ఉద్యోగాలున్నాయ్‌ అడవిలో

Updated:12/04/2018 12:08 PM

jobs in forest

 

ఇంటర్‌ తర్వాత వైద్యవిద్య, ఇంజినీరింగ్‌ కోర్సుల్లో ప్రవేశానికి ఎక్కువమంది విద్యార్థులు పోటీపడుతుంటారు. మరికొందరు బీఫార్మసీ, బీఎస్సీ అగ్రికల్చర్‌ తదితరాల వైపు దృష్టి సారిస్తుంటారు. అందుకు భిన్నంగా తెలంగాణ అటవీశాఖ రాష్ట్రంలో తొలిసారిగా సిద్దిపేట జిల్లా ములుగులో ప్రవేశపెట్టిన నాలుగేళ్ల ‘బీఎస్సీ ఫారెస్ట్రీ’ వృతి విద్యా కోర్సు ప్రతిభావంతులైన విద్యార్థులను ఆకర్షిస్తోంది. రిజర్వేషన్‌ విద్యార్థులకు సైతం ఇంటర్‌లో కనీసం 98-100 శాతం మార్కులు ఉంటేతప్ప..ఇందులో ప్రవేశం లభించడంలేదంటే దీనికి ఎంత గిరాకీ ఉందో అర్థంచేసుకోవచ్చు. అంతకన్నా విశేషమేమిటంటే..ఇక్కడ చేరుతున్న ప్రతి ముగ్గురిలో ఇద్దరు విద్యార్థినులే కావడం. త్వరలోనే అటవీ వృత్తి విద్యపై ఎమ్మెస్సీ, పీహెచ్‌డీ కోర్సులతోపాటు..పర్యావరణ సైన్స్‌, ఫారెస్ట్‌ మేనేజ్‌మెంట్‌ వంటి కోర్సుల్ని ప్రవేశపెట్టడంతోపాటు.. విశ్వవిద్యాలయం ఏర్పాటు దిశగా అటవీశాఖ సిద్ధం అవుతోంది.
విదేశీ విశ్వవిద్యాలయాలతో ఒప్పందాలు
2016-17లో ప్రారంభమైన ఈ కోర్సును తాత్కాలికంగా ‘ధూలపల్లి ఫారెస్ట్‌ అకాడమీ’లో అటవీశాఖ నిర్వహిస్తోంది. ఇక్కడ 50 సీట్లు ఉంటే దాదాపు ఏడువేల మంది పోటీపడుతున్నారు. 2018-19 నుంచి మాత్రం ఎంసెట్‌ ద్వారా సీట్లు భర్తీ చేయాలని నిర్ణయించారు. మెరుగైన బోధన కోసం బ్రిటన్‌లోని కొలంబియా, కెనడాలోని అబర్న్‌ విశ్వవిద్యాలయాలతో విద్యార్థులు, లెక్చరర్ల పరస్పర మార్పిడికి అటవీశాఖ సూత్రప్రాయంగా ఒప్పందం కుదుర్చుకుంది.


మెట్టుపాలయం స్ఫూర్తితో
పూర్తిగా అటవీవిద్యకు సంబంధించి డిగ్రీ, పీజీ కోర్సులు తెలంగాణ మినహా ఇతర రాష్ట్రాల్లో చాలాకాలంగా ఉన్నాయి. ముఖ్యంగా తమిళనాడులోని మెట్టుపాలయం కళాశాల వీటికి ప్రసిద్ధి. ఇక్కడ అభ్యసించిన వారిలో 165 మంది ఆ తర్వాత ఐఎఫ్‌ఎస్‌లు అయ్యారు. సీఎం ఓఎస్డీ ప్రియాంకవర్గీస్‌, మంచిర్యాల జిల్లా కలెక్టర్‌ కర్ణన్‌ ఆ కళాశాలలో చదువుకున్న వారే.
పరిశోధన కేంద్రం నిర్మాణ పనులు ముమ్మరం
దీనికి అనుబంధంగా ‘ఫారెస్ట్‌ కాలేజ్‌, పరిశోధన కేంద్రం’ కూడా రూపుదిద్దుకుంటోంది. సికింద్రాబాద్‌ నుంచి కరీంనగర్‌ వెళ్లే రహదారిలో ములుగు వద్ద ఐదు హెక్టార్లలో రూ.75 కోట్ల వ్యయంతో కళాశాల, వసతి భవనాల నిర్మాణాలు వేగంగా జరుగుతున్నాయి. ‘జులై కల్లా ప్రస్తుతం ధూలపల్లిలో కొనసాగుతున్న కళాశాలను ఈ క్యాంపస్‌లోకి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. పక్కనే 195 హెక్టార్ల అటవీ ప్రాంతాన్ని చెట్ల ఎదుగుదల, పంటల దిగుబడిపై పరిశోధనలకు ఉపయోగించనున్నాం.’ అని డిప్యూటీ డైరెక్టర్‌ శ్రీనివాస్‌ తెలిపారు.

ఉద్యోగాల్లో రిజర్వేషన్‌
బీఎస్సీ ఫారెస్ట్రీ కోర్సు చేసిన వారికి ఇతర రాష్ట్రాల్లో అటవీశాఖ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు ఉన్నాయి. అదే తరహాలో సెక్షన్‌, రేంజ్‌, బీట్‌ అధికారుల పోస్టుల భర్తీలో 25-75 శాతం వరకు రిజర్వేషన్లు కల్పించాలని అటవీశాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది.