పురుగులన్నమే పలారమా..?

పురుగులన్నమే పలారమా..?


 
- సంక్షేమానికి పురుగు పట్టిండా..?   
- చదువుకోవాలా.. చదువులపేరుతో చావాలా..? 
- నిర్లక్ష్యానికి గురవుతున్న సంక్షేమ వసతిగృహాలు..   
- ప్రభుత్వ స్కూళ్లను, హాస్టళ్లను సర్కార్ గాలికొదిలేసింది.. 
- రోజుకో దారుణం బయటికి వస్తున్నా సర్కార్ కి సోయిలేకపాయె.. 
- కేజీ టు పీజీ విద్యార్థులే కాదు ఇంజనీరింగ్, మెడిసిన్ విద్యార్థుల పరిస్థితీ ఇదే..  
- పాచి పోయిన బువ్వ కోసమా పోరాటం చేసి తెలంగాణ తెచ్చుకుంది..? 

హైదరాబాద్, 04 ఆగష్టు ( ఆదాబ్ హైదరాబాద్ ) :
కేజీ టు పీజీ ఉచిత విద్య అని గొప్పలు చెప్పుకు తిరుగుతున్న తెలంగాణ సర్కారు ఇప్పుడు కనీసం ప్రభుత్వ స్కూళ్ల, హాస్టళ్ల వంకయిన చూడటం లేదు. తెలంగాణ రాష్ట్రంలో  ఏ జిల్లా చూసిన ఏముంది గర్వకారణం ముక్క పట్టిన బియ్యం, పురుగులన్నంతో పాచిపోయిన బువ్వను వండి.. వడ్డిస్తున్న హాస్టళ్ల దీన స్థితిని చూసి విద్యార్థులు ఏడవలేక కడుపారా తినలేక..  అన్నమో రామచంద్ర అని అలమటిస్తున్న దీన గాధలు తప్ప.. ఏండ్లు కొట్లాడి సాధించుకున్న తెలంగాణాను ఈ పురుగులు పట్టిన బువ్వ  తినడం కోసమేనా అన్నచందంగా ప్రభుత్వం, అధికారుల పరిపాలన కొనసాగడం మన దౌర్భాగ్యం.. నా మనవడికి  ఏ రకమైన భోజనం  దొరుకుతుందో అదే రకమైన మంచి రుచికరమైన భోజనం తెలంగాణ బిడ్డలకు అందిస్తానని చెప్పుకు తిరిగిన పెద్దమనిషి ఇప్పుడు నోరుమెదపడం లేదు ఎందుకు..? 

కలుషిత ఆహారం తిని విద్యార్థులు అస్వస్థకు గురవుతున్నారు :
ఇటీవల కాలంలో ప్రభుత్వ అధీనంలో నడుస్తున్న సంక్షేమ వసతి గృహాల్లో చదువుకుంటున్న విద్యార్థులు పడరాని పాట్లు  పడుతున్నారు. కలుషిత ఆహారం తిని విద్యార్థులు అస్వస్థకు గురయిన సంఘటనలు కోకొల్లలుగా కనిపించినా  ప్రభుత్వం మాత్రం విచారణకు ఆదేశించడం లేదు. పలు సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థులు కలుషిత ఆహారం తిని మేము అనారోగ్యాల పాలయ్యామని నోరు విప్పి చెప్పినా ప్రభుత్వం..  యంత్రాంగాన్ని సమాయత్తం చేయడంలేదు. ఎస్సి, ఎస్టీ , బీసీ, మైనార్టీ, అనే తారతమ్యాలేమి లేకుండా వసతి గృహాలన్నీ ఒకే పంచన చేరి, కలుషిత ఆహారాన్ని విద్యార్థులకు వండి వడ్డిస్తున్నాయి. ప్రభుత్వమే నాసి రకం బియ్యం ..ముక్క పట్టిన బియ్యం పంపిస్తుంటే మేము ఏమి  చేయగలమని అధికారులే చేతులెత్తేస్తుంటే విద్యార్థులు ఎక్కడికెళ్ళి మొరపెట్టుకోవాలి.. ? 

భోజనంలో లక్క పురుగులు వస్తున్నాయి :
తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ హాస్టళ్ల పరిస్థితి అద్వాన్న స్థితికి చేరుకుంది. విద్యార్ధులకు మంచి చదువులు  చెప్పడం సంగతి అటుంచితే  సరైన భోజనం పెట్టక పేషెంట్లుగా మార్చేస్తున్నారు. మూడు రోజుల  క్రితం సిరిసిల్ల జిల్లాలోని బీసీ హాస్టల్‌ స్టూడెంట్స్ 35మంది అస్వస్థకు గురికాగా.. నెల రోజుల వ్యవధిలోనే రెండు ఘటనలు మర్చిపోక ముందే సిరిసిల్ల జిల్లాలోని బీసీ గురుకుల హాస్టల్‌లో 34 మంది విద్యార్దులు అనారోగ్యానికి గురయ్యారు. హాస్టళ్లలో మౌలిక సదుపాయాలు సరిగా లేవని .. స్టూడెంట్స్‌కి పెడుతున్న భోజనంలో లక్క పురుగులు వస్తున్నాయని తెలుసుకున్న తల్లిదండ్రులు, విద్యార్ధి సంఘాలు ఆందోళనకు హాస్టల్ దగ్గర చేపట్టాయి. పరిస్థితిని చక్కదిద్దేందుకు జిల్లా కలెక్టర్అధికారుల బృందాన్ని హాస్టల్‌కు పంపారు.

కేజీ టు పీజీ విద్యార్థులే కాదు ఇంజనీరింగ్, మెడిసిన్ విద్యార్థులు కూడా అన్నం కోసం అలమటిస్తున్నారు : 
తెలంగాణ రాష్ట్రంలో విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న హాస్టల్స్ చాలా వరకు అరకొర వసతులతో కొనసాగుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో పరిస్థితి మరీ దారుణంగా తయారయ్యింది. ఈ పరిస్థితి కేజీ టు పీజీ విద్యార్థులకే అంటే మీరు పప్పులో కాలేసినట్లే .. ఇంజనీరింగ్, మెడిసిన్ విద్యార్థులు కూడా కలుషిత ఆహారం తిని ఆసుపత్రుల పాలవుతున్నారు. ఇటీవల వేలాది  మంది బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు కలుషిత ఆహారం తిని అనారోగ్యాల పాలయిన విషయం విదితమే.. ఈ సంఘటనపై క్యాంటిన్ ఓనర్ల లైసెన్సులు రద్దు  చేయడం తప్ప ప్రభుత్వం చేపట్టిన ఒక్క ఘనకార్యమైన మచ్చుకైయినా కనబడదు.  

టాయిలెట్స్ లేవని చదువులు మానేస్తున్నారు :
తెలంగాణ రాష్ట్రంలో పదవతరగతి చదువుకునే విద్యార్థినిలకు చాలావరకు ప్రభుత్వ పాఠశాలల్లో టాయిలెట్స్ లేవు..  టాయిలెట్స్ కు వెళ్లాలంటే విద్యార్థినిలు ఆరుబయటే వెళుతున్నారు. దీంతో చాలామంది విద్యార్థినిలు చదువులు మానేస్తున్నారు. టాయిలెట్స్ లేవని బడులు మానేసే పరిస్థితులు దాపురించినా ఈ ప్రభుత్వ పరిపాలనలో..  పాలకులు చెప్పుకునే గొప్పలు ఎలాంటివో ఇట్టే  అర్ధం  చేసుకోవచ్చు. పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న చందంగా తయారయ్యింది . తెలంగాణ సర్కారు  పరిస్థితి.

Tags :