నేడు భారత్‌, దక్షిణాఫ్రికా మూడో వన్డే..

నేడు భారత్‌, దక్షిణాఫ్రికా మూడో వన్డే..

న్యూ ఢిల్లీ, 11 అక్టోబర్ : 
ప్రధాన ఆటగాళ్లు అందుబాటులో లేకపోయినా.. అద్వితీయ ప్రదర్శన కనబరుస్తున్న టీమ్‌ ఇండియా.. దక్షిణాఫ్రికాపై వన్డే సిరీస్‌ సాధించేందుకు సమాయత్తమైంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇరు జట్లు చెరో విజయంతో సమ ఉజ్జీలుగా నిలువగా.. నేడు తుది ఫలితం తేలనుంది. మిడిలార్డర్‌ ఫుల్‌ ఫామ్‌లో ఉండటం ధవన్‌ సేనకు కలిసొచ్చే అంశం కాగా.. టీమ్‌ఇండియాను పేస్‌తో పడగొట్టాలని సఫారీలు స్కెచ్‌ వేస్తున్నారు.

న్యూఢిల్లీ: తొలి మ్యాచ్‌లో పెద్దగా ఆకట్టుకోలేకపోయినా.. రెండో వన్డేలో ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో సిరీస్‌ సమం చేసిన భారత జట్టు.. నిర్ణయాత్మ మూడో పోరుకు రెడీ అయింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా మంగళవారం భారత్‌, దక్షిణాఫ్రికా మధ్య ఆఖరి వన్డే జరుగనుంది. గత పోరులో శ్రేయస్‌ అయ్యర్‌, ఇషాన్‌ కిషన్‌ దంచి కొట్టడంతో టీమ్‌ఇండియా ఫుల్‌ జోష్‌లో ఉంటే.. సొంతగడ్డపై శిఖర్‌ ధవన్‌ సేనకు షాకివ్వాలని దక్షిణాఫ్రికా జట్టు తహతహలాడుతున్నది. తొలి వన్డేలో సఫారీల వెన్ను విరిచిన హైదరాబాదీ పేసర్‌ మహమ్మద్‌ సిరాజ్‌ అదే జోరు కొనసాగించాలని చూస్తున్నాడు. కెప్టెన్‌ శిఖర్‌ ధవన్‌తో పాటు మరో ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌ కూడా రాణిస్తే టీమ్‌ఇండియాకు తిరుగుండదు. మిడిలార్డర్‌లో సంజూ శాంసన్‌ తన విలువ చాటుకుంటుండగా.. శార్దూల్‌ ఠాకూర్‌, వాషింగ్టన్‌ సుందర్‌ రూపంలో ఇద్దరు ఆల్‌రౌండర్లు అందుబాటులో ఉన్నారు. గత మ్యాచ్‌తో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన షాబాజ్‌ అహ్మద్‌కు మరో అవకాశం దక్కుతుందా లేక.. మీడియం పేసర్‌ ముఖేశ్‌ తొలి వన్డే ఆడుతాడా చూడాలి. మరోవైపు కెప్టెన్‌ బవుమా అనారోగ్యం సఫారీలను ఇబ్బంది పెడుతున్నది. మార్క్మ్‌,్ర క్లాసెన్‌, మిల్లర్‌, డికాక్‌, హెండ్రిక్స్‌, మలన్‌తో సఫారీల బ్యాటింగ్‌ లైనప్‌ బలంగా కనిపిస్తున్నది.

ఢిల్లీలో గత కొన్ని రోజులుగా వర్షాలు దంచికొడుతుండటంతో మ్యాచ్‌ సజావుగా సాగుతుందా అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. అయితే మంగళవారం వర్షం కురిసే అవకాశా లు కాస్త తక్కువ ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇక్కడ గత మూడు వన్డేల్లో తొలుత బ్యాటింగ్‌ చేసిన జట్లే గెలుపొందాయి. పిచ్‌ పేసర్లకు సహకరించనుంది.

భారత్‌: ధవన్‌ (కెప్టెన్‌), గిల్‌, ఇషాన్‌, శ్రేయస్‌, శాంసన్‌, శార్దూల్‌, సుందర్‌, షాబాజ్‌/ముఖేశ్‌, కుల్దీప్‌, అవేశ్‌, సిరాజ్‌. దక్షిణాఫ్రికా: డికాక్‌, హెండ్రిక్స్‌, బవుమా/మలన్‌, మార్క్మ్‌,్ర క్లాసెన్‌, మిల్లర్‌, పార్నెల్‌, కేశవ్‌, నోర్జే, ఎంగ్డీ, రబడ. 

Tags :