తెలంగాణ ప్రభుత్వంలో రైతులకు స్వర్ణ యుగం: పోచారం

Updated:15/05/2018 06:37 AM

golden era for farmers says pocharam

తెలంగాణ ప్రభుత్వంలో రైతులకు స్వర్ణ యుగం ప్రారంభమైందని రాష్ర్ట వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండలో జరిగిన రైతుబంధు పథకం కార్యక్రమంలో డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, రైతు సమన్వయ సమితి రాష్ట్ర చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు పాల్గొన్నారు. మంత్రులకు రైతులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి పోచారం పాల్గొని ప్రసంగించారు. భూ రికార్డుల ప్రక్షాళన చేసి చూపించిన ఘనత.. రైతులకు పంటసాయం నిరంతర ప్రక్రియ అని చెప్పిన ఘనత సీఎం కేసీఆర్ దేనన్నారు. రైతులకు ఐదు లక్షల రూపాయల బీమా సౌకర్యానికి శ్రీకారం చుట్టబోతున్నట్లు చెప్పారు. అధికార దాహంతో కాంగ్రెస్ నాయకులు బస్సు యాత్రలు చేస్తున్నారన్నారు. 70 ఏళ్లలో రైతుల తలరాతలు మారలే, కానీ తెలంగాణ ప్రభుత్వంలో రైతులకు స్వర్ణ యుగం ప్రారంభమైందన్నారు. ప్రతిపక్షాలు ఎన్నికల్లో రైతుల జపం చేసి అదికారంలోకి వచ్చాక రైతులను తలదించుకునేలా చేశాయని చెప్పారు. కేసీఆర్ ప్రభుత్వంలో రైతులు తల ఎత్తుకుని ఆత్మగౌరవంతో బ్రతుకుతున్నారు. 14 మంది ముఖ్యమంత్రులు మారినా రైతులకు కరెంటు కష్టాలు తీరలేదు. కేసీఆర్ పాలనలోనే 24 గంటల కరెంటు ఇస్తుండడంతో రైతులు సంతోషంగా ఉన్నారన్నారు. కాంగ్రెస్ నాయకుల దృష్టి ఓట్లు, నోట్లు, సీట్ల పైనేని ఎద్దేవ చేశారు. టీఆర్ఎస్ నాయకుల దృష్టి రైతుల బాగు పైనేనని వెల్లడించారు. రామరాజ్యంలో కూడా శిస్తు వసూల్ చేశారు కాగా కేసీఆర్ పాలనలో పంటసాయం చేయడం రైతులకు గర్వకారణమని ఆయన పేర్కొన్నారు.