నా సస్పెండ్‌పై ఆంటోని ఆశ్చర్యపోయారు

0

న్యూఢిల్లీ (ఆదాబ్‌ హైదరాబాద్‌): కమిటీ సభ్యులుగా ఉన్న మిమ్మల్ని సస్పెండ్‌ చేయటమేంటని ఆంటోని ఆశ్చర్యపోయారని కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకులు సర్వే సత్యనారాయణ అన్నారు. గురువారం ఆయన ఏఐసీసీ క్రమశిక్షణ కమిటీ ఎదుట హాజరయ్యారు. ఇటీవల కాంగ్రెస్‌ పార్టీ నుంచి సర్వేను సస్పెండ్‌ చేస్తూ టీపీసీసీ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీనిపై సర్వే గురువారం క్రమశిక్షణ సంఘం చైర్మన్‌ ఏకే ఆంటోనికి వివరణ ఇచ్చారు. అనంతరం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.. కమిటీ సభ్యులు నిన్ను సస్పెండ్‌ చేయడమేంటని అడిగారని, డోంట్‌ వర్రీ, ఫిర్యాదు రాసి ఇవ్వమన్నారని తెలిపారు. అలాగే టీపీసీసీ అధ్యక్షడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డితోపాటు, కాంగ్రెస్‌

రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్‌ కుంతియాపై సర్వే మరోసారి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఉత్తమ్‌, కుంతియాల వల్లే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓడిపోయిందని విమర్శించారు. తనను సస్పెండ్‌ చేసే అధికారం ఉత్తమ్‌కు లేదన్నారు. పీసీసీ అధ్యక్ష పదవి నుంచి ఉత్తమ్‌ను బర్తరఫ్‌ చేయాలని.. కొత్త నాయకత్వానికి ఆ బాధ్యతలు అప్పగించాలని డిమాండ్‌ చేశారు. తను సోనియా కుటుంబానికి నమ్మిన బంటునని తెలిపారు. ఏఐసీసీ సభ్యుడిగా ఉన్న తనపై క్రమశిక్షణ చర్య తీసుకునే అధికారం ఉత్తమ్‌కు లేదన్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల టికెట్ల కేటాయింపులో డబ్బులు దండుకుని పక్షపాతంగా వ్యవహరించారని సర్వే వ్యాఖ్యానించారు. ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి చర్యలతో తెదేపా అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు, తెజస అధ్యక్షుడు కోదండరాం అభాసుపాలయ్యారని దుయ్యబట్టారు. ఇబ్రహీంపట్నంలాంటి స్థానాల్లో సమర్థులకు టికెట్‌ కేటాయించకుండా పార్టీకి నష్టం చేశారన్నారు. పార్టీకి నష్టం చేసిన ఉత్తమ్‌పైనే చర్యలు తీసుకోవాలని ఆంటోనీని కోరినట్లు సర్వే సత్యనారాయణ తెలిపారు. ఆరోపణలన్నీ రాతపూర్వకంగా ఇవ్వాలని ఆంటోనీ చెప్పారని సర్వే తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here