దేశ వ్యాప్తంగా యోగా దినోత్సవ వేడుకలు..

దేశ వ్యాప్తంగా యోగా దినోత్సవ వేడుకలు..


- ప్రధాని సహా పలువురు నాయకుల యోగా కార్యక్రమాలు.. 
- అందరూ ఆరోగ్యంగా ఉండాలంటే యోగా తప్పనిసరి.. 
- ఎముకలు కొరికే చలిలో సైనికుల యోగాసనాలు.. 
- యోగాను మన దినచర్యలో భాగంగా చేసుకోవాలి : మోడీ.. 

న్యూ ఢిల్లీ, 21 జూన్ ( ఆదాబ్ హైదరాబాద్ ) : 

భారతీయ సనాతన ధర్మంలో యోగా ఒక విశిష్ట స్థానంలో ఉంది.. యోగా అనే ప్రక్రియను ఈ ప్రపంచానికి పరిచయం చేసిన ఘనత మన పూర్వీకులకు దక్కుతుంది..  
అశాంతి నుంచి ప్రశాంత స్థితిని సాధించడానికి, ప్రపంచాన్ని వసుధైక కుటుంబంగా మార్చేందుకు యోగా తోడ్పడుతుంది. యోగా కేవలం వ్యాయామం, ఆరోగ్యానికి సంబంధించింది మాత్రమే కాదు. అది శక్తిమంతమైన జీవన మార్గం. మనసు లగ్నం చేసి క్రమం తప్పకుండా సాధన చేస్తే శారీరకంగా, మానసికంగా మనిషిని యోగా ఉన్నత స్థితికి చేరుస్తుంది. యోగా అంటేనే ఐక్యత. కుల మత లింగ భేద భావనలు లేకుండా సరిహద్దులు, అసమానతలు, అనుమానాలు, అభద్రత వంటి భయాలను పారద్రోలి ప్రపంచమంతా ఒకే కుటుంబంగా జీవించాలన్నదే భారతీయ యోగా దృక్పథం.

అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా దేశ వ్యాప్తంగా యోగా వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. కర్ణాటక మైసూరులో నిర్వహించిన యోగా కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని మోడీ.. ఆసనాలు వేసి అందర్నీ ఉత్తేజపరిచారు. యోగా ఫర్ హ్యుమానిటీ అనే నినాదంతో ఈ ఏడాది యోగా వేడుకలకు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, గవర్నర్లు, మంత్రులు యోగా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మరికొందరు తమ ఇళ్లలోనే ఉండి యోగాసనాలు వేసి, అందరూ ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ యోగా తప్పనిసరిగా చేయాలని సూచిస్తున్నారు. వీరే కాదు.. భారత సరిహద్దులో విధులు నిర్వహిస్తూ.. తమ ప్రాణాలను సైతం దేశానికి అర్పించేందుకు సిద్ధంగా ఉండి... ధైర్యానికి మారుపేరుగా నిలుస్తోన్న జవాన్లు కూడా ఎముకలు కొరికే చలిలో, మంచుకొండల్లో కొన్ని వేల ఎత్తులో ఉండి యోగాసనాలు చేసి, అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు.

ప్రపంచంలోనే అత్యంత పురాతన విశ్వవిద్యాలయంగా పేరుగాంచిన   బీహార్‌లోని నలంద మహావిహారలో ఇంటర్నేషనల్ యోగా దినోత్సవ వేడుకల్లో ఘనంగా నిర్వహించారు.  ఈ ఉత్సవాల్లో కేంద్రం  విద్యుత్ శాఖ మంత్రి ఆర్.కె.  సింగ్ పాల్గొన్నారు.  700 మందితో ఆయన యోగాసనాలు వేయించారు. సికింద్రాబాద్ లోని పరేడ్ గ్రౌండ్  లో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు అట్టహాసంగా నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన ప్రజలు..వరుస క్రమంలో కూర్చోని యోగాసనాలు వేశారు. ఈ వేడుకల్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధు పాల్గొని యోగాసనాలు వేశారు. 

8వ అంతర్జాతీయ యోగా దినోత్సవంలో  కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ పాల్గొన్నారు. ఢిల్లీలోని తన నివాసంలో యోగాసనం వేశారు. యోగాభ్యాసం తన జీవితంలో భాగమని రాజ్ నాథ్ సింగ్ తెలిపారు.  యోగా దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలందరికి మంచి ఆరోగ్యం చేకూరాలని కోరుకుంటున్నట్లు రాజ్ నాథ్ సింగ్ చెప్పారు. హర్యానాలోని కురక్షేత్రలో యోగా డే వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో కేంద్ర మంత్రి పీయూల్ గోయల్ పాల్గొని యోగాసనాలు వేశారు. గుజరాత్ లో జరిగిన అంతర్జాతీయ వేడుకల్లో  కేంద్ర ఆరోగ్య మంత్రి డా. మన్సుఖ్ మాండవియా పాల్గొన్నారు.  కెవాడియాలోని స్టాచ్యూ ఆఫ్ యూనిటీ వద్ద ఆయన యోగా చేశారు. 
హిమాచల్ ప్రదేశ్ లో అంతర్జాతీయ యోగా దినోత్సవ సంబరాలు అంబరాన్నంటాయి. కాంగ్రా కోట వద్ద జరిగిన ఇంటర్నేషనల్ యోగా డేలో  కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పాల్గొన్నారు. వజ్రాసనం, పద్మాసనాలు వేసి అలరించారు.  ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం ఫతేపూర్ సిక్రీలోని పంచ్ మహల్ వద్ద కేంద్ర మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ యోగా చేశారు.

Tags :