అగ్నివీరులకు ఎలాంటి డోకా ఉండదు..

అగ్నివీరులకు ఎలాంటి డోకా ఉండదు..

- ఆందోళన అవసరం లేదన్న జాతీయ భద్రతా సలహాదారు అజిత్.. 
- అగ్నిపథ్ కు వ్యతిరేకంగా నిరసనలు జరగడం శోచనీయం.. 
- విద్వాంసాన్ని ఉపేక్షించేది లేదు : అజిత్ దోవల్ హెచ్చరిక..  
- మంగళవారం అగ్నిపథ్ స్కీం పై రాజ్ నాథ్ నివాసంలో కీలక భేటీ.. 

న్యూఢిల్లీ, 21 జూన్ ( ఆదాబ్ హైదరాబాద్ )  : 

అగ్నిప‌థ్ రిక్రూట్‌మెంట్ పథకంపై నిర‌స‌న‌లు మిన్నంటిన నేప‌థ్యంలో అగ్నివీరుల భ‌విష్యత్‌కు ఢోకా ఉండ‌ద‌ని, ఆందోళ‌న అవ‌స‌రం లేద‌ని జాతీయ భ‌ద్రతా స‌ల‌హాదారు అజిత్ దోవ‌ల్ భ‌రోసా ఇచ్చారు. రెగ్యుల‌ర్ స‌ర్వీసులోకి తీసుకునే అగ్నివీరుల‌కు క‌ఠోర శిక్షణ ఉంటుందని, నిర్ధిష్ట కాలంలో మెరుగైన అనుభ‌వం సాధిస్తార‌ని చెప్పారు. అగ్నివీరుల భ‌విష్యత్ పూర్తిగా భ‌ద్రమేన‌ని హామీ ఇచ్చారు. అగ్నిప‌థ్ స్కీంను స‌మ‌ర్ధించిన అజిత్ దోవ‌ల్ యువ‌, సుశిక్షిత సేన‌లు సైన్యానికి అవ‌స‌ర‌మ‌ని అన్నారు. అగ్నిపథ్‌ను వ్యతిరేకిస్తూ జ‌రుగుతున్న నిర‌స‌న‌ల‌పై అజిత్ దోవ‌ల్ ఆందోళ‌న వ్యక్తం చేశారు.

విధ్వంసం, హింసాకాండ‌ను ఎట్టి ప‌రిస్ధితుల్లోనూ ఉపేక్షించేది లేద‌ని అజిత్ దోవల్ హెచ్చరించారు. అగ్నిప‌థ్ నిర‌స‌న‌ల వెనుక కొంతమంది స్వార్ధ ప్రయోజనాలు దాగున్నాయ‌ని, స‌మాజంలో చిచ్చు పెట్టాల‌నే ఉద్దేశంతోనే అగ్నిప‌థ్‌ను వ్యతిరేకిస్తున్నార‌ని ఆరోపించారు. హింసాకాండ‌ను ఎవ‌రూ స‌మ‌ర్ధించుకోలేర‌ని అన్నారు. అగ్నిప‌థ్ నిర‌స‌న‌ల‌పై స్పందిస్తూ హింసాత్మక నిర‌స‌న‌ల విష‌యంలో నిందితుల‌ను గుర్తించార‌ని, దీనిపై పూర్తి స్థాయిలో విచార‌ణ జ‌రుగుతుంద‌ని చెప్పారు. అగ్నిపథ్ పై వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని అజిత్ దోవల్ స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ జాతీయ ప్రయోజనాల కోసం రిస్క్ తీసుకున్నారని చెప్పారు. ఈ పథకం భారతదేశం భవిష్యత్తుకు భద్రంగా ఉంటుందన్నారు. 

కాగా అగ్నిపథ్ స్కీంపై రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ నివాసంలో కీలక భేటీ జరిగింది.. కొత్త రిక్రూట్ మెంట్  స్కీంపై ఇప్పటికే పలు దఫాలుగా రక్షణమంత్రి చర్చలు జరిపారు. ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ చీఫ్ లతో భేటీ అయిన రాజ్ నాథ్ మంగళవారం మరోసారి సమావేశమయ్యారు. అగ్నిపథ్ స్కీంపై నిరసనలు చల్లార్చేందుకు ఇప్పటికే కేంద్ర హోం శాఖ .. ఫస్ట్ బ్యాచ్ కు చాలా సడలింపులు ప్రకటించింది. ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చింది.  ఆందోళనల్లో పాల్గొనవద్దని, హింసాత్మక ఘటనల్లో పాల్గొంటే పోలీస్ క్లియరెన్స్ రాదని నిన్నటికి నిన్న ఎయిర్ ఫోర్స్ చీఫ్ చౌదరి అలర్ట్ చేశారు.

Tags :