హ్యాపీ యాప్స్ దీపావళి..

Updated:18/10/2017 12:00 AM

happy apps diwali

రంగోళి దివాళి

కళలు, హస్తకళలంటే ఇష్టపడే మీలాంటి వారి కోసమే ఈ యాప్. ప్లే స్టోర్‌లోంచి ఈ యాప్ డౌన్‌లోడ్ చేసుకోని మీకు నచ్చిన డిజైన్లను క్రియేట్ చేసుకోవచ్చు. మీకు మీరే ప్రొఫెషనల్ డిజైనర్‌గా మారొచ్చు. ఈ యాప్ వాడడం కూడా చాలా సులభం. కేవలం నాలుగు స్టెప్పుల్లో ఈ యాప్ డౌన్‌లోడ్ చేసుకొని వాడొచ్చు. అంతే కాదు.. మీరు వేసే ప్రతీ డిజైన్‌కి గైడెన్స్ కూడా ఇస్తుంది ఈ యాప్. చుక్కలు ఉపయోగించడం, డెమో డిజైన్లను ఫాలో కావడం, నచ్చిన, బాగా వచ్చిన రంగోళి డిజైన్‌ని మొబైల్ వాల్‌పేపర్‌గా కూడా మార్చుకోవచ్చు. రంగురంగుల వెలుగులతో ఆకాశం మెరిసిపోయినట్టు మీ మొబైల్ కూడా మెరిసి, దాన్ని చూసి మీరు మురిసిపోవాలంటే ఈ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

దివాళి గ్రీటింగ్‌కార్డ్స్ మేకర్

పండుగొచ్చినప్పుడు, ఏదైనా ప్రత్యేకమైన రోజు వచ్చినప్పుడు అందరిలా కాకుండా స్పెషల్‌గా మెసేజ్ చేయాలని అందరూ కోరుకుంటారు. అలా కోరుకునేవారందరి కోసమే ఈ యాప్. ఈ యాప్‌లో టెంప్లెట్స్ ముందే డిజైన్ చేసి ఉంటాయి. వాటిలోంచి ఏదైనా ఒకటి సెలక్ట్ చేసుకొని కింద మన పేరు రాసుకొని పంపించుకోవడమే. లక్ష్మీదేవి, గణపతి వంటి దేవుళ్ల ఫొటోలు, చిచ్చుబుడ్డి, లక్ష్మీబాంబ్, కాకరపూలు, తారాజువ్వలు ఇలా ఎన్నో వైరైటీలతో టెంప్లెట్లు డిజైన్ చేసి ఉంటాయి. మీ టేస్టుకి తగ్గట్టు మీకు నచ్చేదో, లేకపోతే మీరు పంపాలనుకున్నవారికి నచ్చేదో ఒక టెంప్లెట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఫొటోలు మాత్రమే కాదు.. పండుగ శుభాకాంక్షలు చెప్తూ ఎన్నో కామెంట్స్ కూడా ఉంటాయి. అందులో మీకు బాగా నచ్చిన ఒక ఫొటో పెట్టి శుభాకాంక్షలు చెప్తూ గ్రీటింగ్ కార్డు తయారుచేసి మీ బంధువులకు, స్నేహితులకు పంపవచ్చు.

దివాళి సేఫ్టీ టిప్స్

దీపావళి పండుగ మరునాడు దవాఖానాల ముందు పిల్లలు, పెద్దలు క్యూ కడుతారు. కారణం.. జాగ్రత్తలు పాటించకుండా పటాకులు పేల్చడమే. అలా కాకుండా పటాకులు కాల్చేముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చేయకూడని పనులు తెలిస్తే గాయాలు కావు. డాక్టర్ దగ్గరికి పరుగెత్తాల్సిన అవసరం రాదు. అందుకోసమే ఈ యాప్. పటాకులు కాల్చేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. పొరపాటున గాయమైతే దాని తీవ్రత ఎలా తగ్గించాలి. పెద్ద పటాకులు ఎలా కాల్చాలి. పిల్లలకు, పెద్దలకు సరైన సలహాలన్నీ ఈ యాప్‌లో పొందుపరుచబడి ఉంటాయి. ఏం చేయాలో మాత్రమే కాదు.. ఎలా చేయకూడదో కూడా ఇందులో సూచనలు ఉంటాయి. ఒక్కసారి ఈ యాప్ డౌన్‌లోడ్ చేసుకుంటే చాలు.. ప్రతీ దీపావళి ఆనందాలకు దగ్గరగా, ప్రమాదాలకు దూరంగా జరుపుకోవచ్చు.

దివాళి ధూమ్

మొబైల్‌లో కార్ గేమ్ ఆడితే అచ్చం కారునడిపిన ఫీలింగ్ వస్తుంది. ఈ యాప్ కూడా అలాంటిదే. ఈ యాప్‌లో ఎన్నో రకాల పటాకులు ఉంటాయి. మీకు నచ్చిన దాన్ని సెలక్ట్ చేసుకోవాలి. నిజంగా ఎలా కాలుస్తామో యాప్‌లో కూడా అలాగే కాల్చాలి. అలా కాల్చినప్పుడు నిజమైన పటాకి ఎలాంటి సౌండ్ చేస్తుందో ఈ యాప్‌లో పేల్చిన పటాకి నుంచి అలాంటి సౌండే వస్తుంది. పైగా నిజజీవితంలో అలాంటి పటాకులు కాల్చేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో కూడా సూచిస్తుంది. ఆ పటాకి వల్ల వచ్చే శబ్ద తీవ్రత ఎంత అనే వివరాలు కూడా ఉంటాయి. పదికాలాల పాటు ప్రకృతి పదిలంగా ఉండాలని కోరుకునే వాళ్లంతా ఈ యాప్ డౌన్‌లోడ్ చేసుకుని పటాకులు కాల్చండి. ధన్ దనా ధన్ సౌండ్ ఎంజాయ్ చేస్తూ ప్రకృతిని కాపాడండి.

దివాళి ఫొటోఫ్రేమ్స్

జీవితమంతా వెలుగులతో నిండిపోవాలని ఎవరు కోరుకోరు చెప్పండి! ఆ వెలుగులిక మీ మొబైల్ నుంచే ప్రారంభించొచ్చు. ఎలా అంటారా? ప్లేస్టోర్‌కి వెళ్లి దివాళి ఫొటోఫ్రేమ్స్ యాప్ డౌన్‌లోడ్ చేసుకుంటే సరి. రకరకాల దివాళి థీమ్స్‌తో మీ ఫొటోలు జతచేసి మీ మొబైల్ స్క్రీన్ మీద వెలుగుల మధ్య అందమైన మీ ఫొటోని వాల్‌పేపర్‌లా సెట్ చేసుకుంటే ఎలా ఉంటుంది. భలే ఉంటుంది కదా! అంతేకాదు.. మీరు సెలక్ట్ చేసుకున్న థీమ్‌లో మీ ఫొటో పెట్టి ఎడిట్ చేసి ఫొటోలో మీకు నచ్చిన దగ్గర మీ కామెంట్స్, విషెస్ కూడా యాడ్ చేయొచ్చు. ఇంకా లేటెందుకు ఇప్పుడే యాప్ డౌన్‌లోడ్ చేసుకుని మీ ైస్టెల్లో దివాళి ఫొటో ఫ్రేమ్ క్రియేట్ చేసి మీ సోషల్ మీడియా ఫ్రెండ్స్‌కి శుభాకాంక్షలు చెప్పేయండి.

క్రాకర్ బూమ్

క్రాకర్లు కాల్చితే ఎక్కడ చేతులు కాలిపోతాయేమో అని భయపడే పిల్లలకు ఈ యాప్ మంచి ఫ్రెండ్. ఈ యాప్‌లోని గేమింగ్ ఫీచర్లు పిల్లలకు క్రాకర్లు కాల్చిన అనుభూతినిస్తాయి. అల్లంత దూరాన క్రాకర్లు కాలుస్తుంటే భయపడిపోయే పిల్లలు అరచేతిలో వెలిగే కాకరపువ్వులను చూస్తూ ఆనందంతో గంతులు వేయడం, బోసినవ్వులు ఒలకపోయడం కళ్లారా చూడొచ్చు. ప్రకృతికి ఎలాంటి కీడు చేయకుండా టపాసులు కాల్చిన ఆనందాన్ని మీ పిల్లలకు ఇవ్వాలంటే ఈ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. ఖర్చు తక్కువ.. ఆనందం ఎక్కువ.