అభివృద్ధి పేరుతో కార్పొరేట్ బిల్డర్లకు చెరువుల ధారాదత్తం..

- ప్రభుత్వం స్పందించకపోతే న్యాయపోరాటం చేస్తాం : బీజేపీ నాయకులు మొవ్వా సత్యనారాయణ..
హైదరాబాద్, 04 ఆగష్టు ( ఆదాబ్ హైదరాబాద్ ) :
శేరిలింగంపల్లి లో ఉన్నటువంటి చెరువుల సుందరీకరణ పేరుతో చెరువులు దత్తత తీసుకున్నాం అని కొంత మంది ప్రజా ప్రతినిధులు హడావుడి చేసి ఎటువంటి అభివృద్ధి చేయకపోగా.. చెరువులలో నీరు నిల్వవుండకుండా ఖాళీచేసి రాత్రి పూటల్లో చెరువులను మట్టితో పూడ్చుతూ.. అటు అధికారులు, ఇటు స్థానిక ప్రజా ప్రతినిధులు కోట్ల రూపాయలు దండుకోవడమే అభివృద్ధిగా చెప్పుకుంటూ వచ్చారు . ఇప్పుడు మళ్లీ జీ.హెచ్.ఎం.సి. పరిధిలో ఉన్నఅనేక చెరువులను.. మరీ ముఖ్యంగా శేరిలింగంపల్లి నియోజకవర్గంలో ఉన్నటువంటి 15 చెరువులను బడా బిల్డర్లకు సి.ఎస్.ఆర్. నిధుల పేరుతో పెద్ద నిర్మాణ సంస్థలకు ఈ చెరువులను అప్పగించి.. మరొక సారి ఉన్న చెరువులను కూడా కబ్జా చేసి కోట్లు గడించడానికి స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు,టి.ఆర్.ఎస్. ప్రభుత్వం లక్షల కోట్ల రూపాయలు దండుకోవడానికి రూపకల్పన చేస్తూ.. ఇప్పటికే వర్షాలు పడితే రోడ్లు ఇండ్లు నీళ్లతో మునిగిపోయే పరిస్థితి ఉండగా.. ఈ రోజు పేదలు, బడుగు బలహీన వర్గాలు ఉండేటువంటి కాలనీలలో.. బస్తీలలో, ట్రాఫిక్ జామ్ లతో జీ.హెచ్.ఎం.సి.లో ఉన్న ప్రజానీకం అష్టకష్టాలు పడుతూఉంది. అలాగే చెరువుల్లో వర్షపునీరు నిల్వ ఉండక పోవడం వల్ల భూగర్భ జలాలు పూర్తిగా ఎండిపోయి, వేసవి కాలంలో నీటి ఎద్దడి సమస్య ఎదురవుతోంది.. ఇవి చాలవు అన్నట్లుగా ఏ చెరువులో, ఏ బడా బిల్డర్ లు నిర్మాణం చేస్తున్నారో.. ఆ నిర్మాణ సంస్థల వారికే ఆ చెరువులు అప్పగించడం జరుగుతుంది. ఆ చెరువులు అప్పగించే ముందు జీ.హెచ్.ఎం.సి., రెవిన్యూ అధికారులు వాటికి సంబంధించిన సర్వే నంబర్లు చెరువులకు సంబంధించిన భూ విస్తీర్ణం పూర్తి వివరాలను ప్రజలకు తెలియజేయాలని.. అలాగే ఏవైతే నిర్మాణ సంస్థలు చెరువులను అభివృద్ధి పేరుతో దత్తత తీసుకుంటున్నాయో..? చెరువుల పూర్తి విస్తీర్ణాన్ని ఆధీనంలోకి తీసుకున్న తరువాతనే చెరువుల సుందరీకరణ చేపట్టాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ.. ఈ విషయంలో ఎటువంటి అక్రమాలు జరిగినా సంబంధిత అధికారుల మీద.. కోర్టు ద్వారా చర్యలు తీసుకుంటామని బీజేపీ రాష్ట్ర నాయకులు మొవ్వా సత్యనారాయణ హెచ్చరించారు..