చదువేనా ! ఇప్పుడూ

Updated:08/04/2018 08:15 AM

always studiying

సెలవులు రావడం ఆలస్యం... ఫోనులో వీడియోగేమ్‌లు ఆడతాడు. ఫోను ఛార్జింగ్‌ అయితేనేగానీ అక్కడి నుంచి లేవడు.. రెండుగంటలుగా ఇదే పరిస్థితి...’ అంటూ రమ తిడుతున్నా విననట్టే ఉన్నాడు పదకొండేళ్ల అజిత్‌. అతనొక్కడే కాదు చాలామంది ఇళ్లల్లో ఇప్పుడు ఇలాంటి వాతావరణమే కనిపిస్తుంది. అలాగని ఫోన్లు లాగేసుకుని వచ్చే ఏడాదికి చదువుకోమని చెప్పడం కూడా పరిష్కారం కాదు కదా. సెలవులు ఉండేది రెణ్నెల్లయినా సరే... చదువు అనే మాట ఎత్తకుండా వాళ్లకు నచ్చింది చేయనివ్వడం... తోటిపిల్లలతో సరదాగా గడపనివ్వడం వల్ల వాళ్లలో ఎన్నో నైపుణ్యాలు పెరుగుతాయి. ఆత్మవిశ్వాసం సొంతమవుతుంది. నలుగురిలో కలిసిపోయే తత్వం అలవడుతుందని చెబుతారు మానసిక నిపుణులు. అందుకే ఈ రోజుల్లో కొందరు తల్లిదండ్రులు కూడా పిల్లల అభిప్రాయాలకు పెద్దపీట వేయడానికి సిద్ధమవుతున్నారు. కార్పొరేట్‌ చదువులతో పోటీ పడుతూ పరీక్షలయ్యే సరికి చిన్నారులు తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారనేదీ ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందుకే చిన్నారుల అభిరుచుల మేరకు కళలూ, క్రీడలూ, ఇతర అంశాల్లో తాత్కాలికంగానైనా సరే... నచ్చినవి నేర్పించాలి. ఈ సెలవుల్లో పిల్లల్ని వీలైనంత ఎక్కువగా ఆనందంగా ఉంచే ప్రయత్నం చేయడం వల్ల రాబోయే విద్యా సంవత్సరంలో మరింత ఉత్సాహంగా మారతారు. ఆసక్తిని బట్టి పర్యటక ప్రాంతాలు చూపిస్తే కొత్త విషయాలు నేర్చుకోగలరు. కుదిరితే తిరిగొచ్చిన తరువాత వాళ్లు చూసిన వివరాలు రాయమని చెప్పడం వల్ల ఆ ప్రదేశం వాళ్లకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. తల్లిదండ్రులిద్దరూ ఉద్యోగస్థులయితే... నానమ్మ లేదా అమ్మమ్మ ఊళ్లకు పంపించొచ్చు. వాళ్లమధ్య గడపడం వల్ల సంప్రదాయ రుచుల నుంచీ, కథలూ, కొత్త విషయాలూ, విలువలు.. ఇలా ఎన్నో తెలుసుకోగలుగుతారు. పోనీ క్రీడల్లో ఆసక్తి ఉంటే గనుక 30 లేదా 40 రోజులపాటు క్రికెట్‌, వాలీబాల్‌, బ్యాడ్మింటన్‌ వంటివి నేర్పించొచ్చు. వీటన్నింటివల్లా ఒత్తిడికి దూరమవుతారు. కొందరికి ఈత, ట్రెక్కింగ్‌, సైక్లింగ్‌ పట్ల ఆసక్తి ఉంటుంది. అలాంటివారికి ఈ రోజుల్లో అలాంటి క్యాంప్‌లు ఏర్పాటు చేస్తే సంస్థలు ఉన్నాయి.
ఎన్నో లాభాలు...
శిబిరాలు ఏవయినా సరే.. అన్నీ పిల్లల్ని బిజీగా ఉంచుతూనే నైపుణ్యాలు అందిస్తాయి. వ్యక్తిత్వాన్ని పెంచుతాయి. సామాజిక నైపుణ్యాలూ సొంతమవుతాయి. ఇతరులపై ఆధారపడకుండా తమపనులు తాము చేసుకునే స్థాయికి చేరుకుంటారు. కొత్త చోటు కాబట్టి కొత్త స్నేహాలు చేసుకోగలుగుతారు. భయం పోయి నలుగురిలో సులువుగా కలవగలుగుతారు. సమస్యల్ని పరిష్కరించడం, జీవితంలో ఎదురయ్యే సవాళ్లను అధిగమించడం వాళ్లకు వస్తుంది. బయటకు తీసుకెళ్తే గనుక భిన్న నేపథ్యాలూ, సంస్కృతులూ, తెలుసుకోగలుగుతారు. ఇన్ని లాభాలున్నప్పుడు శిక్షణా శిబిరాల్లో చేర్పించడంలో తప్పేముంటుంది. అయితే ఊళ్లలో ఉన్నవాళ్లకు ఇన్ని సదుపాయాలు ఉండకపోవచ్చు. అలాంటి చిన్నారులకు ఓ వారం, పదిరోజులపాటు తమ దగ్గరే ఉంచుకుని శిక్షణ ఇచ్చే సంస్థలూ ఉంటాయి. వాటిల్లో చేరొచ్చు. లేదా ఇంటిదగ్గరే వంటా, కథలు చెప్పడం, వినడం, క్యారమ్స్‌, ఈత, వృథాతో పనికొచ్చే వస్తువులు.. ఇలా ఎన్నో తయారుచేయొచ్చు. నెట్‌ అందరికీ అందుబాటులో ఉంటుంది కాబట్టి.. దాని సాయంతోనూ ఎన్నో నేర్చుకోవచ్చు.
ఏ వ్యాపకాలు ఎలా మేలుచేస్తాయంటే...
ఈత: శరీరాన్ని సౌకర్యంగా వంచేస్తుంది. ఈత కొట్టే చిన్నారులు లెక్కలు బాగా చేస్తారని అధ్యయనాలు నిరూపించాయి.
వంట: సరదాగా వంట నేర్చుకోవడం వల్ల ఎదుటివాళ్లు చెప్పేది వినడం, లెక్కలు, కొలతలు తెలుసుకోగలుగుతారు. మోటార్‌ స్కిల్క్‌ వస్తాయి. కంటికీ, చేతికీ మధ్య సమన్వయం (హ్యాండ్‌ - ఐ కోఆర్డినేషన్‌) కుదురుతుంది. ఇది లెక్కలూ, సైన్స్‌కి బాగా ఉపయోగపడుతుందట.
డ్యాన్స్‌: పాటకు తగినట్లుగా శరీరాన్ని కదల్చడం వల్ల వాళ్ల శరీరంపై వాళ్లకో అవగాహన వస్తుంది. ఇది వాళ్లలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది.
జిమ్నాస్టిక్స్‌: ఇందులో కేవలం శరీరం మాత్రమే కాదు, మనసునూ నిమగ్నం చేయాలి. చెప్పాలంటే కుడి, ఎడమల మెదడుకు కూడా పని చెప్పాలి. మెదడూ చురుగ్గా పనిచేస్తుంది.
సంగీతం: అధ్యయనాల ప్రకారం... సంగీతం నేర్చుకునే పిల్లల్లో ఏకాగ్రత బాగా ఉంటుందనీ, చదువుల్లో మంచి మార్కులు తెచ్చుకుంటారనీ అంటారు.
స్టోరీ టెల్లింగ్‌: సరైన కథలు ఎంచుకోవడం వల్ల పిల్లల్లో విలువలు పెరుగుతాయి. అందులో సహనం, నిస్వార్థం, సహానుభూతీ, జాలీ, మానవత్వం.. ఇలా ఎన్నో విలువలు నేర్చుకుంటారు. మంచి శ్రోతలవుతారు. బాగా మాట్లాడటమూ వస్తుంది. భాషా నైపుణ్యాలు సొంతం అవుతాయి. ఊహాశక్తీ, సృజనాత్మకత కూడా పెరుగుతాయి.
సుడోకు: ఇది లాజిక్‌, ఆలోచనా విధానాన్ని పెంచడం, సందర్భాన్ని బట్టి వేగంగా నిర్ణయాలు తీసుకోవడం అలవాటు చేస్తుంది.
క్యారమ్స్‌: ఏకాగ్రతా, మానసిక సామర్థ్యాన్ని పెంచుతుంది. కుటుంబం మొత్తం సరదాగా కలిసి కూడా ఆడుకోవచ్చు.