గుంటూరు శ్రోతల గుండె చప్పుడు ఎపి 9 ఎఫ్.ఎం.

( ఆబాల గోపాలాన్ని ఆకట్టుకుంటున్న ఎఫ్.ఎం. రేడియో.. )
- మొట్టమొదటి ఆన్ లైన్ ఎఫ్.ఎం. రేడియో..
- పీ. వంశీ కృష్ణ ఆలోచనల్లోంచి పుట్టిన సంచలనం..
- 30 మందికి పైగా ఉపాధి కల్పించిన మానవత్వం..
- రోజుకి నాలుగు షోలతో.. సమాజానికి ఉపయోగపడే
కార్యక్రమాలు..
అమరావతి, 02 ఆగష్టు ( ఆదాబ్ హైదరాబాద్ ) :
తాను ఉన్నత చదువులు చదవడమే కాకుండా.. పదిమందికీ ఉపయోగపడే కార్యక్రమాలు చేయాలనే దృఢ సంకల్పమే ఆ యువకుడిని విజయ తీరాలకు చేర్చింది.. సమాజానికి ఉపయోగపడే విధంగా అతనిచేత మంచి మంచి కార్యక్రమాలను చేయిస్తోంది.. గుంటూరు శ్రోతలకు గుండెకాయగా మారిన ఎపి 9 ఎఫ్.ఎం. రేడియో మొట్టమొదటి రెండు తెలుగు రాష్ట్రాల ఆన్ లైన్ ఎఫ్.ఎం. రేడియోగా ప్రసిద్ధి గాంచింది..
గుడ్ మార్నింగ్'తో మొదలై 'హలో గురూ..! హారు మామా..!' అంటూ యువతమెచ్చిన ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్‌లతో ఆకట్టుకుంటోంది గుంటూరులోని ఎపి9ఎఫ్ఎమ్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.. ఆన్లైన్ డిజిటల్ టెక్నాలజీ సాయంతో ఏర్పాటు చేసిన గుంటూరులోని ఎపి 9 ఎఫ్ఎమ్ రేడియో ఇప్పుడు ఆబాలగోపాలాన్ని ఆకట్టుకుంటుంది. ఈ ఎఫ్ఎమ్లో వినోదాన్ని పంచే మాటలే కాదు, తమదైన చలాకీతనం, చమత్కారాలతో శ్రోతల్ని ఆకట్టుకుంటున్నారు ఇక్కడి రేడియో జాకీలు. ఇలా ఆకట్టుకునే వీరంతా పాతికేళ్లలోపు యువతే. ఈ ఎఫ్ఎమ్ రేడియో తెలుగు రాష్ట్రాల ప్రజలనే కాదు, విదేశీ శ్రోతల్నీ మైమరిపిస్తోంది. ఎఫ్ఎమ్ రేడియోలు మన దేశంలో చాలానే ఉన్నప్పటికీ ఆన్లైన్ డిజిటల్ ఎఫ్ఎమ్ మాత్రం ఇది రెండోది. ఉభయ తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే మొట్టమొదటి ఆన్లైన్ ఎఫ్ఎమ్ ఇదే కావడం విశేషం. రెండేళ్ల క్రితం ప్రారంభమైన ఈ ఆన్లైన్ రేడియోకు ప్రపంచ వ్యాప్తంగా రెండు కోట్లమందికిపైగా శ్రోతలున్నారంటే ఏ స్థాయిలో ఎపి 9 ఎఫ్ఎమ్ ఆదరణ పొందుతుందో ఇట్టే అర్థమైపోతుంది. దీనికి సంబంధించి మొబైల్ యాప్‌ను కూడా తయారుచేశాడు సీఈఓ వంశీ.
ఎఫ్ఎమ్ రేడియో స్థాపన వెనుక అసలు కథ నడిపించింది ఈ ఎఫ్ఎమ్ రేడియో సిఈవో పి.వంశీకృష్ణది.. ఈయనది గుంటూరు. బీటెక్ పూర్తిచేసిన తర్వాత సాఫ్ట్వేర్ రంగంలో ఐదంకెల జీతం తీసుకునేవాడు. మంచి ఉద్యోగం వచ్చిందని తెలియగానే ఇంట్లో వాళ్లంతా చాలా సంతోషపడ్డారు. కానీ తనకు మాత్రం నలుగురిలో ఒకడిగా కాకుండా ఏదైనా కొత్తగా చేయాలనే తపన ఉండేది. అయిష్టంగానే ఆ రంగంలో ఆర్నెల్లు గడిపాడు. కానీ ఎక్కువకాలం ఆ పనిలో ఇమడలేకపోయాడు. మనసుకు నచ్చిన పని చేయాలని నిర్ణయించుకుని ఆ ఆలోచనతో భిన్నంగా ఉంటూ.. పదిమందికి ఉపయోగపడేలా ఉండాలనుకున్నాడు. ఇలా తాను అనుకున్నది సాధించాలనే దృఢ సంకల్పంతో హైదరాబాదు నుంచి గుంటూరు తిరుగు పయనమయ్యాడు ఆ యువకుడు. అలాంటి సమయంలో తనకొచ్చిన సరికొత్త ఆలోచనల నుంచి పుట్టిందే ఆన్లైన్ డిజిటల్ ఎఫ్ఎమ్.ను ఏర్పాటు చేయడానికి రూ.30 లక్షలు ఖర్చవుతుందని చెప్పడంతో మొదట కుటుంబసభ్యులు ఆలోచనలో పడ్డా, తర్వాత అతనికి ఆర్థికంగా అండగా నిలబడ్డారు. గుంటూరు జిల్లా భౌగోళిక స్థితిగతులకు అద్దంపట్టేలా ఎఫ్ఎమ్ లోగోను తయారుచేయించాడు. అలా ఒక్కో మెట్టూ ఎక్కుతూ.. తన ఆలోచనలకు సాంకేతిక నైపుణ్యాన్ని జోడిస్తూ.. అనతికాలంలోనే గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం ఎపి 9 ఎఫ్ఎమ్లో రోజుకు నాలుగు 'షో'లు జరుగుతున్నాయి. మార్నింగ్ అప్డేట్స్, మ్యూజిక్ ఎక్స్‌ప్రెస్, బర్త్‌డే విషెస్, ప్రేమ ఇష్క్ కాదల్, వంటి షోలు యువతను ఎంతగానో ఆకర్షిస్తున్నాయి. వంశి తన ధృడ సంకల్పంతోనే అరుదైన ఈ ఘనతను సాధించాడు..
యువతకు ఉపాధి మార్గం :
ఆర్జేలు, మ్యూజిక్ ఆపరేటర్లు, మార్కెటింగ్ వంటి విభాగాల్లో పార్ట్‌టైమ్, ఫుల్‌టైమ్ అంటూ 30 మందికిపైగా యువతీయువకులకు ఉపాధి ఇవ్వగలుగుతున్నాడు వంశీ. గుంటూరు చుట్టుపక్కల ప్రాంతాల్లోనున్న ఇంజనీరింగ్ కళాశాలలోని విద్యార్థినీ, విద్యార్థులు ఇందులో ఆర్జేలుగా శ్రోతలను అలరిస్తున్నారు. మ్యూజిక్ ఒక్కటే కాకుండా రేడియో వేదికగా మానసికోల్లాసానికి దోహదపడే కామెడీ షోలు, సమాజానికి ఉపయోగపడే విశేషాలు, సమకాలీన అంశాలపై ప్రజల భావాలను చర్చిస్తున్నారు.
తమవంతుగా సమాజానికి.. !
ప్రజారోగ్యం, స్వచ్ఛభారత్, మానవతా విలువలు, సమాజంలోని స్థితిగతులు వంటివాటిపై కూడా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ప్రతీ వారాంతంలోనూ సామాజిక సేవాకార్యక్రమాల్లోనూ పాల్గొంటూ తమ బాధ్యతను నిర్వహిస్తున్నారు. ఇదిలా ఉంటే భవిష్యత్తులో రాజకీయ విశ్లేషణపై యువతకు అవగాహన ఉండేలా 'రాజకీయ షో'ను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సిఈవో వంశీకృష్ణ పేర్కొన్నారు..