బాలిక ఫోన్ కాల్‌కు హైదరాబాద్ సీపీ స్పందన

Updated:12/05/2018 09:39 AM

hyderabad cp response to child phone call

ఓ బాలిక ఫోన్ కాల్‌కు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ మనస్సును కదిలించింది. కానిస్టేబుల్‌గా పనిచేస్తూ ఆరు నెలల క్రితం సస్పెన్షన్‌కు గురైన తన తండ్రి చేసిన తప్పు భవిష్యత్తులో మరోసారి జరుగదని సీపీకి హామీ ఇచ్చింది. ఆమె మాటలతో చలించిపోయిన సీపీ ఆమె తండ్రిపై సస్పెన్షన్‌ను ఎత్తివేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా ఆయన సిటీ పోలీస్ కమిషనరేట్‌లో పనిచేస్తున్న కానిస్టేబుల్ అధికారులకు ఒక ఆడియో సందేశాన్ని పంపించారు.

నేను ఆఫీస్‌లో పనిచేసుకుంటున్న సమయంలో ఇటీవల ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఓ బాలిక ఫోన్లో మాట్లాడుతూ మిమ్మల్ని నేను అర్జెంట్‌గా కలువాలంటూ గంటన్నర వ్యవధిలో నా దగ్గరకు తన తల్లితో కలిసి వచ్చారు. విధి నిర్వహణలో మద్యం సేవించి, అసభ్యకరంగా ప్రవర్తించడంతో ఆరు నెలల క్రితం బాలిక తండ్రి సస్పెన్షన్‌కు గురయ్యాడని విషయం తెలిపింది. ఆ బాలిక నాతో మాట్లాడుతూ నా తండ్రితో పాటు నా కుటుంబంలో ఏ ఒక్కరూ ఇక మద్యం సేవించరని ప్రమాణం చేసిందని తెలిపారు. ఆమె చెప్పే విధానంలో పశ్చాత్తాపం, నమ్మకం, ధైర్యం కనిపించిందని, సస్పెన్షన్ ఎత్తివేస్తూ వేస్తూ సంతకం చేసి, ఆ ఉత్తర్వుల కాపీని వారికిచ్చి పంపించానన్నారు. బాలిక ప్రవర్తన, ఆత్మవిశ్వాసం నన్ను ప్రభావితం చేశాయని సీపీ తెలిపారు.