పక్కా ప్లానే..!

- అగ్నిపథ్ మంచి స్కీం..
- కేంద్రాన్ని బదనాం చేసేందుకు కుట్ర
- సర్కార్ సహకారంతోనే విధ్వంసం
- కేసీఆర్ కార్యాలయం నుండే ప్లాన్
- శవాలతో టీఆర్ఎస్ రాజకీయం
- బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు..
హైదరాబాద్, 19 జూన్ ( ఆదాబ్ హైదరాబాద్ ) :
కేంద్రం తెచ్చిన ‘అగ్నిపథ్’ మంచి స్కీమ్ అని బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ అన్నారు. అది నచ్చకున్నా నిరసన చెప్పే పద్ధతి ఇది మాత్రం కాదన్నారు. ఆర్మీలో పనిచేయాలని సేవ చేయాలని అనుకున్న వాళ్లకు ఇది మంచి అవకాశమన్నారు. 40 వేల మంది యువకులను రిక్రూట్ మెంట్ చేయాలని కేంద్రం నిర్ణయం తీసుకుందని గుర్తు చేశారు. రిక్రూట్మెంట్లో 10 శాతం రిజర్వేషన్ ఉంటుందని చెప్పారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ విధ్వంసం పక్కా పథకం ప్రకారం జరిగిందేనంటూ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కార్యాలయం నుండే విధ్వంస కుట్ర జరిగిందని ఆరోపించారు. ఈ విధ్వంసం వెనుక సీఎం స్ట్రాటజిస్టు పథక రచన ఉందన్నారు. కేంద్రాన్ని బదనాం చేసే లక్ష్యంతోనే విధ్వంసం జరిగిందని ఆరోపించారు. శాంతి భద్రతలు కాపాడాల్సింది రాష్ట్ర పోలీసులు. కాల్పులు జరిపింది రాష్ట్ర పోలీసులే. కేంద్ర బలగాలు కాల్పులు జరపలేదు. కాని, రాష్ట్ర పోలీసుల కాల్పుల్లో మృతి చెందిన యువకుడు రాకేశ్ అంతిమ యాత్ర పేరుతో టీఆర్ఎస్ నేతలు కేంద్ర సంస్థలపై దాడులు చేసి విధ్వంసం చేస్తుండటం సిగ్గుచేటన్నారు సంజయ్.
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లోకి పెట్రోల్ తీసుకు వచ్చింది ఎవరు? విధ్వంసం చేసింది ఎవరనేది దర్యాప్తు జరగాలని సంజయ్ డిమాండ్ చేశారు. సికింద్రాబాద్ దమనకాండలో అమాయకులు గాయపడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు పోలీసుల కాల్పుల్లో మృతి చెందిన రాకేశ్ అంతిమ యాత్ర పేరుతో ఈరోజు వరంగల్ జిల్లాలో టీఆర్ఎస్ నేతలు విధ్వంసం సృష్టించి కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలపై దాడులు చేయడం దుర్మార్గమన్నారు. ఇకనైనా అగ్నిపథ్ గురించి ఆర్మీ అభ్యర్థులతోపాటు ప్రజలంతా వాస్తవాలు గమనించి కుట్రలను చేధించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాలివ్వకపోవడంల్లే ఆత్మహత్య చేసుకుంటున్నానని వీడియో తీసి సునీల్ నాయక్ చనిపోయారని,.. అలాగే ఆర్టీసీ కార్మికులు, రైతులు, 317 జీవో వల్ల ఉద్యోగులు, ఇంటర్మీడియట్ విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటే కనీసం వాళ్ల అంతిమ యాత్ర కూడా చేయనియ్యని దుర్మార్గుడు సీఎం కేసీఆర్ అని బండి ఫైరయ్యారు.
ఇంటెలిజెన్స్ అధికారులకు సమాచారం వచ్చినా పట్టించుకోలేదని సంజయ్ మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం సహకారంతోనే సంఘ విద్రోహ శక్తుల కుట్ర జరిగిందని ఆరోపించారు. రాష్ట్ర పోలీసులు కాల్పులు జరపడం వల్లనే యువకుడు చనిపోయాడా? మధ్యాన్నం నుంచి సాయంత్రం వరకూ యువకులతో మాట్లాడే ప్రయత్నం చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దాదాపు ముప్పై కోట్ల ఆస్తులు నష్టం చేసేలా దాడి చేసిన వాళ్ళు పారిపోయారని.. అమాయకులు అక్కడే ఉన్నారని అన్నారు. సాయంత్రం 6 గంటలకు పది నిమిషాల్లో క్లియర్ చేశారన్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని బద్నాం చేసిన తర్వాతనే క్లియర్ చేశారని బండి సంజయ్ ఆరోపించారు.
బీహార్, ఉత్తరప్రదేశ్లో కూడా కేసీఆర్ లాంటోళ్లే దాడులు చేస్తున్నరని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కేంద్రంపై ఎట్ల బురద చల్లాలనే కుట్రతో స్ట్రాటజిస్టులు ఇట్లాంటి విధ్వంసానికి పథక రచన చేస్తుండటం సిగ్గుచేటంటూ వ్యాఖ్యానించారు. ఆర్మీ అభ్యర్థులు, యువకులు, ప్రజలంతా టీఆర్ఎస్ కుట్రలను గమనించడంతోపాటు అలాంటి వాళ్ల సంగతి చూడాలని ఆయన కోరారు.