ఆన్‌లైన్‌లో తెలుగు ఇంజనీర్ల కాలేజీలు!

Updated:11/03/2018 04:34 AM

engineering colleges in online

బీటెక్‌, ఎంటెక్‌ చదువుతున్నవాళ్లూ, ఐటీ కొలువుల్లో ఉన్నవాళ్లూ... అందరి నోటా ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, మిషన్‌ లెర్నింగ్‌ అన్న మాలే వినిపిస్తున్నాయి. సత్య నాదెళ్ల, సుందర్‌ పిచాయ్‌, జెఫ్‌ బెజోస్‌ లాంటి దిగ్గజాలూ భవిష్యత్తు వీటిదేనని చెబుతున్నారు. కానీ మన దగ్గర ఈ కోర్సులు నేర్పే సంస్థలు తక్కువ. ఉన్న కొద్దివాటిలో ఫీజులు ఎక్కువ! దీన్ని గమనించిన ఓ తెలుగు టెక్‌ బృందం ఈ కోర్సుల్ని ఆన్‌లైన్లో అందిస్తోంది!

ఉబర్‌, ఓలా లాంటి క్యాబ్‌ నిర్వహణ సంస్థలకి సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ దగ్గర రోజూ ఉదయం పూట సగటున ఎన్ని క్యాబ్‌లు అవసరం అవుతాయో తెలిసిపోతుంది. అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌లలో ఒక వ్యక్తి షాపింగ్‌ చేసినపుడు అతడు దేని కోసం వెతుకుతున్నాడో అలాంటివే మరో పది కనిపిస్తాయి. పెద్ద పొలంలో ఏ మూలన చీడపీడలు ఉన్నాయో డ్రోన్‌ని పంపిస్తే ఫొటోలు తీసేస్తుంది... వీటన్నింటి వెనకా ఉన్న సాంకేతికతే ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌(ఏ.ఐ). ఈ శాస్త్రానికే మిషన్‌ లెర్నింగ్‌(ఎం.ఎల్‌)అని పేరు. గూగుల్‌ అందిస్తున్న సేవల్లో వెయ్యికిపైగా ఏ.ఐ. మీద ఆధారపడి ఉన్నాయంటే నమ్మగలరా! వీటి సాయంతో వ్యాపారంలో, ఉత్పత్తిలో ఒక్క శాతం పెరుగుదల వచ్చినా సంస్థల లాభాలు ఎన్నో రెట్లు పెరుగుతాయి. అందుకే కంపెనీలూ వాటితోపాటే విద్యార్థులూ, ఉద్యోగులూ ఏ.ఐ. గురించి తీవ్రంగా ఆలోచిస్తున్నారు. వైద్యం, వ్యవసాయం, బ్యాంకింగ్‌... ఇలా ప్రతిచోటా ఏ.ఐ. అవసరం ఉంది. యూఏఈ ప్రభుత్వం అయితే ఏకంగా ‘మినిస్ట్రీ ఆఫ్‌ ఏ.ఐ’ని తీసుకొచ్చింది.

అమెజాన్‌ వదిలి...

ఏ.ఐ. విభాగంలో కోర్సు చేయాలనుకునేవారి కోసం వచ్చిందే appliedaicourse.com హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేసే ఈ సంస్థ స్థాపన వెనక ఉన్న కీలకవ్యక్తి చేకూరి శ్రీకాంత్‌ వర్మ. ఈ వైజాగ్‌ యువకుడు బెంగళూరులో యాహూలో పనిచేసి... తర్వాత అమెరికా వెళ్లి అమెజాన్‌లో శాస్త్రవేత్తగా పనిచేశాడు. అక్కడ ఉద్యోగుల ఎంపిక ప్రక్రియలోనూ పాలుపంచుకున్నాడు. అప్పుడే ఏ.ఐ.కి మంచి భవిష్యత్తు ఉన్నప్పటికీ సరైన శిక్షణా సంస్థలే లేవనీ వర్మకు అర్థమైంది. ఆ దశలో భారత్‌ తిరిగొచ్చి ఆన్‌లైన్లో ఆ కోర్సు అందించే సంస్థని పెట్టాలనుకున్నాడు. అదే విషయం స్నేహితులకు చెప్పాడు. అతడి మిత్రులైన మురళీకృష్ణ, సాయి కృష్ణ, నవీన్‌, బ్రహ్మారెడ్డి, శ్రీనివాస్‌, సతీష్‌లూ ఐఐటీ, ఐఐఐటీ, ఐఎస్‌బీల్లో చదువుకున్నారు. వీరికీ ఏ.ఐ.కి సంబంధించిన విభాగాల్లో పనిచేసిన అనుభవం ఉంది. వర్మ చెప్పిన ఆలోచన వీరికి నచ్చింది. అంతా కలిసి ‘అప్లైడ్‌ఏఐకోర్స్‌’ని ప్రారంభించడానికి సిద్ధమయ్యారు. ఆన్‌లైన్‌ కోర్సుకి ముందు అవే పాఠాల్ని హైదరాబాద్‌లో ఆఫ్‌లైన్లో శిక్షణ ఇచ్చారు. శిక్షణ తీసుకునేవాళ్లలో సాధారణ ఇంజినీరింగ్‌ విద్యార్థుల నుంచి గూగుల్‌ ఉద్యోగుల వరకూ అందరూ ఉండేలా చూసుకున్నారు. నాలుగు నెలల శిక్షణ సమయంలో విద్యార్థుల ఆలోచనా స్థాయి, అర్థంచేసుకునే తీరు, వారి సందేహాలను గమనించాక
ఆన్‌లైన్‌ కోర్సుని తయారుచేశారు. తర్వాత పరిశ్రమ నిపుణులూ, ప్రొఫెసర్ల సలహాలనీ తీసుకుని 2017 జూన్‌లో ఆన్‌లైన్లో కోర్సుని ప్రారంభించారు.

నచ్చిన వేగం

అప్లైడ్‌ ఏ.ఐ. అందించే కోర్సుని వారంలో 6-8 గంటల సమయం కేటాయించగలిగితే 3-6 నెలల్లో పూర్తిచేయొచ్చు. గరిష్ఠ కాల వ్యవధి ఏడాది. ఇంటర్మీడియెట్‌ అర్హత ఉన్నవారూ ఈ కోర్సుని నేర్చుకోవచ్చు. గణితంలోని అంశాల్ని దృశ్యరూపంలో, ప్రయోగాత్మకంగా బోధిస్తారు. ఈ కోర్సుకి ఆఫ్‌లైన్లో కొన్ని సంస్థలు వసూలు చేస్తున్న ఫీజులో పది శాతానికే వీరు అందిస్తున్నారు. ‘పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఇంజినీరింగ్‌ చదివేవాళ్లకి ఏ.ఐ. గురించి అవగాహన అంతంత మాత్రమే. నగరాలకు వచ్చి శిక్షణ తీసుకుందామంటే ఖర్చు భరించలేరు. వీటన్నిటినీ ఆలోచించి ఆన్‌లైన్‌ కోర్సు అందిస్తున్నాం. దీనివల్ల ప్రపంచంలో ఎక్కడివారికైనా ఈ కోర్సుని అందించగలుగుతున్నాం’ అని చెబుతారు వర్మ. శిక్షణలో భాగంగా వివిధ రంగాలకు సంబంధించిన అయిదారు కేస్‌స్టడీస్‌ని అభ్యర్థులు నేర్చుకుంటారు. వీటిలో ఏ.ఐ.ని ఉపయోగించే అమెజాన్‌, ఫేస్‌బుక్‌ లాంటి సంస్థలకు చెందిన వాస్తవ సమస్యల్ని వీరు పరిష్కరిస్తారు. శిక్షణ పూర్తయ్యేసరికి ఈ విభాగంలో రెండేళ్ల అనుభవం ఉన్న వ్యక్తుల స్థాయికి వీరిని చేర్చుతారు. ప్రస్తుతం వెయ్యిమందికి పైగా వీరి పోర్టల్‌ద్వారా ఎం.ఎల్‌. కోర్సుని నేర్చుకున్నారు. ఈ కోర్సు విజయవంతంగా పూర్తిచేసిన వారు బహుళ జాతి సంస్థల్లో ఉద్యోగాలూ సంపాదించారు. వీరి కోర్సుల్ని నేర్చుకుంటున్నవారిలో మనవాళ్లతోపాటు సింగపూర్‌, యూఎస్‌ఏ, జపాన్‌, యూకేలకు చెందినవారూ ఉన్నారు. ఏ.ఐ.లో కాలేజీ విద్యార్థులకు ఇంటర్న్‌షిప్‌ అవకాశం ఇస్తున్నారు. ఈ ఏడాది మొదటిసారిగా 20 మందికి తమ కార్యాలయంలో ఇంటర్న్‌షిప్‌ అవకాశం ఇచ్చారు. వారితోపాటు ఆన్‌లైన్లోనూ ఇంటర్న్‌షిప్‌ ఇస్తున్నారు. తమ కోర్సు ద్వారా దేశంలోని ప్రతి ఇంజినీరునీ పరిశ్రమ అవసరాలకు తగ్గట్టు ఏ.ఐ. నిపుణుడిగా తయారుచేయడమే లక్ష్యమని చెబుతోందీ బృందం.