వేవేల వర్ణాల సీతాకోకచిలుక

Updated:14/05/2018 03:23 AM

different types butterfly

ప్రపంచసుందరి ఐశ్వర్యరాయ్‌కు కేన్స్ చిత్రోత్సవంతో సుదీర్ఘ అనుబంధం ఉంది. ఎర్ర తివాచీపై ఈ భామ ఆగమనం కోసం అంతర్జాతీయ మీడియా కూడా ఆసక్తిని ప్రదర్శిస్తుంది. తాజాగా 71వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఐశ్వర్యరాయ్ సందడి చేసింది. సీతాకోకచిలుక డిజైన్‌లో తీర్చిదిద్దిన గౌను ధరించి వీక్షకుల మనసుల్ని దోచుకుంది. వినూత్న శైలిలో దుబాయ్‌కి చెందిన ప్రముఖ డిజైనర్ మైకేల్‌సింకో రూపకల్పన చేసిన ఈ సీతాకోకచిలుక వస్త్రధారణలో రెడ్‌కార్పెట్‌పై ఐశ్వర్యరాయ్ దేవకన్యలా నడయాడింది. ఈ వేడుకకు సంబంధించిన ఫొటోల్ని ఐశ్వర్యరాయ్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది. నలభయ్యవపడిలో కూడా వన్నెతరగని సౌందర్యం అంటూ నెటిజన్లు ఆమెను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. మదిని దోచిన అందాల సీతాకోకచిలుక అంటూ ఆమె ధరించిన గౌనుపై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. ఈ నెల 8న ప్రారంభమైన కేన్స్ చిత్రోత్సవాలు ఈ నెల 19వరకు కొనసాగనున్నాయి. ప్రపంచవ్యాప్తంగా అత్యుత్తమ చిత్రాల్ని ఈ వేడుకలో ప్రదర్శిస్తున్నారు. భారత్ నుంచి నవాజుద్దీన్ సిద్ధిఖీ ప్రధాన పాత్రలో నందితాదాస్ దర్శకత్వం వహించిన మంటో, ధనుష్ నటించిన ది ఎక్స్‌ట్రార్డీనరీ జర్నీ ఆఫ్ ద ఫకీర్ చిత్రాల్ని ప్రదర్శించబోతున్నారు.