ఆక‌లిని పెంచే ఎఫెక్టివ్ చిట్కాలు

Updated:13/05/2018 03:34 AM

home remedies to increase hunger

స‌మ‌య పాల‌న లేకుండా ఎప్పుడు ప‌డితే అప్పుడు అతిగా తిండి తిన‌డం, మ‌ద్య‌పానం, ధూమ‌పానం చేయ‌డం, స్థూలకాయం, దీర్ఘ‌కాలిక అనారోగ్య స‌మ‌స్య‌లు.. త‌దిత‌ర అనేక కార‌ణాల వ‌ల్ల అనేక మంది నేటి త‌రుణంలో జీర్ణ స‌మ‌స్య‌ల‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్నారు. తిన్న ఆహారం స‌రిగ్గా జీర్ణం కాక ఇబ్బందుల‌కు గుర‌వుతున్నారు. దీంతో అలాంటి వారికి ఆక‌లి కూడా స‌రిగ్గా వేయ‌డం లేదు. అయితే ఇలా ఆక‌లి కోల్పోవ‌డాన్ని అనోరేక్సియా అంటారు. కానీ దీన్ని మ‌న ఇంట్లో ఉండే స‌హ‌జ సిద్ధ‌మైన ప‌దార్థాల‌తోనే త‌గ్గించుకోవ‌చ్చు. దీంతో ఆక‌లి బాగా వేస్తుంది. మ‌రి ఆక‌లి పెరగాలంటే అందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందామా..! 

1. ఉసిరి ఆకలిని పెంచే సహజ ఔషధంగా పనిచేస్తుంది. ఉసిరితో తయారుచేసిన ఊరగాయలను రోజూ తింటుంటే ఆకలి పెరుగుతుంది. దీంతోపాటు నిత్యం ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపునే ఉసిరి జ్యూస్ తాగినా జీర్ణ‌శ‌క్తి పెరుగుతుంది. ఆక‌లి వృద్ధి చెందుతుంది. 

2. ఉద‌యం, సాయంత్రం ఒక గ్లాస్‌ నిమ్మరసం తాగితే ఆకలి పెరుగుతుంది. నిమ్మకాయ రసాన్ని సలాడ్‌లలో కలుపుకొని తినటం వ‌ల్ల కూడా ఆక‌లిని పెంచుకోవ‌చ్చు. 

3. ఆకలిని పెంచే శక్తివంతమైన ఔషధాలలో అల్లం ఒకటి. ఇది అజీర్ణ సమస్య నుంచి ఉపశమనం కలిగిస్తుంది. రోజూ రెండు పూట‌లా భోజ‌నానికి ముందు అల్లం ర‌సం సేవించాలి. దీంతో తిన్న ఆహారం త్వ‌ర‌గా జీర్ణ‌మై ఆక‌లి పెరుగుతుంది. 

4. ఒక గ్లాస్ దానిమ్మ రసంలో ఒక టీస్పూన్‌ తేనెను కలుపుకొని తాగితే ఆకలి పెరుగుతుంది. 

5. నల్లమిరియాలు జీర్ణశక్తిని పెంచే ఔషధంగా పనిచేస్తాయి. ఒక టీస్పూన్ న‌ల్ల మిరియాల పొడిని ఒక గ్లాస్ నీటిలో క‌లుపుకుని రోజుకు రెండు సార్లు తాగితే ఫ‌లితం ఉంటుంది. 

6. రోజు ఉదయాన్నే ఒక గ్లాసు కొత్తిమీర రసాన్ని తాగటం వల్ల కూడా ఆకలి సులువుగా పెరుగుతుంది. 

7. ఆకలికి చింతపండు చక్కగా ఉపయోగపడుతుంది. భోజ‌నం చేసిన వెంట‌నే కొద్దిగా చింత పండు తినాలి. దీంతో తిన్న ఆహారం త్వ‌ర‌గా జీర్ణ‌మ‌వుతుంది. ఆక‌లి త్వ‌ర‌గా వేస్తుంది. 

8. నాలుగు టీ స్పూన్స్ నూనెను వేడిచేసి అందులో ఆవాలు, జీలకర్ర, కొద్దిగా మినపప్పువేసి అందులో శుభ్రం చేసిన పుదీనా ఆకులను(200గ్రా) వేసి బాగా వేగాక తీసి మెత్తగా అయ్యేవరకు పొడి చేయాలి. ఈ పొడిని అర‌ టీస్పూన్ మోతాదులో తీసుకుని భోజనానికి ముందు మొదటి ముద్దలో కలిపి తింటే ఆకలి బాగా పెరుగుతుంది. 

9. దోరగా వేయించిన సోంపు, శొంఠి, కలకండ(పటికి బెల్లం)ను సమ భాగాలుగా కలిపి మెత్తటి పొడి చేసి ఉదయాన్నే అర టీస్పూన్ పొడిని తిని నీళ్ళు తాగాలి. దీంతో ఆక‌లి బాగా వేస్తుంది. 

10. దాల్చినచెక్కను మెత్తని పొడిచేసి పావు టీస్పూన్ పొడిని తేనెలో కలిపి ఉదయం, సాయంత్రం సేవించాలి. దీంతో ఆకలి పెరుగుతుంది.