కేసీఆర్ 'ఢిల్లీ గర్జన' వెనుక వ్యూహాలు, సమీకరణాలు..

Updated:05/03/2018 09:10 AM

kcr plans for national politics

తెలంగాణ సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాలపై దేశవ్యాప్తంగా చర్చ ఊపందుకుంది. అన్నీ కలిసొస్తే దేశానికి నాయకత్వం వహిస్తానన్న దిశగా కేసీఆర్ చేస్తున్న ప్రయత్నాలు సర్వత్రా కొత్త చర్చకు ఊతమిచ్చాయి. కేసీఆర్ 'థర్డ్ ఫ్రంట్' ఢిల్లీ పీఠాన్ని ముద్దాడుతుందా? లేదా? అన్నది పక్కనపెడితే కొన్ని ఆసక్తికర సమీకరణాల గురించి మాత్రం తప్పక మాట్లాడుకోవాల్సి ఉంటుంది. ఇలా కూడా వర్కౌట్ కావచ్చు..: తెలంగాణలో నాలుగేళ్ల పాలన తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం పట్ల ప్రజల్లో కొంత వ్యతిరేకత పెరిగిందన్న ప్రచారం ఉంది. టీఆర్ఎస్ మాత్రం ఆ వాదన నూటికి నూరు పాళ్లు అబద్దమనే చెబుతోంది. సరే, నిజానిజాల సంగతి పక్కనపెడితే.. కేసీఆర్ 'దేశ్ కీ నేత'గా ఎదగడానికి ప్రయత్నిస్తున్న క్రమం.. తెలంగాణలో ఆయన పట్ల ఉన్న వ్యతిరేకతను కనుమరుగు చేయవచ్చు.

తెలంగాణ వాడిగా జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పే వ్యక్తికి కచ్చితంగా ఇక్కడి ప్రజలు మద్దతునిచ్చే అవకాశాలే ఎక్కువ కాబట్టి.. ఆ రకంగా టీఆర్ఎస్ పట్ల వ్యతిరేకతను అధిగమించడంలో కేసీఆర్ స్ట్రాటజీ వర్కౌట్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. కేటీఆర్ రాష్ట్రంలో.. హరీశ్ ఢిల్లీలో?..: తాను దేశ రాజకీయాల వైపు దృష్టి సారిస్తున్నట్టు చెప్పడం ద్వారా.. తెలంగాణలో కేటీఆర్‌కు లైన్ క్లియర్ చేస్తున్నట్టే అని కూడా చెప్పవచ్చు. ఎలాగూ కేసీఆర్ తర్వాత టీఆర్ఎస్ లో నం.2 స్థానం కేటీఆర్‌దే కాబట్టి.. రాష్ట్ర నాయకత్వాన్ని ఆయన చేతుల్లో పెట్టి కేసీఆర్ ఢిల్లీలో చక్రం తిప్పే పనుల్లో నిమగ్నం కావచ్చు. అదే సమయంలో మేనల్లుడు, మరో కీలక నేత అయిన హరీశ్ రావును కేసీఆర్ ఎంపీగా పోటీ చేయించే అవకాశాలు కూడా ఉన్నాయనే వాదన వినిపిస్తోంది. ఢిల్లీ పాలిటిక్స్ కవర్ చేయడానికి హరీశ్ తనకు తోడుగా ఉంటాడన్న ఉద్దేశంతోనే ఆయన్ను ఎంపీగా పోటీ చేయించే అవకాశాలు ఉన్నాయంటున్నారు.

బాబు కంటే ముందు: ఇక థర్డ్ ఫ్రంట్ విషయానికొస్తే.. నిజానికి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఈ విషయంలో ముందు పడుతారని కొంతమంది భావించారు. కానీ అనూహ్యంగా కేసీఆర్ తెర పైకి రావడం చకచకా దాని పరిణామాలు కూడా విస్తరిస్తుండటం గమనార్హం. అయితే కేసుల విషయంలో కావచ్చు.. కమ్యూనికేషన్ విషయంలో మిగతా వారి కంటే కేసీఆర్ కు కలిసొచ్చే విషయాలు కొన్ని ఉన్నాయి. ఆరోపణలే తప్ప.. ఇరికించేంతే కేసులున్నాయా?: కేసీఆర్ కేసులకు భయపడి జాతీయ రాజకీయాల మాటెత్తాడు అని కొంతమంది విమర్శిస్తున్నారు. అయితే ఇప్పటిదాకా ఆరోపణలే తప్ప కేసీఆర్ మీద నేరుగా ఏ కేసు ఫైల్ కాలేదు. మిషన్ భగీరథలో వేల కోట్ల అవినీతి జరిగిందని కాంగ్రెస్ ఆరోపించింది తప్పితే.. దానికి తగ్గ ఆధారాలేవి చూపించలేకపోయింది. ఇక కాంగ్రెస్ ఎంపీ మధుయాష్కీ సైతం ఈడీ కేసులు అంటూ అప్పట్లో చేసిన హడావుడి అంతకే పరిమతమైంది. కాబట్టి కేసీఆర్ ను ఇరికించేంత సీరియస్ కేసులేవి ఆయన చుట్టూ లేవనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఏపీ సీఎం చంద్రబాబు కంటే తెలంగాణ సీఎం కేసీఆర్‌కు తెగింపు ఎక్కువన్న సంగతి కూడా తెలిసిందే. నాన్చుడు ధోరణి కాకుండా సూటిగా సుత్తి లేకుండా కుండ బద్దలు కొట్టేయగలరు. నిజానికి చంద్రబాబుకు కేసుల విషయంలో ఎక్కడో భయం ఉండబట్టే మోడీకి వ్యతిరేకంగా థర్డ్ ఫ్రంట్ కూడగట్టాలనే ఆలోచన చేయలేదన్న వాదన ఉంది. అందుకే వెనుక నుంచి కేసీఆర్‌కు ఆయన మద్దతునివ్వాలని చూస్తున్నట్టు చెబుతున్నారు. కమ్యూనికేషన్ బిగ్ ప్లస్..: ఇక మిగతావాళ్ల కంటే కేసీఆర్ కు ఉన్న ప్రధాన అడ్వాంటేజ్ కమ్యూనికేషన్. తెలుగు, హిందీ, ఉర్దూ, ఇంగ్లీషుల్లో ఆయనకున్న ప్రావీణ్యత ఉత్తరాది రాజకీయ నాయకులను కలుపుకోవడంలో బాగా పనిచేయవచ్చు. ఏదేమైనా కేసీఆర్ థర్డ్ ఫ్రంట్ ఎంతమేర విజయం సాధిస్తుందనేది పక్కనపెడితే.. ఇప్పుడాయన గర్జన మాత్రం ఢిల్లీ స్థాయిలో వినిపిస్తోంది. అయితే అది గర్జన అవుతుందా? లేక పిల్లి మొగ్గలేనా? అన్నది వేచి చూడాలి.