24 రోజులు.. 5 జిల్లాలు.. 12 నియోజకవర్గాలు.. 328 కి.మీ. లు

24 రోజులు.. 5 జిల్లాలు.. 12 నియోజకవర్గాలు.. 328 కి.మీ. లు


( మరికొద్ది గంటల్లో బండి 3వ విడత ‘ప్రజా సంగ్రామ యాత్ర’.. )

- ప్రారంభసభకు ముఖ్య అతిథిగా కేంద్ర జల్ శక్తి మంత్రి గజేంద్ర షెకావత్.. 
- నేటి ఉదయం 7 గంటలకు పార్టీ రాష్ట్ర కార్యాలయం నుండి యాదాద్రికి.. 
- బహిరంగ సభ అనంతరం జెండా ఊపి పాదయాత్ర ఆరంభించనున్న షెకావత్.. 
- భారీగా స్వాగతం పలికేందుకు సిద్ధమైన పార్టీ శ్రేణులు.. 
- 10 గంటలకు యాదాద్రి  శ్రీ లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు.. 
- 11 గంటలకు బహిరంగ సభ.. నేడు  10.5 కి.మీలు నడవనున్న బండి.. 
- బస్వాపూర్ సమీపంలో తొలిరోజు రాత్రి బస.. 
- సగటున 2 రోజులకో అసెంబ్లీ నియోజకవర్గంలో పాదయాత్ర.. 
- యాదాద్రి నుండి భద్రకాళి వరకు 3వ విడత ప్రజా సంగ్రామ యాత్ర.. 
- చారిత్రక, తెలంగాణ సాయుధ, ఉద్యమ పోరాటాల నేపథ్య ప్రాంతాల మీదుగా.. 
హైదరాబాద్, 01 ఆగష్టు ( ఆదాబ్ హైదరాబాద్ ) :
జనం గోస వినడం...భరోసా ఇవ్వడం...రాబోయేది బీజేపీ సర్కారేననే సంకేతాలు పంపడమే 3 విడత ప్రజాసంగ్రామ యాత్ర లక్ష్యంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, బండి సంజయ్ 3వ విడత ప్రజా సంగ్రామ యాత్ర మరికొద్ది గంటల్లో ప్రారంభం కానుంది. పాదయాత్రకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. తమ ఇలవేల్పు యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహాస్వామి పాదాల చెంత నుండి బండి సజయ్ పాదయాత్రను ఆరంభించనున్నారు.  అందులో భాగంగా నేటి ఉదయం 7 గంటలకు పార్టీ రాష్ట్ర కార్యాలయం నుండి కార్యకర్తలతో కలిసి నేరుగా యాదాద్రికి వెళతారు. ఉదయం 10 గంటలకు యాదాద్రికి చేరుకుని శ్రీ లక్ష్మీ నరసింహస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం 11 గంటలకు బహిరంగ సభా స్థలికి చేరుకుంటారు. మధ్యాహ్నం 2 గంటల వరకు సభలో పాల్గొంటారు. మరోవైపు పాదయాత్ర ప్రారంభ సభకు కేంద్ర జల్ శక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ హాజరుకానున్నారు. బహిరంగ సభ అనంతరం షెకావత్ పార్టీ జెండా ఊపి పాదయాత్ర ప్రారంభించనున్నారు. తొలిరోజు బండి  సంజయ్ 10.5 కి.మీలు పాదయాత్ర చేయనున్నారు. బసవాపూర్ శివారులో తొలిరోజు రాత్రి బస చేయనున్నారు.

కాగా 3వ పాదయాత్ర మొత్తం 24 రోజులపాటు కొనసాగనుంది. యాదాద్రి భువనగిరి, నల్గొండ, జనగాం, వరంగల్, హన్మకొండ జిల్లాల మీదుగా 12 అసెంబ్లీ నియోజకవర్గాలు, 25 మండలాల్లో కొనసాగనుంది. 3వ విడత పాదయాత్రలో భాగంగా బండి సంజయ్ మొత్తం 328 కిలోమీటర్లు నడుస్తారు. ఇక అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా చూస్తే.. ఆలేరు, భువనగిరి, మునుగోడు, నకిరేకల్, తుంగతుర్తి, పాలకుర్తి, స్టేషన్ ఘన్ పూర్, జనగాం, వర్దన్నపేట, పరకాల, వరంగల్ ఈస్ట్, వరంగల్ వెస్ట్ నియోజకవర్గాల్లో పాదయాత్ర కొనసాగనుంది. 

ఈసారి 3వ విడత పాదయాత్ర అనేక చారిత్రాక ప్రదేశాల గూండా కొనసాగనుంది. చేనేత ప్రసిద్దిగాంచిన పోచంపల్లి, రజకార్ల అరాచకాలకు మూకుమ్మడిగా బలైన గుండ్రాంపల్లి, చాకలి ఐలమ్మ పోరు సాగించిన విసునూరు, సర్వాయి పాపన్న పాలనా రాజధాని కిలాషపూర్, తెలంగాణ సాయుధ పోరాట చైతన్య వేదిక కొత్తపేట తోపాటు ఐనవోలు మల్లన్న ఆలయా ప్రదేశాల మీదుగా బండి సంజయ్ పాదయాత్ర కొనసాగనుంది. ఈసారి అనేక గిరిజన తండాలు, బడుగు బలహీనవర్గాల ప్రభావం ఉన్న ప్రాంతాల మీదుగా పాదయాత్ర కొనసాగనుంది. గత రెండు పాదయాత్రలు విజయవంతంగా కొనసాగిన నేపథ్యంలో మూడో విడత పాదయాత్రను సైతం దిగ్విజయవంతం చేసే దిశగా పార్టీ శ్రేణులు పూర్తి స్థాయిలో నిమగ్నమయ్యాయి. జనం పడుతున్న బాధలను స్వయంగా తెలుసుకోవడం... వారికి భరోసా నింపడం... కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను గడపగడపకు తీసుకెళ్లడంతోపాటు రాబోయేది బీజేపీ ప్రభుత్వమేననే విశ్వాసాన్ని ఈ 3వ విడత పాదయాత్ర ద్వారా బండి సంజయ్ ఆధ్వర్యంలోని  పార్టీ రాష్ట్ర నాయకత్వం  ప్రజల్లో నింపనుంది. మరోవైపు మొదటి, రెండో విడత పాదయాత్రల్లో భాగంగా బండి సంజయ్ 67 రోజులు పాదయాత్ర చేసి 828 కిలోమీటర్లు నడిచారు. రెండు విడతల పాదయాత్రల్లో భాగంగా 13 జిల్లాల్లోని 9 ఎంపీ, 28 అసెంబ్లీ నియోజకవర్గాల్లో నడవడంతోపాటు 66 సభలు నిర్వహించారు.

Tags :