తెలంగాణాలో 8 చోట్ల ఈడి దాడులు...

తెలంగాణాలో 8 చోట్ల ఈడి దాడులు...


- హవాలా కాసినో తో సంబంధాలు...
- మంత్రి మల్లారెడ్డి, కల్వకుంట్ల కవిత, తలసానిలపై నజర్.. 
- ఈడీ దూకుడు చూసి కేసీఆర్ భయపడుతున్నారా..?
- గత కొద్ధి రోజులుగా కనిపించని కేసీఆర్ కుటుంబ సభ్యులు..   
హైదరాబాద్, 29 జూలై ( ఆదాబ్ హైదరాబాద్ ) :
తెలంగాణలో ఈడి దాడులు మొదలైయ్యాయి.. ముఖ్యమంత్రి  కేసిఆర్ ఈడీ దూకుడు చూసి భయపడుతున్నారా? గతంలోనే వాసన పసిగట్టిన ముఖ్యమంత్రి, ఇక ఇప్పుడు ఏ క్షణమైనా ఏదైనా, జరగవచ్చని ఆందోళన చెందుతున్నారా? ఈడీ దాడుల నుంచి ఫ్యామిలీని కాపాడుకునే ప్రయత్నాలు ప్రారంభించారా?  ఫ్యామిలీ టార్గెట్ గా ఇప్పటికే ఈడీ ఒకడుగు వేసిందా? ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులతో వ్యాపార సంబంధాలున్న  కాసినో నిర్వాహకులు చిక్కోటి ప్రవీణ్, మాధవ రెడ్డి  హైదరాబాద్ నివాసాలు కార్యాలయాలపై ‘ఈడీ’ సోదాలు చేసిందా? గత కొంత కాలంగా, ముఖ్యమంత్రి కుమార్తె, ఎమ్మెల్సీ కవిత ఎక్కడా కనిపించక పోవడానికి, ఇదే కారణమా? అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు విశ్లేషకులు.. కవిత విదేశాలకు వెళ్ళారని వినిపిస్తున్న వార్తలలో నిజమెంత? ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటనకు,ఈడీ దాడుల భయమే కారణమా? అంటే.. విభిన్న వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం, ఈ అన్ని ప్రశ్నలకు అవుననే సమాధానమే వస్తోందని అంటున్నారు.  

ఇక వివరాలోకి వెళితే .. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ వెళ్లారు. నూతన రాష్టపతి ద్రౌపతి ముర్మును మర్యాదపూర్వకంగా  కలిసి అభినందనలు తెలిపేందుకే ముఖ్యమంత్రి  ఢిల్లీ వెళ్ళారని, పనిలో పనిగా జాతీయ రాజకీయాలు, ఇంకొన్ని కీలక కార్యాలు చక్కబెట్టుకుని, రాష్ట్రానికి వస్తారని  ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది. ముఖ్యమంత్రి ఢిల్లీ బయలు దేరక ముందే ఈ మేరకు సీఎంఓ ప్రకటన విడుదల చేసింది.

అయితే, నిజంగానే, ముఖ్యమంత్రి అందుకే ఢిల్లీ వెళ్ళారా లేక ఇంకా ఏదైనా వుందా అంటే, అసలు ఉన్నదే అదని, అందుకోసమే ఆయన ఢిల్లీ వెళ్ళారని విశ్వసనీయ వర్గాల సమాచారంగా తెలుస్తోంది. కొంచెం ఆలస్యంగానే అయినా, ముఖ్యమంత్రి కేసీఆర్ దేశంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దూకుడు పెంచిన విషయాన్ని గుర్తించారు. రేపో మాపో తమ తలుపు తడుతుందని పసిగట్టారు. ఒకప్పుడు ముఖ్యమంత్రికి అత్యంత ఆప్తులుగా, రాజకీయ అవసరాలకు ఆర్థిక అండదండలు అందించిన కీలక వ్యక్తుల ద్వారా కేంద్ర ప్రభుత్వం, ఈడీ పూర్తి సమాచారాన్ని సేకరించి గుప్పిట్లో పెట్టుకుని దాడులకు సిద్దమవుతున్న నేపథ్యంలో, ముఖ్యమంత్రి, భయ పడుతున్నది నిజమే అని అంటున్నారు. అంతే కాకుండా, దేశంలో జరుగతున్న పరిణామాలు కూడా  ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలవరానికి గురిచేస్తున్నాయని  అంటున్నారు.

ఇప్పటికే, ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఢిల్లీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్ర జైన్ ను ఈడీ అరెస్ట్ చేసింది. ఉప ముఖ్యమంత్రి, విధ్యాశాఖ మంత్రి, మనిష్  సిసోడియా అరెస్థుకు రంగం సిద్దమైంది. ఇది ఎవరో చెప్పిన మాట కాదు, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద కేజ్రివాల్ స్వయంగా, సిసోడియా అరెస్థుకు సంబందించి తమకు ‘విశ్వసనీయ’ సమాచారం ఉందని ప్రకటించారు.  మరోవంక టీచర్స్ రిక్రూట్మెంట్ స్కామ్ కు సంబంధించిన మనీలాండరింగ్‌ కేసులో పశ్చిమ బెంగాల్ మంత్రి, టీఎంసీ నేత పార్థ ఛటర్జీని ఈడీ అరెస్ట్‌ చేసింది. చివరకు అయిన దానికి కాని దానికి కేంద్రం పై కస్సున లేచే బెంగాల్ ముఖ్యమంత్రి మమత  బెనర్జీ కూడా నోరు మెదపలేని విధంగా, ఈడీ పక్కా ఆధారాలు ( నోట్ల కట్టల కుప్పలు) నేరుగా ప్రజల ముందు ఉంచింది.  అందుకే మమత బెనర్జీ,‘పార్థ’  పాపంతో తనకు సంబంధం లేదని, తనని తాను రక్షించుకునే పనిలో  పడి పోయారు. ఈ నేపధ్యంలోనే, తెలంగాణలోనూ అలాంటి పరిస్థితి రావచ్చనే ముందు చూపుతోనే ముఖ్యమంత్రి కేసీఆర్  ఢిల్లీలో ‘రహస్య’  మంతనాలు సాగిస్తున్నారని అత్యంత విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఓ వంక, జరగరానిది జరిగితే, జాతీయ పార్టీ అండ అవసరం అని  భావించే,  ‘ఆత్మ’ ద్వారా కాంగ్రెస్ పార్టీతో మంతనాలు సాగిస్తున్నారు. మరో వంక బీజేపీ పంచన చేరే ప్రయత్నాలు కూడా  కేసీఆర్ చేస్తున్నారని అంటున్నారు.  నిజానికి ,బీజేపీ, ఆ మాట కొస్తే జాతీయ, ప్రాంతీయ పార్టీలు ఏవీ కూడా కేసీఆర్ ‘విశ్వసనీయత’ను విశ్వసించడం లేదు. అదలా ఉంటే, కాసినో నిర్వాహకులు చిక్కోటి ప్రవీణ్, మాధవ రెడ్డి  హైదరాబాద్ నివాసాలపై జరిపిన దాడుల్లో కీలక సమాచరం లభించిందని, ఇందుకు సంబందించి ఫస్ట్ అరెస్ట్ త్వరలోనే ఉండే అవకాశం ఉందని అంటున్నారు.అదీగాక, తాజాగా సుప్రీం కోర్టు మనీ లాండరింగ్ కేసుల్లో , విచారణ, అరెస్టులు, ఆస్తుల స్వాధీనం వంటి  అధికారాలు ఈడీకి ఉంటాయని, స్పష్టమైన తీర్పు ఇచ్చిన  నేపధ్యంలో, ఈడీ ముందు ముందు మరింత దూకుడు పెంచినా ఆశ్చర్య పోనవసరం లేదని అంటున్నారు. అందుకే ముఖ్యమంత్రి, అయన కుటుంబ సభ్యులు ఆందోళన చేo దు తున్నారని అంటున్నారు.

Tags :