అదుపులో మరో పది..

అదుపులో మరో పది..


- ఇప్పటికే 45 మంది అరెస్ట్.. 
- పదిమందిపై పలు సెక్షన్ల కేసులు.. 
- వీరిలో ఐదుగురు వాట్సాప్ గ్రూప్ అడ్మిన్స్.. 
- పృథ్వీరాజ్ కీలకమైన వ్యక్తిగా గుర్తింపు.. 
- మరికొంతమంది అరెస్ట్ అయ్యే అవకాశం.. 
- తమ కుమారుడు అమాయకుడంటున్న పృథ్వీ పేరెంట్స్..  

హైదరాబాద్, 22 జూన్ ( ఆదాబ్ హైదరాబాద్ ) :
అగ్నిపథ్ ఆందోళనల నేపథ్యంలో.. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌పై దాడి ఘటనలో పోలీసులు మరో పది మందిని అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఇప్పటికే 45 మందిని అరెస్ట్ చేయగా.. తాజా అరెస్టులతో మొత్తం 55 మందిని అరెస్ట్ చేసినట్లయ్యింది. తాజాగా అరెస్ట్ చేసిన పది మందిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన పోలీసులు.. గాంధీ హాస్పిటల్‌లో వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం బోయిగూడ రైల్వే కోర్టులో హాజరుపర్చారు. మెజిస్ట్రేట్ వారికి రిమాండ్ విధించడంతో.. చంచల్‌గూడ జైలుకు తరలించారు. రైల్వే స్టేషన్‌పై దాడికి పాల్పడిన వారు వాట్సాప్ ద్వారా సమాచారం చేరవేసుకున్న నేపథ్యంలో.. అరెస్టయిన పది మందిలో ఐదుగురు వాట్సాప్ గ్రూప్ అడ్మిన్లుగా ఉన్నారని తెలుస్తోంది.

రైల్వే స్టేషన్‌పై దాడి ఘటనలో ఆదిలాబాద్‌కు చెందిన పృథ్వీరాజ్‌ ముఖ్య పాత్ర పోషించాడని పోలీసులు తేల్చారు. ఈ కేసులో అతణ్ని ఏ2గా చేర్చారు. ఇంతకు ముందు అరెస్ట్ చేసిన 45 మందిలో మదుసూధన్‌ను ఏ1గా చేర్చారు. పృథ్వీరాజ్‌, మదుసూధన్ కలిసి ఈ ఘటనలో పాల్గొన్నట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈ కేసులో ఇప్పటి వరకూ 55 మందిని అరెస్ట్ చేయగా.. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. రైల్వే స్టేషన్ లో విధ్వంసం చేస్తున్న సమయంలో ఆర్మీ రిక్రూట్ మెంట్ అభ్యర్థులు కొన్ని పేర్లు చెప్పుకున్నారు. సాయి డిఫెన్స్ అకాడమీకి చెందిన సుబ్బారావు, శివలు విధ్వంసం చేయాలని చెప్పినట్లు అభ్యర్థులు చెప్పుకున్నట్లు రిమాండ్ రిపోర్ట్ లో పోలీసులు పేర్కొన్నారు. హకీంపేట్ సోల్జర్స్ వాట్సప్ గ్రూప్ లో సుబ్బారావు, శివలు ఫోటోలను షేర్ చేశారు. అల్లర్లకు కావాల్సిన పెట్రోల్, కర్రలు, రాడ్లను సుబ్బారావు, శివలు సమకూర్చినట్లు రిమాండ్ రిపోర్టులో పొందుపరించారు పోలీసులు. అంతేకాదు అభ్యర్థులు స్టేషన్ వరకు చేరేందుకు రవాణ సౌకర్యాలను కూడా సుబ్బారావు, శివలే ఏర్పాటు చేసినట్లు పోలీసులు రిమాండ్ రిపోర్టులో వెల్లడించారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో విధ్వంసం కేసు విచారణలో షాకింగ్ వీడియోలు బయటకు వచ్చాయి. రైల్వే స్టేషన్ లో ఆస్తులు, బోగీలకు నిప్పు పెట్టింది ఆదిలాబాద్ కు చెందిన పృథ్వీగా తేల్చారు పోలీసులు. ఆ తర్వాత విధ్వంసం వీడియోలను అతడు గ్రూప్ లో షేర్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. సికింద్రాబాద్ విధ్వంసం కేసులో ముందు పృథ్వీని ఏ12గా చేర్చిన పోలీసులు.. ఇవాళ్టి వీడియోల ఆధారంగా ఏ2గా మార్చారు. పృథ్వీని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

తాము తీసుకున్న గోతిలో తామే పడ్డట్టైంది ఆర్మీ అభ్యర్థుల పరిస్థితి. రైల్వే స్టేషన్ లో విధ్వంసం చేసే సమయంలో అభ్యర్థులు సెల్ఫీ వీడియోలు, సెల్ఫీలు తీసుకున్నారు. ఇదే ఇప్పుడు వారి కొంప ముంచింది. ఆ వీడియోలు, సెల్ఫీల ఆధారంగానే పోలీసులు దర్యాఫ్తును ముమ్మరం చేశారు. ఆర్మీ రిక్రూట్ మెంట్ గ్రూపుల్లో విధ్వంసం వీడియోలు పెట్టిన హల్ చల్ చేశారు. ఆ వీడియోలే విధ్వంసకారులను అడ్డంగా బుక్ చేశాయి. పోలీసులకు ఓ ఆధారంగా మారాయి. సైన్యంలో నియామకాల కోసం కేంద్రం ప్రకటించిన అగ్నిపథ్ స్కీమ్ ను రద్దు చేయాలని, ఇప్పటికే రద్దు చేసిన ఆర్మీ పరీక్షను తిరిగి పెట్టాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం (జూన్ 17) సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ఆర్మీ అభ్యర్థులు చేపట్టిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. ఆందోళనకారులు రైల్వేస్టేషన్ ను ధ్వంసం చేయడంతో పాటు రైళ్లకు నిప్పు పెట్టారు. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు పోలీసులు ఎంతో ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. దీంతో పోలీసులు లాఠీ ఛార్జ్ చేయడంతో… ఆందోళనకారులు పోలీసులపై రుళ్లు రువ్వారు. ఈ క్రమంలో పోలీసులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఒక యువకుడికి ఛాతీలో బుల్లెట్ దిగి మరణించాడు. పలువురు గాయపడ్డారు. కాగా.. తమ కుమారుడికి ఏమీ తెలియదని.. కబడ్డీ ఆడటం.. మేకలను మేపడం తప్పితే గొడవలతో సంబంధం లేదని పృథ్వీరాజ్‌ తల్లిదండ్రులు చెబుతున్నారు. తమ కొడును కేసులో ఇరికించారని వారు వాపోతున్నారు.

Tags :