అప్పుల్లో ఏపీ ఆర్టీసీ

0

  • ప్రభుత్వ బకాయిలు రూ. 80 కోట్లు

హైదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌): ఏపీ ఆర్టీసీలో సమ్మె సైరన్‌ మోగనుందా? కార్మిక సంఘాలను చర్చలకు పిలుస్తామంటూనే ఆర్టీసీ ఎండీ నష్టాలపై క్లారిటీ ఎందుకు ఇచ్చారు? ప్రభుత్వం నుంచి రావాల్సిన కోట్లాది రూపాయల బకాయిలు వసూలు చేయకపోగా… ప్రజలపై ఛార్జీల భారం మోపి నష్టాలను కప్పిపుచ్చుకోవాలని చూస్తోందా? ఉద్యోగుల కుదింపు అందులో భాగమేనా? ఆసలే ఏపీఎస్‌ ఆర్టీసీ అప్పుల్లో ఉంది. గత కొన్నేళ్లుగా అధికారుల నోటి వెంట వినపడుతున్న మాట ఇది. అప్పుల్లో ఉన్న సంస్థను బయట పడేయాలని యాజమాన్యం నానాతిప్పలు పడుతోంది. వీలైనంత మేర ఆర్టీసీలో ఆదా చేయడానికి ప్రయత్నిస్తోంది. కానీ.. సంస్థకు రావాల్సిన బకాయిలపై మాత్రం దృష్టి పెట్టడంలేదు. అడుగుదామంటే మొహమాటం, అడగకపోతే గుట్టలా పేరుకుపోతున్న బకాయిలు. వెరసి ఏం చేయలేక మౌనం వహిస్తోంది ఆర్టీసీ యాజమాన్యం. చేతికి దొరికిందే మహాప్రసాదం అన్నట్టుగా ప్రభుత్వం పెండింగ్‌ బిల్స్‌ ఎంత క్లియర్‌ చేస్తే అంత వరకు తీస్కొని సంతోష పడుతోంది. ఈ ఏడాది జనవరి నుండి పోలవరం ప్రాజెక్ట్‌ సందర్శన కోసం రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ బస్సుల్ని ప్రభుత్వం ఉచితంగా వినియోగించుకుంది. నిత్యం వందకు పైగా బస్సులు… రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి పోలవరానికి వస్తున్నాయి. ఎవరైనా పోలవరాన్ని చూడాలనుకుంటే బస్సులో ఎక్కితే చాలు… ఎక్కడ ఎక్కారో తిరిగి అక్కడే దింపేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇలా ఏడాదిన్నరగా 19 వేలకు పైగా ట్రిప్పులను ఆర్టీసీ పోలవరానికి నడిపింది. పోలవరం సందర్శన కోసం 19 వేల 923 బస్సులను ఆర్టీసీ నడిపింది. వీటి అద్దె విలువ రూ. 74 కోట్లు. గత ఏడాదిన్నరగా ట్రిప్పులు నడుస్తున్నా… ఇప్పటివరకు ప్రభుత్వ చెల్లించింది రూ. 8.68 కోట్లు మాత్రమే. ఇంకా రూ. 65.80 కోట్లు బకాయి పడింది. అలాగే రాష్ట్రంలోని ప్రధాన దేవాలయాల సందర్శన కోసం దివ్యదర్శనం పేరుతో 1984 బస్సులు ఆర్టీసీ నడుపుతోంది. వీటి అద్దె విలువ రూ. 24 కోట్లు. దేవాదాయశాఖ చెల్లించిన అమౌంట్‌ రూ. 16.60 కోట్లు. పెండింగ్‌ అమౌంట్‌ రూ. 8.93 కోట్లు. ఇక.. అమరావతి దర్శనం పేరుతో రాష్ట్రవ్యాప్తంగా ఎవరైనా సచివాలయం, హైకోర్ట్‌, అసెంబ్లీ చూడలనుకునేవారి కోసం… ఆర్టీసీ 1518 బస్సులను నడిపింది. వాటి అద్దె విలువ రూ. 6.35 కోట్లు. ప్రభుత్వం చెల్లించింది కేవలం కోటి రూపాయలు. ధర్మపోరాట దీక్షల కోసం 13 వేల 8 బస్సులు నడపగా… దీనికి రావాల్సిన రూ. 34 కోట్ల 39 లక్షల అద్దెను పూర్తిగా చెల్లించారు. ఇలా మొత్తం కలిపి 36 వేల 433 బస్సుల్ని ఆర్టీసీ తిప్పితే… దానికి రావాల్సిన ఆదాయం రూ. 140 కోట్లు. కానీ ఇప్పటిదాకా చేతికి అందింది రూ. 60 కోట్లు మాత్రమే. ఇంకా రూ. 80 కోట్లకు పెండింగ్‌ అమౌంట్‌ చెల్లించాల్సి ఉంది. మరోవైపు ఆర్టీసీ అధికారుల మెతక వైఖరిపై కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. ప్రభుత్వం అడిగింది కదా అని వేల బస్సులు తరలించి ప్రయాణికుల్ని ఇబ్బందికి గురి చేశారని ఆరోపిస్తున్నాయి. ప్రైవేటు వ్యక్తులకు, పార్టీల కోసం డబ్బు చెల్లిస్తే గాను అద్దెకు బస్సులు నడపరని… అలాంటి ప్రభుత్వం నుంచి బకాయిలు వసూలు చేయడానికి ఎందుకు భయపడుతున్నారని కార్మిక నేతలు నిలదీస్తున్నారు. మొత్తానికి ఆర్టీసీని ఆదుకోవాల్సిన ప్రభుత్వం తక్షణమే పాత బకాయిలు తీర్చాలని ఉద్యోగులు, అధికారులు కోరుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here