A PHP Error was encountered

Severity: Notice

Message: Trying to get property of non-object

Filename: controllers/Home.php

Line Number: 32

Backtrace:

File: /home/aadab/public_html/application/controllers/Home.php
Line: 32
Function: _error_handler

File: /home/aadab/public_html/index.php
Line: 100
Function: require_once

మీ కోసం ఎయిర్‌కండిషన్డ్‌ హెల్మెట్‌!

మీ కోసం ఎయిర్‌కండిషన్డ్‌ హెల్మెట్‌!

Updated:11/03/2018 04:27 AM

air conditional helmet for all

మన తెలుగు రాష్ట్రాల్లో వందలాది ఇంజినీరింగ్‌ కాలేజీలున్నాయి. వేలాదిమంది విద్యార్థులు ఏటా ఏదో ఒక ప్రాజెక్టు చేస్తుంటారు.‘ఆ.. ఏముంది! మార్కుల కోసం పాతవాటినే చిన్నమార్పులతో మళ్లీ చేస్తారు!’ అన్నది వీటిపై చాలామందికున్న అభిప్రాయం. కౌస్తుభ్‌ కౌండిన్య, ఆనంద్‌, శ్రీకాంత్‌.. ఈ ముగ్గురూ కాలేజీలో ‘ఎయిర్‌కండిషన్డ్‌ హెల్మెట్‌’ ప్రాజెక్టు చేస్తున్నప్పుడు కూడా కొందరిలాగే అన్నారు. ఆ మాటల్ని వీళ్లు తలకెక్కించుకుని ఉంటే ఇప్పుడు మన తలలకి ఈ ‘చల్లటి కవచం’ దొరికేది కాదు. మన ఇంజినీరింగ్‌ విద్యార్థుల్లో ఉత్సాహం నింపగల టానిక్‌లాంటి ఈ స్టార్టప్‌ కథ దక్కేది కాదు!

‘జర్ష్‌ ఇన్నోవేషన్స్‌’ అన్నది ఈ స్టార్టప్‌ పేరు. మనదేశంలో అధిక ఉష్ణోగ్రతల మధ్య పనిచేసే కార్మికులే లక్ష్యంగా వీళ్లు తయారుచేసిన ఏసీ హెల్మెట్‌ పేరే జర్ష్‌. ‘జస్ట్‌ ఎ రాదర్‌ సేఫ్‌ హెల్మెట్‌’ అనే ఆంగ్లవాక్యానికి సంక్షిప్త రూపం ఇది. ఇంతకీ ఈ హెల్మెట్‌ ఆలోచనతో కౌస్తుభ్‌, ఆనంద్‌, శ్రీకాంత్‌ ఏం సాధించారంటారా... ఆ మధ్య హైదరాబాద్‌లో ప్రపంచ పారిశ్రామిక సదస్సు(జీఈఎస్‌) జరిగింది కదా. అందులో కొత్త ఆవిష్కరణలపై జరిగిన ‘గెట్‌ ఇన్‌ ది రింగ్‌’ పోటీల్లో భారత్‌ నుంచి అగ్రస్థానంలో నిలిచిందీ ఆవిష్కరణ. గత రెండేళ్లకాలంలో దేశవ్యాప్తంగా ఇలాంటి ఎనిమిది పోటీల్లో పాల్గొని నంబర్‌వన్‌గా నిలిచింది ఈ మిత్రబృందం. ‘విద్యార్థిగా గెలవడంలో ఏముంది?! చిన్నపిల్లలు కాబట్టి అందరూ బాగుందనే భుజం తడతారు. అసలు ఉత్పత్తులు తయారుచేసి ‘ఓకే’ అనిపించుకుంటే కదా తెలిసేది!’ అనుకుంటున్నారా.. కేవలం ‘ఓకే’ అని కాదు ‘శభాష్‌’ అని కూడా అనిపించుకుంటున్నారు. ఈ హెల్మెట్‌ని ఇప్పటికే భారత నావికాదళం ఉపయోగిస్తోంది. విశాఖపట్నంలోని తమ ‘షిప్‌ బిల్డింగ్‌ సెంటర్‌’ కార్మికుల కోసం వీటిని వాడుతోంది. టాటా మోటార్స్‌-లఖ్‌నవూ విభాగం, కోయంబత్తూరులోని జేఎం మోటార్స్‌ సంస్థలూ వీటిని తీసుకున్నాయి. త్వరలోనే ఈ హెల్మెట్‌లు హైదరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులతోపాటూ మెట్రో నిర్మాణ కార్మికుల తలలకీ చల్లదనాన్ని ఇవ్వబోతున్నాయి.

ఇలా మొదలైంది..

‘హైదరాబాద్‌లో మేం చదువుకున్న వీఎన్‌ఆర్‌ విజ్ఞానజ్యోతి ఇంజినీరింగ్‌ కాలేజీ మెకానికల్‌ విభాగంలోనే మా ‘ఏసీ హెల్మెట్‌’కి బీజం పడింది. చదువుల్లో భాగంగా మేం ఫీల్డ్‌ విజిట్‌ కోసం ఎన్నో ఫ్యాక్టరీలకి వెళ్లాల్సి వచ్చింది. తీవ్రమైన ఎండలో వేడివాతావరణంలో పనిచేసే కార్మికుల ఇబ్బందుల్ని అప్పుడే చూశాం. ఆ ఇబ్బందులు లేకుంటే వాళ్ల ఉత్పాదకత మరింత పెరిగే ఆస్కారముందనిపించింది. దానికి మేం కనిపెట్టిన పరిష్కారమే ఈ ఏసీ హెల్మెట్‌ ఆలోచన’ అని చెబుతాడు ఆనంద్‌. 2016లో ముగ్గురూ కాలేజీ నుంచి బయటకొచ్చారు. ఆ ఏడాది సెప్టెంబర్‌ నుంచీ హెల్మెట్‌ నమూనా తయారుచేసే పనుల్లో పడ్డారు. ‘మా ముందు నిలిచిన తొలి సవాలు.. హెల్మెట్‌లో పట్టేంత అతిచిన్న ఏసీని తయారుచేయడమే. ఆ ఒక్క అంశం కోసమే ఏడాదిపాటు శ్రమించాం. అది తయారయ్యాక కొన్ని ఫ్యాక్టరీలకెళ్లి కార్మికులకిస్తే బరువు ఎక్కువుందన్నారు. దాన్ని అతికష్టంమీద 650 గ్రాములకి తీసుకురాగలిగాం. ఆ అంశమే ఈ హెల్మెట్‌ని కంపెనీలు కొన్ని అక్కున చేర్చుకునేలా చేసింది..’ అని వివరిస్తాడు కౌస్తుభ్‌.

అదే ఆర్థికసాయం తెప్పించింది..

నమూనా (ప్రొటో టైప్‌) సరే.. మరి వాటిని ఎక్కువ సంఖ్యలో తయారుచేయాలంటే డబ్బు కావాలి కదా! వీళ్లు చదువుతున్న కాలేజీని నడిపే ట్రస్టు ఐదు లక్షల రూపాయలిచ్చింది. కేంద్ర చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ ‘మంచి భవిష్యత్తున్న 74 స్టార్టప్‌’లలో ఒకటిగా జర్ష్‌ ఇన్నోవేషన్స్‌ని గుర్తించి పదిహేనులక్షల రూపాయలిచ్చింది. ఆ డబ్బుతో కొన్ని హెల్మెట్‌లని తయారుచేసి విశాఖపట్నంలో జరిగిన ‘ఇంటర్నేషనల్‌ ఇన్నోవేషన్‌ ఫెయిర్‌’లో పెట్టారు. ఆ ప్రదర్శనలో వీటిని చూశాకే భారత నావికాదళం, ఇతర కంపెనీలూ వీటిని కొనుగోలు చేశాయి. జీఈఎస్‌ తర్వాత ప్రస్తుతం దేశంలోని వివిధ కంపెనీల నుంచి వేలాది హెల్మెట్‌ల ఉత్పత్తికి ఆర్డర్‌లూ తెచ్చుకున్నారు. ‘వచ్చే మే నుంచి టూవీలర్‌ డ్రైవర్‌ల కోసం కూడా వీటి తయారీని మొదలుపెడతాం!’ అని చెబుతున్నాడు కౌండిన్య.

ఇంకెక్కడా లేవా?

ఇప్పటిదాకా ఇలాంటి హెల్మెట్‌లు ఇంకెక్కడా లేవా అంటే.. అమెరికాలో ఉన్నాయి. వాటిని ఇక్కడికి తెప్పించి 14 వేల రూపాయలకంటే ఎక్కువ ధరకి కొన్ని ఆన్‌లైన్‌ సంస్థలు విక్రయిస్తున్నాయి. కాకపోతే అవన్నీ మన వాతావరణాన్నీ, ఇక్కడి రోడ్ల ఎగుడుదిగుళ్లనీ దృష్టిలో ఉంచుకుని ఉత్పత్తి చేసినవి కావు. కౌస్తుభ్‌ బృందం పూర్తిగా ఇక్కడి వాతావరణానికి అనుగుణంగా, అదీ స్థానికంగా దొరికే పరికరాలతో వీటిని తయారుచేశారు. అందుకే ఐదున్నర వేలకే వీటిని అందిస్తామంటున్నారు!