాల్సి వచ్చింది? ఎన్నిచోట్ల తిరగాల్సి వచ్చింది? ఎన్ని బాధలు పడాల్సి వచ్చింది? ఎన్ని పాటలు పడాల్సి వచ్చింది? ఎన్ని నిరాహార దీక్షలు చేయాల్సి వచ్చింది? మన ఉద్యోగులు ఎన్ని ఉద్యమాలు చేయాల్సి వచ్చింది? ఒక్క చిన్న పొరపాటుకు 60 సంవత్సరాలు గోసపడ్డ జాతి మనది. ఈ రోజు కూడా డంబాచారం, గోల్మాల్ గోవిందం గాళ్లను నమ్మితే కిందావిూద ఆగమైపోతం అంటూ హెచ్చరించారు. మేకిన్ ఇండియాపై చర్చకు సిద్ధమంటూ కేసీఆర్ పేర్కొన్నారు. ఈ దేశంలో ఎక్కడంటే అక్కడ నేను చర్చకు సిద్ధమని కేసీఆర్ ప్రకటించారు. ఈ దేశంలో ఏ నగరంలో అంటే ఆ నగరంలో చర్చకు సిద్ధం. 50 లక్షల మంది ఫ్యాక్టరీ ఉద్యోగాలు ఊడిపోయాయి. సంవత్సరానికి 10 లక్షల మంది బడా పెట్టుబడిదారులు భారతదేశాన్ని వదిలి బయటకు వెళ్తిపోతున్నారు. మేకిన్ ఇండియా అంటే అన్నవస్త్రానికి పోతే ఉన్న వస్త్రం పోయిందనట్టు ఉన్నవి ఊసిపోతున్నాయి తప్ప కొత్తగా వచ్చిందేవిూ లేదు. మాటల గారడీ, డంబాచారం, డబ్బాల పలుగు రాళ్లు వేసి ఊపినట్టు లోడ లోడ మాట్లాడుడు తప్ప దేశానికి ఏ రంగంలో ఏం జరిగింది. ముఖ్యంగా యువకులు, చదువుకున్న వారు.. విద్యావంతులు, రచయితలు, కళాకారులు, మేధావులు దయచేసి ఇక్కడి నుంచి పోయిన తర్వాత విూ విూ గ్రామాల్లో చర్చ పెట్టాలి. మన చుట్టూ ఏం జరుగుతుందో గమనించి, మనం అప్రమత్తంగా ఉండాలి. లేకపోతే ప్రమాదంలో పడిపోతాం. దెబ్బ తింటాం. ఒక్కసారి ఇబ్బంది వస్తే చాలా ఘోరంగా వంద సంవత్సరాలు వెనక్కి పోతాం అని కేసీఆర్ పేర్కొన్నారు.
మరో పదిరోజుల్లో రైతుబంధు జమ.. తెలంగాణలో మాత్రమే 24 గంటల కరెంట్.. గుజరాత్ల్ఓనూ కరెంట్ కోతలే.. బతికున్నంతవరకు రైతుబంధు, రైతుబీమా
అందిస్తామని సిఎం కెసిఆర్ వెల్లడించారు.. దేశంలో తెలంగాణ అన్ని రంగాల్లో నెంబర్ వన్ గా ఉందని సీఎం కేసీఆర్ అన్నారు. తలసరి విద్యుత్ వినియోగంలో..తలసరి ఆదాయంలో...ఆర్థిక వనరుల పెంపులో తెలంగాణ అగ్రస్థానంలో ఉందని చెప్పారు. 8 ఏండ్లలో తెలంగాణ పనిచేసిన మందం కేంద్రం పనిచేసుంటే..రాష్ట్ర తలసరి ఆదాయం పద్నాలుగున్నర లక్షలు ఉండేదన్నారు.