అయ్యప్ప ఆలయంలోకి మరో మహిళ

0

తిరువనంతపురం : శ్రీలంక మహిళ శశికళ (47) గురువారం రాత్రి పవిత్ర పదునెట్టాంబడి మీదుగా సన్నిధానంలోకి చేరుకుని అయ్యప్ప స్వామిని దర్శించుకుంది. ఈ విషయాన్ని పోలీసు వర్గాలు ధ్రువీకరించారు. ఇందుకు సం బంధించిన సీసీటీవీ ఫుటేజీని పోలీసులు విడుదల చేశారు. ఆలయం మూసివేతకు ముం దు రాత్రి 10.55 ప్రాంతంలో శ్రీలంక మహిళ శశికళ అయ్యప్ప స్వామిని దర్శించుకున్నట్టు పోలీసులు వెల్లడించారు. అయితే, దీన్ని మాత్రం శశికళ కొట్టిపారేశారు. తాను పదునెట్టాంబడి వరకు వెళ్లాను కాను, సన్నిధానంలోకి వెళ్లలేదని ఖండించారు. అయితే, పోలీసులు విడుదల చేసిన సీసీటీవీ ఫుటేజ్‌లో మాత్రం ఆమె ఆలయంలోకి వెళ్లినట్టు స్పష్టం చేస్తోంది. కోజికోడ్‌కు చెందిన బిందు (42), కనకదుర్గ (44)లు బుధవారం సన్నిధానంలోకి ప్రవేశించినా పదునెట్టాంబడి మాత్రం ఎక్కలేదు. కానీ, శ్రీలంక మహిళ మాత్రం ఏకంగా పదునెట్టాంబడి మీదుగా ఆలయం చేరుకున్నారు. స్వామి దర్శనం అనంతరం శశికళ మరో వ్యక్తితో కలిసి బయటకు వస్తున్నట్టు సీసీటీవీ ఫుటేజ్‌లో కనిపించింది. సన్నిధానం నుంచి పంబకు తిరిగి వస్తూ మీడియాతో మాట్లాడిన శశికళ.. తాను అయ్యప్ప భక్తురాలిని, 48 రోజులపాటు దీక్ష తీసుకుని ఇరుముడి కట్టుకుని శబరిమలకు వచ్చానని, కానీ దర్శనం దక్కలేదని అన్నారు. ఆమె అలా చెప్పడానికి బలమైన కారణం ఉందని పోలీసులు అంటున్నారు. సన్నిధానంలోకి వెళ్లానని తెలిస్తే ఆందోళనకారులు తనతోపాటు భర్తపై దాడిచేస్తారనే భయంతోనే అలా చెప్పారన్నారు. భారత్‌ విడిచి వెళ్లడానికి ముందు దేశంలోని వివిధ ఆలయాల దర్శనానికి వెళ్లే ఉద్దేశంతో ఉన్నారని ఓ పోలీస్‌ అధికారి వెల్లడించారు. శ్రీలంకకు చెందిన శశికళ, ఆమె కుటుంబం ఫ్రాన్స్‌లో స్థిరపడింది.

శబరిమలలో 801 కేసులు, 1369 మంది అరెస్టు…

రెండు రోజుల క్రితం ఇద్దరు మహిళలు శబరిమల అయ్యప్పస్వామి ఆలయంలోకి ప్రవేశించిన విషయం తెలిసిందే. అయితే ఆ ఘటన తర్వాత కేరళ రాష్ట్రవ్యాప్తంగా భారీ ఆందోళనలు జరిగాయి. ఇవాళ కూడా అక్కడ బంద్‌ నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు పోలీసులు సుమారు 1369 మందిని అరెస్టు చేశారు. మరో 717 మందిని ముందస్తుగా ఆధీనంలోకి తీసుకున్నారు. మొత్తం 801 కేసులను నమోదు చేశారు. మునుముందు మరికొంత మందిని అదుపులోకి తీసుకోనున్నట్లు కేరళ పోలీసులు చెప్పారు. భారీ హింస చోటుచేసుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా దుకాణాలను కూడా ఎవరూ తెరవడం లేదు. పోలీసులు భద్రత కల్పిస్తేనే షాపులను తెరుస్తామని యజమానులు అంటున్నారు. దాడులు జరుగుతాయని ఇంటెలిజెన్స్‌ నివేదికలు హెచ్చరించినా.. తగినంత భద్రతను కల్పించలేకపోయారన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here