కర్రీ పాయింట్‌లో కొన్న దొండకాయ కూరలో బొద్దింకలు.

Updated:27/05/2018 03:57 AM

cockroaches found in ivy gourd curry brought from curry point

కర్రీ పాయింట్‌లో కొనుగోలు చేసిన కర్రీలో బొద్దింకలు వచ్చిన సంఘటన చోటు చేసుకున్నది. వివేకానందనగర్‌కు చెందిన సాయితేజ అదే కాలనీలోని భీమాస్ కర్రీ పాయింట్‌లో శనివారం మధ్యాహ్నం సమయంలో దొండకాయ కూరను కొనుగోలు చేశాడు. అనంతరం ఇంటికి వెళ్లి భోజనంలోకి కూరను వడ్డించుకుంటున్న సందర్భంగా సుమారు 7 వరకూ బొద్దింకలను గుర్తించాడు.

అప్పటికే కొంత కూరను తిన్న బాధితుడు ఆలస్యంగా వాటిని గుర్తించి హుటాహుటిన కర్రీ పాయింట్ వద్దకు వచ్చి నిర్వాహకులను నిలదీశాడు. దీంతో భీమాస్ కర్రీ పాయింట్ నిర్వాహకులు బాధితుడు సాయితేజకు నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వటంతోపాటు కర్రీ పాయింట్‌ను ఆకస్మికంగా మూసేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీనిపై జీహెచ్‌ఎంసీ ఆహార విభాగం అధికారులకు ఫిర్యాదు చేయనున్నట్లు బాధితుడు సాయితేజ తెలిపాడు.