చికోటి ప్రవీణ్ చీకటి జీవితం..

( క్యాసినో వ్యవహారంలో ముగిసిన ఈడీ విచారణ..)
- విచారణకు రావాలంటూ చీకోటి, మాధవరెడ్డిలకు నోటీసులు..
- చీకోటి ప్రవీణ్‌కు రాజకీయనేతలతో సంబంధాలు..
- ప్రవీణ్ ద్వారా నేపాల్ వెళ్లిన 16 మంది ఎమ్మెల్యేలు.. !
- ఈడీ విచారణలో అన్నీనిజాలు చెప్పానన్న చీకోటి..
- నేపాల్‌లో క్యాసినో చట్టబద్ద గేమ్ అని వ్యాఖ్య..
చికోటి ప్రవీణ్ కుమార్ చీకటి జీవితంలోని నేరాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి.. ఈడీ విచారణలో కళ్ళు బైర్లు కమ్మే నిజాలు వెలుగు చూస్తున్నాయి.. ఈడీ విచారణలో తాను అన్నీ నిజాలే చెప్పానని ప్రవీణ్ చెప్పడం గమనార్హం.. కాగా క్యాసినో వ్యవహారంలో కీలక సూత్రధారి చికోటి ప్రవీణ్ ఇంట్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ సోదాలు ముగిశాయి. విచారణకు రావాల్సిందిగా ఈడీ అధికారులు వారికి నోటీసులు ఇచ్చారు.
హైదరాబాద్, 28 జూలై ( ఆదాబ్ హైదరాబాద్ ) :
ప్రముఖులు, సెలబ్రిటీలతో ప్రవీణ్‌కు సంబంధాలున్నట్లు ఈడీ అధికారులు గుర్తించారు. 10 మంది సినీ తారలను నేపాల్‌కు రప్పించినట్లు.. అంతకుముందు వారితో చికోటి ప్రవీణ్ ప్రమోషన్ వీడియోలు చేయించినట్లు తెలుస్తోంది.నేపాల్ క్యాసినోకు 10 మంది టాలీవుడ్, బాలీవుడ్ సెలబ్రిటీలు హాజరైనట్లు ఈడీ గుర్తించింది. క్యాసినోకు రావాలంటూ పలువురు హీరోయిన్లు చేసిన ప్రమోషన్ వీడియోలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారాయి. ప్రమోషన్లకు సంబంధించి క్యాసినో నిర్వాహకుల నుంచి సినీ తారలకు అందిన చెల్లింపులు.. ఇతర ఆర్థిక లావాదేవీలపై ఈడీ ఆరా తీస్తున్నట్లు సమాచారం.మరోవైపు ఐఎస్ సదన్‌లోని ప్రవీణ్ ఇల్లు, కడ్తాల్‌లోని ఫాంహౌస్‌లో ఈడీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ప్రవీణ్ ల్యాప్‌టాప్, మొబైల్ స్వాధీనం చేసుకున్నారు. ఇటీవల జరిగిన ఆయన పుట్టినరోజు వేడుకలకు పలువురు రాజకీయ నేతలు, సినీ తారలు హాజరైనట్లు గుర్తించారు. సోషల్ విూడియా ద్వారా క్యాసినో వీడియోలను ప్రవీణ్ ప్రచారం చేసినట్లు తేల్చారు. జనవరిలో గుడివాడ గ్యాంబ్లింగ్‌లోనూ ఆయన హస్తం ఉన్నట్లు గుర్తించారు. నేపాల్, ఇండోనేసియా, థాయ్‌లాండ్ క్యాసినోలకు పలువురిని తీసుకెళ్లినట్లు ఈడీ అధికారుల విచారణలో తేలింది.
ఇక రాజకీయ నేతలతో ప్రవీణ్ కు సంబంధాలు ఉన్నాయని గుర్తించి వీరికి సంబంధించి ఆధారాలు సేకరిస్తున్నారు. ఈ క్రమంలో బయటకు వచ్చిన ఆయనను విూడియా ప్రశ్నించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్యాసినో నేపాల్ లో చట్టబద్దంగా జరుగుతోందని, తాను న్యాయబద్దంగానే వ్యాపారం చేస్తున్నానని తెలిపారు. క్యాసినో వ్యవహారంలోనే ఈడీ దాడులు చేసిందని, ఈడీ అధికారులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చానన్నారు. తిరిగి సోమవారం విచారణకు రమ్మన్నారని, ఆ రోజు విచారణకు హాజరై అన్ని ప్రశ్నలకు సమాధానం ఇస్తానని చెప్పారు. కాగా చికోటి ప్రవీణ్‌కు పలువురు రాజకీయ నేతలతో లింకులున్నట్లు ఈడీ అధికారులు గుర్తించారు. ప్రవీణ్ వ్యవహారంలో అన్ని లింకులు బయటపడుతున్నాయి. ఏపీ, తెలంగాణ కు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, డీసీసీబీ ఛైర్మన్లు ఉన్నారు. నేపాల్‌కు వెళ్లిన కస్టమర్లలో 16 మంది ఎమ్మెల్యేలు ఉన్నట్లు ప్రవీణ్ ల్యాప్‌ట్యాప్‌లో వీఐపీల భాగోతాలు బయటపడ్డాయి. అలాగే చెన్నైకి చెందిన బంగారం వ్యాపారికి హవాలా ఏజెంట్‌గా చికోటి వ్యవహరిస్తున్నారు. ఒక్కో దేశానికి ఒక్కో రేటు వసూలు చేస్తున్నారు. ఇండోనేషియా, శ్రీలంక, నేపాల్‌లో అడ్డాలున్నాయి. కోల్‌కతా విూదుగా నేపాల్‌కు కస్టమర్లను పంపిస్తున్నారు. ఒక్కో విమానానికి రూ. 50 లక్షలు, ఒక్కో హోటల్‌కు రూ. 40 లక్షలు చెల్లిస్తున్నారు. ఒక్కో కస్టమర్ల నుంచి రూ.5 లక్షల చొప్పున వసూలు చేస్తున్నారు. చికోటి ప్రవీణ్‌కు సుమారు 200 మంది రెగ్యులర్ కస్టమర్లు ఉన్నట్లు ఈడీ అధికారులు గుర్తించారు.