గజ్వేల్‌లో 40 రోజుల ప్లాన్ నగల చోరీ బ్యాచ్..

గజ్వేల్‌లో 40 రోజుల ప్లాన్ నగల చోరీ బ్యాచ్..
హైదరాబాద్, 08 డిసెంబర్ ( ఆదాబ్ హైదరాబాద్ ) :
నాగోల్‌లోని ఆభరణాల దుకాణంలో కాల్పులు జరిపి, బంగారం ఎత్తుకుపోయిన కేసు మిస్టరీని రాచకొండ పోలీసులు ఛేదించారు. ఈ దోపిడీకి గజ్వేల్‌లోని ఒక బంగారం దుకాణం యజమాని 40 రోజులుగా ప్లాన్ చేసి, హర్యానా, రాజస్థాన్ ముఠాల సహాయంతో అమలు చేశాడు. ఘటన జరిగిన 24 గంటల్లోనే పోలీసులు కీలక ఆధారాన్ని గుర్తించారు. రంగంలోకి దిగిన 15 పోలీసు బృందాలు ఆరు రోజుల పాటు కృషిచేసి 10 మంది సభ్యులున్న ఈ ముఠాలో నుంచి ఆరుగురిని అరెస్ట్ చేశారు. దోపిడీకి గురైన 2.7 కిలోల బంగారాన్ని రికవరీ చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్ బుధవారం మీడియాకు వివరించారు.
డిసెంబర్ 1వ తేదీ.. మధ్యాహ్నం సమయంలో సికింద్రాబాద్ పాట్ మార్కెట్ బంగారం వ్యాపారులతో రద్దీగా ఉంది. బంగారం వ్యాపారి అయిన రాజ్‌కుమార్ సురానా ప్రతి గురువారం బంగారు ఆభరణాలను తీసుకొని.. వివిధ నగల దుకాణాలకు విక్రయిస్తుంటాడు. ఆ రోజు కూడా మధ్యాహ్నం 2 గంటలకు సుమారు మూడు కిలోల బంగారు ఆభరణాలతో తన దుకాణంలో పనిచేసే సుఖ్‌రామ్‌ను తీసుకొని బయలు దేరాడు. అప్పటికే మాటువేసి ఉన్న దోపిడీ దొంగలు ఈ వ్యాపారులను అనుసరిస్తూ వచ్చారు. వ్యాపారులు రాత్రి 8 గంటల ప్రాంతంలో కొత్తపేట స్నేహపురికాలనీలో ఉన్న మహదేవ్ నగల దుకాణానికి చేరుకున్నారు. దోపిడీ దొంగలు సుమారు ఎనిమిది గంటల పాటు వెంబడిస్తూ వచ్చారు.
ప్రధాన నిందితుడైన మహేందర్ స్వస్థలం రాజస్థాన్‌లోని పాలి జిల్లా. జీవనోపాధి కోసం రాష్ర్టానికి వచ్చిన అతడు గజ్వేల్‌లో జయలక్ష్మి జ్యువెలర్స్ పేరుతో బంగారం దుకాణాన్ని నిర్వహిస్తున్నాడు. ఈజీగా మనీ సంపాదించాలన్న ఆలోచనతో బంగారం వ్యాపారులను లక్ష్యంగా చేసుకొని దోపిడీలకు పథకం వేశాడు. ఈ విషయాన్ని తన భార్య గుడియ, బావమరిది సుమర్ చౌదరి, రామాయంపేటలోని జయ్ భవానీ కలెక్షన్ రెడీమెడ్ దుకాణాన్ని నిర్వహించే బన్సీరామ్ , కొండపాకలో జ్యువెలరీ షాప్ అండ్ పాన్ బ్రోకరింగ్ నిర్వహించే మనీశ్ వైష్ణవ్, పాలకుర్తిలోని ఓ టెంట్‌హౌస్‌లో పనిచేసే రితేశ్ వైష్ణవ్, స్థానికుడైన మహ్మద్ ఫిరోజ్‌కు చెప్పాడు. అందరు కలిసి అక్టోబర్ నెలలోనే దోపిడీకి ప్లాన్ చేశారు. ఈ దోపిడీ ప్లాన్‌ను అమలు చేసేందుకు హర్యానా, రాజస్థాన్ నుంచి అక్టోబర్ 26న సుమిత్ డ్యాగర్, మనీశ్, మాన్యను గజ్వేల్‌కు రప్పించారు. అక్టోబర్ 26న ఈ ముగ్గురు దొంగలు హోండా యాక్టివాపై వెళ్తున్న ఓ వ్యక్తిని మారణాయుధాలతో బెదిరించి హెల్మెట్‌తో పాటు యాక్టివాను అపహరించారు. ఈ ఘటనపై గౌరారం పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. దొంగిలించిన యాక్టివాను ట్రావెల్ బస్‌లో రాజస్థాన్‌కు తరలించి, ముగ్గురూ హర్యానాకు వెళ్లారు.