కేసీఆర్‌ కి ఓటమి భయమా..!

కేసీఆర్‌ కి ఓటమి భయమా..!


- అపరచాణక్యుడి ఆలోచనేంటి..?  
- వన్ షాట్ టూ బర్డ్స్  కథేంటి..   
- సిట్టింగులకు ఈసారి సీట్లిస్తారా..  
- ఓటును ఎంతకైనా కొనచ్చన్న ధీమానా..? 
- ఒకటో తారీకు జీతాలు ఇయ్యలేరు..  
- పైసలు లేక పథకాలు నడవలేని పరిస్థితి..   
- ముందు నొయ్యి వెనుక గొయ్యిలా రాష్ట్ర పరిస్థితి..
- అందుకే ఎన్నికలంటూ ముందుకొస్తున్నారా..?  
- మరి గెలుపెవరిది ..ఓడేదెవ్వరు..? 

హైదరాబాద్, 11 జూలై ( ఆదాబ్ హైదరాబాద్ ) :
బీజేపోళ్లకు నిజంగా దమ్ముంటే ముందస్తు ఎన్నికల తేదీని ప్రకటించమనండి. నేను అసెంబ్లీని రద్దు చేస్తా.. మనందరం కలిసి ఎన్నికలకు పోదామన్న కేసీఆర్‌ మాటలను బీజేపీ స్వాగతించింది. ఆ పార్టీకి చెందిన సీనియర్ నాయకులు మీడియా ముందుకు వచ్చి ముందస్తుకు సిద్ధమన్న ప్రకటనలు చేశారు. అయితే  కేసీఆర్‌ తెలంగాణ ప్రభుత్వాన్ని రద్దుచేసి ఎన్నికలకు పొతే, ఆయన్ను బీజేపీ తట్టుకుంటుందా అనే ప్రశ్నలు  వెల్లువెత్తుతున్నాయి. కేసీఆర్‌ కు అపర చాణక్యుడని పేరు .. ప్రత్యర్థులకు సమాధానం చెప్పలేని, చెప్పుకోలేని స్థితిని కల్పించే వ్యూహ రచనలు చేయడంలో ఆయనకు ఎవరు సాటి ఎవ్వరు లేరన్నది బహిరంగ రహస్యం. అంగ బలం, అర్ధ బలం, కార్యకర్తల బలమున్న టీఆర్‌ఎస్ ఇప్పుడు పీకే బలాన్ని సైతం మూటగట్టుకుంది..  అలాంటి తెరాసను బీజేపీ నిజంగా ఎదుర్కోగలదా..? అనే ప్రశ్న సర్వత్రా వ్యక్తమవుతోంది.. ముందస్తుకు సిద్ధపడుతున్న అపరచాణక్యుడి ఆలోచనలో దాగి ఉన్న రహస్యమేంటని పార్టీ నాయకులే కాదు, ప్రతిపక్షాల నాయకులు శోధించే ప్రయత్నం చేస్తున్నారు. 

ఎన్నికలకు ఎప్పటికైనా పోవాలే :
ఎన్నికలదేముంది.. ఇయాల కాకపోతే రేపైనా పోవాలే. ఎప్పటికి ఈ లొల్లి ఉంటది . తప్పించుకోలేము. ఆ పోయేదేదో ఇప్పుడేపోదాము. గప్పటి మాలే అందరికి సీట్లు ఇచ్చుడు ఈ సారి నాతో కాదు. అది మనోళ్లకు ముందే ఎరుకైంది. అందుకే ఆడీదా మావోళ్లు అటు ఇటు సూత్తాళ్ళు కాబోలు. నేను కూడా దాచిపెట్టకుండా ముందే ఆ  ముక్క చెప్పి పారేస్తే  ఆ పంచాయితీ నాకుండదు. ఉండేటోడు ఉంటడు..పోయే టోడు పోతడు.. ఉండేటోన్ని ఎందుకున్నవు అని అడుగా.. పోయేటోన్ని ఎందుకుపోతున్నవని అడుగా.. అది గాల్లిష్టం . 

వన్ షాట్ టూ బర్డ్స్  కథేంటి..?  
ముందస్తుకెళితే ప్రమాదం కొంత మేరకు మాత్రమే ఉంటుందని కేసీఆర్‌ భావించినట్లు ప్రచారం జరుగుతోంది.. ప్రభుత్వ పథకాల వ్యయం ప్రభుత్వానికి తలకు మించిన భారంగా మారినట్లు తెలుస్తోంది.. కొత్తగా ప్రకటించిన దళిత బంధు, ఇప్పటికే ఇస్తున్న రైతు బంధుతో పాటు పలు సంక్షేమ కార్యక్రమాలకు ఖర్చుపెడుతున్న ప్రభుత్వ నిధులు ప్రభుత్వానికి తలకు మించిన భారంగా మారాయి. అందుకే ప్రభుత్వ శాఖల్లో పనిచేసే ఉద్యోగులకు సకాలంలోజీతాలు చెల్లించలేని దుస్థితి  ఏర్పడింది. అప్పు తీసుకుందామంటే  కేంద్రం సహకరించడం లేదు. వస్తున్న ఆదాయంతో ప్రభుత్వాన్ని నడపడలేము. గత ఎన్నికల్లో మాదిరిగా సీట్టింగ్ స్థానాల్లో వారినే నిలబెట్టిన దైర్యం ఈ సారి చేయలేరు. అందుకే కేంద్రంఫై మరింత దూకుడు పెంచిన కేసీఆర్‌ వన్ షాట్ టూ బర్డ్స్  ఫార్ములాను అమలు చేసే దిశగా వ్యూహ రచన  చేస్తున్నారు. ఒక్కసారి ఎన్నికల వేడిని రగిలిస్తే ఇటు ఆశావాహులను, అటు ప్రతిపక్షాలను కట్టడి చేయొచ్చన్న ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది.  

ప్రభుత్వ వ్యతిరేకత ఉంది : 
తెరాస ప్రభుత్వానికి  అంచనా వేయలేనంత వ్యతిరేకత ఉంది. ఆ వ్యతిరేకతతో ఓటమి చెందలేమన్న ధీమా కూడ కేసీఆర్‌ సర్కార్ లో ఉంది. ఉన్న 119 స్థానాల్లో ఎలాగోలా  కొన్ని మార్పులు చేర్పులు చేస్తే ఈ సారి గట్టెక్కొచ్చన్న ఆలోచనకు తెరాస వచ్చిందని తెలుస్తుంది. ఉన్నోళ్లను పొమ్మనలేరు. ఉన్నోళ్ళలో చాలామందికి సీట్లు దొరకవని ముందస్తుగానే  లీకులిస్తే వారిపని వారు చేసుకుంటారు. సీనియర్లతో ఎన్నికల సమయంలో ఎలాంటి ఆందోళనలకు అవకాశం ఉండదని భావించిన కేసీఆర్ అపరచాణక్యుడిలా  ఆలోచన చేశారని అంతా అనుకుంటున్నారు. 
 
ముందు నొయ్యి వెనుక గొయ్యిలా మారింది : 
సంకటంలో తెలంగాణ ప్రభుత్వం ఉందంటూ ప్రతిపక్షాల ప్రచారం జోరందుకుంది. వారు చేస్తున్న ప్రచారంలో నిజముందని ప్రజలు భావిస్తే ఫలితాలు తిరగబడొచ్చన్న ఆలోచనకు సీఎం వచ్చినట్లు  తెలుస్తుంది. ఇక నెలవారీ జీతాలు, పథకాల కొనసాగింపు, ఆశావహులకు సీట్ల కేటాయింపు వచ్చిపడే కష్టాలు. వీటన్నిటి నుంచి గట్టెక్కాలంటే కేసీఆర్ ఒక్కటే మంత్రం అనుకున్నారు కాబోలు ముందస్తు ఎన్నికలకు గంట మోగించారు..

Tags :