దివిస్ చైర్మన్ గారూ మా ఊరు ఏం పాపం చేసింది..?

దివిస్ చైర్మన్ గారూ మా ఊరు ఏం పాపం చేసింది..?


- అంకిరెడ్డి గూడెం గ్రామానికి పది కోట్ల పన్ను ఎగవేతకు కుట్ర.. 
- మా గ్రామ రెవెన్యూ భూములను మున్సిపాలిటీకి ధారాదత్తం చేశారు.. 
- అధికారులు, దివిస్ చైర్మన్ కలిసి కుట్ర.. 
- మేము ఏం పాపం చేశామని మాకు ద్రోహం చేస్తున్నారు.. 
  నమ్మిన ప్రజలను నట్టేటముంచడమేనా మీ పని.. 
- తొలగించిన రెవెన్యూ నెంబర్లను తిరిగి చేర్చండి.. 
- జిల్లా కలెక్టర్ కు, గ్రామ సర్పంచ్ ఫిర్యాదు.. 

హైదరాబాద్, 03 అక్టోబర్ ( ఆదాబ్ హైదరాబాద్ ) : 
యాదాద్రి భువనగిరి జిల్లా, చౌటుప్పల్ మండల పరిథిలోని, లింగోజిగూడెం గ్రామ రెవెన్యూ పరిథిలో 1990లో దివిస్ ల్యాబరేటరీస్ పరిశ్రమ స్థాపించారు.. ఆ సమయంలో లింగోజిగూడెం  గ్రామ పంచాయితీ క్రింద హామ్లెట్ గ్రామముగా అంకిరెడ్డిగూడెం గ్రామం ఉండేది.. దివిస్ ల్యాబ్స్ చైర్మన్ లింగోజిగూడెం, అంకిరెడ్డిగూడెం గ్రామాలకు చెందిన  రైతుల నుండి భూములను కొనుగోలు చేశారు.. అదే సమయంలో ప్రజా ప్రతినిధులుగా ఉన్నవారు  దివిస్ పరిశ్రమలో కాంట్రాక్టు పనులు చేస్తూ ఆర్ధిక లావాదేవీలు కొనసాగించేవారు..  

27 ఏళ్ల క్రితమే దివిస్ చైర్మన్ కుట్ర :
దివిస్ ల్యాబ్స్ చైర్మన్ పరిశ్రమలో ఉత్పత్తులు ప్రారంభించడానికి ముందే.. కొంతమంది అధికారులతో, ప్రజా ప్రతినిధులతో కలిసి కుట్రకు పాల్పడి లింగోజిగూడెం, అంకిరెడ్డిగూడెం  గ్రామ ప్రజలకు సమాచారం లేకుండా లింగోజిగూడెం సర్వే నెంబర్లు అంకిరెడ్డిగూడెం సర్వే నెంబర్ల క్రింద మార్చినారు.. రెండు గ్రామాల ప్రజలు 7 సంవత్సరాలు పరస్పర అంగీకారంతో.. లింగోజిగూడెం, అంకిరెడ్డిగూడెం గ్రామాలకు చెందిన పెద్దలు, ఇరు పక్షాల అంగీకారంతో, ఒప్పొందంతో ఎల్.ఆర్.నెంబర్ : ఎ /157/2002 తేదీ : 31-08-2002 నాడు ప్రభుత్వం ఉత్తర్వుల్లో 2300 ఎకరాలు అంకిరెడ్డిగూడెం గ్రామానికి కేటాయించారు.. అందులో భాగంగా లింగోజిగూడెం, అంకిరెడ్డిగూడెం గ్రామాల పరిథిలో ఉన్న దివిస్ ల్యాబ్స్ ద్వారా వచ్చే పన్నులు సమానంగా వచ్చే విధంగా అంగీకరించుకున్నారు. 

2018 లో రెండవసారి దివిస్ చైర్మన్ కుట్ర :
2018 లో నూతనంగా ఏర్పాటైన మున్సిపాలిటీలలో లింగోజిగూడెం గ్రామాన్ని చౌటుప్పల్ మున్సిపాలిటీలో విలీనం చేశారు.. అదే సమయంలో లింగోజిగూడెం, అంకిరెడ్డిగూడెం  గ్రామ పంచాయితీ కార్యదర్శిగా పనిచేసిన వేణుగోపాల్ రెడ్డి ప్రధాన సూత్రధారిగా దివిస్ చైర్మన్ తో కుమ్మక్కై 2016 లో ప్రారంభించిన భారీ నిర్మాణాలు చేపట్టే భూమిని  అంకిరెడ్డిగూడెం గ్రామం నుంచి తొలగించడం జరిగింది.. దాని ద్వారా అంకిరెడ్డిగూడెం గ్రామం  సుమారు 10 కోట్ల రూపాయల నష్టపోవలసి వస్తుంది.. ఉద్దేశ్యపూర్వకంగా  దురుద్దేశ్యంతో చేసిన ఈ పని వలన అంకిరెడ్డిగూడెం కోట్లాదిరూపాయలు నష్టపోతున్నందున.. దివిస్ చైర్మన్, మండల పరిషత్ అధికారులు కలిసి చేస్తున్న ఈ కుట్రలను గమనించి తమకు న్యాయం చేయాలని కోరుతూ గ్రామస్తులు జిల్లా కలెక్టర్ తో బాటు.. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు.. 

జిల్లా కలెక్టర్ కి, ఉన్నతాధికారులకు అంకిరెడ్డిగూడెం గ్రామ సర్పంచ్ చేసిన ఫిర్యాదు వివరాలు :
అంకిరెడ్డి గూడెం గ్రామ పంచాయితీకి సంబంధించిన సర్వే నెంబర్లు 2018 గెజిట్ లో భాగంగా మా గ్రామ పంచాయితీకి సంబంధించిన సర్వే నెంబర్లు : 266, 268, 269, 270, 290.. విస్తీర్ణం 73 ఎకరాల 24 గుంటలను లింగోజిగూడెం రెవెన్యూ గ్రామంలో నమోదు చేశారు.. ఇట్టి సర్వే నెంబర్లను రద్దు చేసి, మా గ్రామ రెవెన్యూ నెంబర్లుగా నమోదు  చేసి, లింగోజిగూడెం రెవెన్యూ గ్రామం నుండి తొలగించి అంకిరెడ్డి గ్రామముగా ప్రకటించాలని కోరారు.. లింగోజిగూడెం రెవెన్యూ గ్రామంలో అంకిరెడ్డిగూడెం గ్రామ పంచాయితీ సర్వే నెంబర్లు విలీనం అయి ఉండటం వలన అంకిరెడ్డిగూడెం గ్రామ పంచాయిటీకి రావలసిన టి.డి. ట్యాక్స్ లింగోజిగూడెం గ్రామ పంచాయితీకి వెళ్లడం జరిగింది..  దివిస్ పరిశ్రమలో నూతనంగా చేపట్టిన నిర్మాణాలకు సంబంధించిన పన్నులు మా గ్రామానికి రాకపోవడంతో మా గ్రామానికి ఎంతో నష్టం జరుగుతోంది.. కనుక  తమరు ఈ విషయాలను పరిశీలించి.. మా యందు దయవుంచి మా గ్రామ ప్రజలకు న్యాయం చేయాలని అంకిరెడ్డిగూడెం గ్రామ సర్పంచ్ ముద్దం సుమిత్ర తమ ఫిర్యాదులో విజ్ఞప్తి చేశారు..

Tags :