ఎపి అసెంబ్లీలో కీలక బిల్లులకు ఆమోదం

0

శాశ్వత బిసి కమిషన్‌ ఏర్పాటు

మహిళలకునామినేటెడ్‌ పోస్టుల్లో 50శాతం రిజర్వేషన్లు

అమరావతి

సామాజికంగా వెనుకబడిన బీసీలకు న్యాయం చేకూర్చేందుకు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం తీసుకొచ్చిన శాశ్వత ప్రాతిపదికన బీసీ కమిషన్‌ బిల్లుకు శాసనసభ మంగళవారం ఆమోదం తెలిపింది. దీంతో ఈ బిల్లు చట్టరూపం దాల్చింది. అంతకుముందు బీసీ కమిషన్‌ బిల్లుపై సభలో చర్చ సందర్భంగా వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే పార్థసారథి మాట్లాడుతూ.. బలహీన వర్గాల జీవితాల్లో మార్పు తెచ్చేందుకు సీఎం వైఎస్‌ జగన్‌ కృషి చేయడం అభినందనీయమన్నారు. శాశ్వత బీసీ కమిషన్‌ బిల్లుపై అసెంబ్లీ చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. వెనుకబడిన వర్గాల ప్రజల సమస్యలను పరిష్కరించడానికి సీఎం వైఎస్‌ జగన్‌ చిత్తశుద్ధితో కృషి చేస్తున్నారని తెలిపారు. సమాజంలో బీసీలు ఇతర వర్గాలతో సమాన స్థాయికి ఎదగాలనే బీసీ కమిషన్‌ బిల్లును తీసుకొచ్చామన్నారు. చంద్రబాబు హయాంలో బీసీల అభివృద్ధి జరగలేదని ఆయన విమర్శించారు. బీసీలను కించపరిచేవిధంగా చంద్రబాబు మాట్లాడారని పార్థసారథి గుర్తుచేశారు. దళితుల్లో పుట్టాలని ఎవరు అనుకుంటారని చంద్రబాబు అన్నారని పేర్కొన్నారు. విస్తృత అధికారాలు, లక్ష్యాలతో బీసీ కమిషన్‌ చట్టం రాబోతున్నదని పేర్కొన్నారు. ఔట్‌ సోర్సింగ్‌ విధానాన్ని విస్తృతంగా తీసుకొచ్చింది టీడీపీ ప్రభుత్వమేనని, దీనివల్ల ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్‌ విధానం అమలుకాకుండాపోయిందని అన్నారు. దోచుకోవడం, దాచుకోవడమే లక్ష్యంగా టీడీపీ పాలన సాగిందన్నారు. టీడీపీ హయాంలో కులాల తారతమ్యాలు తగ్గలేదని, అలాంటి పరిస్థితుల్లో బీసీ కమిషన్‌ బిల్లు వెనుకబడిన వర్గాలను ఆదుకుంటుందని తెలిపారు. బీసీ కమిషన్‌ ఏర్పాటుతో వ్యవస్థలు సక్రమంగా పనిచేస్తాయని అన్నారు. సామాజిక, ఆర్థిక పరిస్థితులపై సూచనలు ఇచ్చేందుకు బీసీ కమిషన్‌కు హక్కు ఉంటుందన్నారు. కులాల సర్టిఫికెట్ల జారీ అంశాన్ని బీసీ కమిషన్‌ ద్వారా తెలుసుకోవచ్చునని పేర్కొన్నారు. బీసీల జీవితాల్లో మార్పు తెచ్చేందుకు టీడీపీ ఒక్క కార్యక్రమమైనా చేసిందా? అని ప్రశ్నించారు. బీసీలకు మేలు చేసేందుకు బీసీ కమిషన్‌ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. సభలో టీడీపీ ప్రవర్తన ప్రజలు గమనించారని, వచ్చే ఎన్నికల్లో ప్రజలు టీడీపీకి తగిన బుద్ధి చెప్తారని పేర్కొన్నారు. బిల్లుతో పాటు, మహిళలకు నామినేటెడ్‌ పదవులు, ప్రభుత్వం నామినేషన్‌పై చేపట్టే పనుల్లో 50 శాతం రిజర్వేషన్లు, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు నామినేటెడ్‌ పదవులు, పనుల్లో 50 శాతం రిజర్వేషన్ల కల్పనకు ఉద్దేశించిన బిల్లులను శాసనసభ ఆమోదించింది. ప్రతిపక్ష సభ్యులు లేకుండానే ఈ బిల్లులకు సభ ఆమోదం లభించింది. శాసనసభ నుంచి సస్పెండ్‌ చేసిన అంశంలో విపక్ష సభ్యుల నిరసనల మధ్యే ఈ బిల్లులపై అధికార పార్టీ సభ్యులు చర్చించారు. అనంతరం బిల్లులకు ఆమోదం లభించింది. మహిళలకు రిజర్వేషన్‌ బిల్లు ప్రకారం నామినేటెడ్‌ ప్రాతిపదికన భర్తీ చేసే వాటిలో మహిళలకే సగం పదవులు దక్కనున్నాయి. ప్రభుత్వ పనులు, సర్వీస్‌ కాంట్రాక్టుల్లోనూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు అమలు కానున్నాయి. దీంతో పాటు రాష్ట్రంలో బీసీ కమిషన్‌ కూడా శాశ్వత ప్రాతిపదికన ఏర్పాటు కానుంది. ఈ బిల్లులు శాసన మండలిలోనూ ఆమోదం పొందిన తర్వాత చట్టంగా మారనున్నాయి. మరోవైపు చంద్రయాన్‌ -2 ప్రయోగం తొలి దశ విజయవంతం కావడంపై శాసనసభ హర్షం వ్యక్తం చేసింది. ఉప సభాపతి కోన రఘుపతి సభలో ఈ అంశాన్ని ప్రస్తావించగా సీఎం జగన్‌ సహా సభ్యులంతా లేచి నిలబడి చప్పట్లతో తమ హర్షాన్ని తెలిపారు. అనంతరం సభను బుధవారానికి వాయిదా వేశారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here