ఎయిర్ అంబులెన్స్..

Updated:27/05/2018 04:01 AM

air ambulance

దేశంలోనే మొట్టమొదటి సారిగా వింగ్స్ ఏవియేషన్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఎయిర్ అంబులెన్స్ హెలికాప్టర్ ఎమర్జెన్సీ మెడికల్ సర్వీసెస్(హెచ్‌ఈఎంఎస్)ను ప్రవేశ పెట్టారు. నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో హెలికాప్టర్ ద్వారా అత్యవసర సేవలను ఎలా అందిస్తామని ప్రదర్శన నిర్వహించి వివరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో సంస్థ ఎండీ వై ప్రభాకర్‌రెడ్డి, కెప్టెన్ పట్టాభిరామన్‌తో కలిసి హెచ్‌ఈఎంఎస్ ద్వారా అందించే సేవల వివరాలను వెల్లడించారు.

సంస్థను 1995లో ఏర్పాటు చేశామని, తమ సంస్థకు 12 ఎయిర్ క్రాఫ్ట్‌లు ఉండగా ఎన్‌ఎస్‌వోపీ లైసెన్స్ కలిగి ఉందన్నారు. రోడ్డు ప్రమాదం, ఇతరత్రా ప్రమాదాల్లో తీవ్రంగా గాయాల పాలైన వారికి సత్వర వైద్య సేవలు అందిస్తే వారి ప్రాణాలను కాపాడే అవకాశముంటుందన్నారు. ఇలాంటి వారికి ఎయిర్ ఎయిడ్ పేరిట సేవలందించేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. దేశంలోనే మొట్ట మొదటి సారిగా ఎయిర్ ఎయిడ్‌ను తమ సంస్థ ద్వారా ప్రారంభించినట్లు చెప్పారు. ఈ ఎయిర్ ఎయిడ్ ద్వారా సేవలందించేందుకు ఆగస్టా వెస్ట్‌ల్యాండ్ 109సి హెలికాప్టర్‌ను తెప్పించినట్లు, ఇది వీటీ-ఐసీయూగా ప్రాచుర్యం పొందిందన్నారు. అత్యవసర సమయంలో క్షతగాత్రుల, అత్యవసర వైద్య సేవలు అవసరమైన వారికి వైద్య సేవలను అందించేందుకు హెలికాప్టర్‌లో మెడికల్ కిట్, వెంటిలేటర్, డిఫిబిలేటర్, మల్టీ పారామీటర్ వంటివి అందుబాటులో ఉంచామన్నారు.

డీజీసీఏ సర్టిఫికెట్ పొందడం వల్ల అత్యవసర సేవలు అవసరమైన వారికి క్యాజువాల్టీ లేదా, సమీపంలో అనుకూలంగా ఉన్న ప్రాంతంలో ల్యాండింగ్ చేసుకునే అవకాశం ఉంటుందన్నారు. వీటీ-ఐసీయూలో ఒకసారి ఇంధనం నింపితే 450 కిలోమీటర్లు ప్రయాణించవచ్చని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాలతో పాటు మహారాష్ట్ర, కర్నాటక, చత్తీస్‌గడ్, ఒడిస్సా రాష్ర్టాల వరకు బేగంపేట్‌లోని వింగ్స్ ఏవియేషన్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా ఎయిర్ ఎయిడ్ సేవలు అందిస్తామన్నారు.

 

బేగంపేట్ ఎయిర్ పోర్ట్ నుంచి..


బేగంపేట్ ఎయిర్‌పోర్ట్ నుంచి ఈ హెలికాప్టర్ సేవలు 24 గంటల పాటు అందుబాటులో ఉంటాయని వింగ్స్ ఏవియేషన్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ వై ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. రిస్క్ ఆపరేషన్లు, ప్రకృతి బీభత్సాలు, రహదారి ప్రమాదాలు, భారీ అగ్ని ప్రమాదాలు చోటు చేసుకున్న ఏరియాల నుంచి బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు కూడా ఎయిర్ ఎయిడ్ ఉపయోగపడుతుందన్నారు. అనుభవజ్ఞులైన పైలట్‌లు, ఏరో మెడికల్ ట్రాన్స్‌పోర్టేషన్ సర్టిఫైడ్ వైద్యులు, సిబ్బంది ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారన్నారు.