ఈ కేటుగాడు భలే తెలివైనోడు..

ఈ కేటుగాడు భలే తెలివైనోడు..


- టైం ఇస్తే సెటిల్ చేస్తానంటూ తప్పించుకు తరుగుతున్న వైనం.. 
- గాజుల రామారంలో చక్రం తిప్పుతున్న వైనం..  
- ఏకంగా నవాబుల వారసుల స్థలానికే ఎసరు..
- వారి వద్దే కొన్నానంటూ కట్టింగులు.. కోట్లలో వసూళ్లు..   
- ఇప్పటికే నాలుగు కోట్ల రూపాయలు దోచుకున్నాడని  
   పోలీసులను ఆశ్రయించిన బాధితులు.. 
- ఏపీఎస్ఎఫ్సీ భూములే టార్గెట్.. జీ.ఓ.నం .307 కు తూట్లు.. 
- ఇతగాడు అడ్వాన్సుగా వసూలు చేసిన మొత్తం కోట్లు దాటింది..
- వాసి దేవకుమార్ అసలు లెక్క తేలాలంటే బాధితుల లెక్క తేలాలి..  
- సుమారు యాభై ఎకరాలు మాయం చేసే యోచనలో ప్రబుద్దుడు..  
- మాయమాటలే పెట్టుబడిగా కోట్ల రూపాయల స్కాం..

మేడ్చల్ జిల్లా బ్యూరో, 22 జూన్ ( ఆదాబ్ హైదరాబాద్ ) : 

తెలివి ఒక్కరి సొమ్ము కాదు అంటారు.. మనిషి తన తెలివితేటల్ని సమాజ హితం కోసం ఉపయోగిస్తే ఎంతో మేలు జరుగుతుంది.. అలా కాకుండా స్వార్ధానికి ఉపయోగిస్తే జరిగే నానార్ధాలు అంతా, ఇంతా కాదు.. ఈ విషయం ఎన్నో సార్లు రుజువైంది.. అతి తెలివితో కొందరు కేటుగాళ్లు అక్రమ సంపాదనకు అలవాటుపడి, ప్రభుత్వ సంపాదనను కొల్లగొడుతున్నారు.. ప్రభుత్వ భూములను ఎంతో సులువుగా కొల్లగొడుతున్నారు.. అమాయకులకు అంటగడుతూ.. వారిని ప్రమాదంలో పడేస్తున్నారు.. అలాంటి ఒక కేటుగాడు చరిత్ర వెలుగు చూసింది..  ( ఇంట్రో )

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని గాజులరామారం డివిజన్ లో ఉన్న ఆంధ్ర ప్రదేశ్ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ కి చెందిన భూముల ఆక్రమనకు 'వాసి దేవకుమార్' అనే వ్యక్తి  తెరలేపాడు. 307 సర్వే నంబర్ లో విస్తరించి ఉన్న ఏపీఎస్ఎఫ్సీ భూములే టార్గెట్ గా కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికి చెందిన ఈ వ్యక్తి కొంతమంది వ్యక్తులను బాగస్వామ్యులుగా చేసుకుని తాను నవాబుల వద్ద అధికారికంగా కొన్నానని చెప్పుకుంటూ.. అమాయకులను నమ్మిస్తూ లక్షల రూపాయలు దండుకుంటున్నాడు. సుమారు రెండువందల ఎకరాల్లో విస్తరించి ఉన్న ఏపీఎస్ఎఫ్సీ భూములను టార్గెట్ చేస్తూ ఇప్పటికే  కొందరికి అగ్రీమెంట్లు చేసి నాలుగు కోట్ల రూపాయలు దండుకున్నట్టు విశ్వసనీయ సమాచారం. అసలు విషయం తెలుసుకున్న కొందరు బాధితులు స్థానిక పోలీస్ స్టేషన్ లో  ఫిర్యాదులు చేయగా చాకచక్యం ప్రదర్శిస్తూ నాక్కొంచెం సమయమివ్వండి అన్నీ సెటిల్ చేస్తానంటూ అక్కడ నుండి జారుకుని తప్పించుకుని తిరుగుతున్న ఇతగాడి వ్యవహారంలో స్థానికులు అప్రమత్తంగా  ఉండాలని కోరుతూ ఇతగాడి లీలలపై 'ఆదాబ్ హైదరాబాద్' అందిస్తున్న ప్రత్యేక కథనం .. 

కుత్బుల్లాపూర్ మండల పరిధిలోని సర్వే నంబర్ 307 లోని ఏపీఎస్ఎఫ్సీ భూములను మాయం చేసి కోట్లు దండుకునే పనిలో నిమాగ్నమయ్యాడు  కుత్బుల్లాపూర్ కు చెందిన 'వాసి దేవకుమార్'. రెండు వందలకు పైగా ఎకరాల్లో విస్తరించి ఉన్న ఏపీఎస్ఎఫ్సీ భూమిలో 55 ఎకరాలు తాను హైదరాబాద్ నవాబుల వారసుల వద్ద కొనుగోలు చేశానని, ఈ భూమి వక్ఫ్ బోర్డు, నవాబులకు చెందినదంటూ, వారి వద్దనుండి తాను జీపీఏ చేసుకున్నానంటూ తప్పుడు పత్రాలు సృష్టించి ఏకంగా సుమారు యాభై ఎకరాల భూమిని అమ్మకానికి పెట్టాడు. నకిలీ పత్రాలు సృష్టించి, వాటితో కోర్టులో కేసు వేశానంటూ ఓ డబ్ల్యూపీ నంబర్ చూపిస్తూ ఇప్పటికే చాలా మందిని నమ్మించాడు. ఇతగాడి బురిడీ మాటలను నమ్మిన కొందరు వ్యక్తులు లక్షల్లో ముట్టజెప్పారు. ఇందులో కొందరు ఈ కేటుగాడు చెప్పినవన్నీ మాయమాటలని తెలుసుకుని కొన్ని నెలల క్రితం జగద్గిరిగుట్ట పోలీసులను ఆశ్రయించారు. దీంతో ఒక్కసారిగా ఖంగుతిన్న ఈ కేటుగాడు తన నటనతో పోలీసులను నమ్మించి తనకు కొంత సమయం ఇవ్వాలని బాధితులను కోరి, సెటెల్మెంట్ చేస్తానని నమ్మించి తప్పించుకు తిరుగుతున్నాడు.

నాడు టూ వీలర్ .. నేడు ఖరీదైన కారు కు ఓనరు : 

కుత్బుల్లాపూర్ లో బలాదూర్ గా తిరుగుతూ ప్రభుత్వ భూములెక్కడెక్కడున్నాయో అధికారుల దగ్గరినుంచి లెక్కలు సేకరించి, ఒక గుట్టలాగా ఒకే దగ్గర నాలుగు వందల ఎకరాల ఖాళీ భూమి కనిపించేసరికి దానిని మాయం చేసే పనిలో నిమగ్నమయ్యాడు. దీంతో గట్టిగానే దండుకున్న ఈ మాయగాడు కుత్బుల్లాపూర్ లో రెండంతస్థుల ఇల్లు, గేటెడ్ కమ్యూనిటీలో డబుల్ బెడ్ రూ ఫ్లాట్, ఖరీదైన కారు కొనుగోలు చేసి దర్జాగా తిరుగుతున్నాడని ఇతగాడి వ్యవహారం తెలిసిన కొందరు  చెవులు కొరుక్కుంటున్నారు . జగద్గిరిగుట్టలో మనీ ట్రాన్స్ఫర్ సర్వీస్ సెంటర్ ను ఓపెన్ చేసి అందులో కూడా చాలానే మోసాలకు పాల్పడ్డాడనే ఆరోపణలు ఇతగాడిపై ఉన్నట్లు తెలుస్తుంది. ఇతగాడి వ్యవహారంపై స్థానికులు ఇకనైనా జాగ్రత్తగా ఉండాలని మోసపోయిన బాధితులు కోరుతున్నారు.

Tags :