Featuredస్టేట్ న్యూస్

తెలంగాణలో మరో ఓట్ల పండగ

  • కొత్త పురపాలక చట్టంపై దృష్టి
  • ఉన్నతాధికారులతో కీలక సమీక్ష
  • ప్రజలకు మెరుగైన సేవలు అందించటం..
  • అవినీతి నిర్మూలనే లక్ష్యం
  • ఎన్నికలకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన సీఎం కేసీఆర్‌

హైదరాబాద్‌: నూతన పురపాలక చట్టం రూపకల్పనపై సీఎం కేసీఆర్‌ సమీక్ష చేపట్టారు. ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ ఉన్నతాధికారులతో సమావేశం అయ్యారు. అవినీతి నిర్మూలన, మంచి సేవలందించడమే కొత్త చట్టం లక్ష్యంగా సీఎం పేర్కొన్నారు. ఇప్పటికే తెలంగాణలో అసెంబ్లీ, పంచాయతీ, లోక్‌సభ ఎన్నికలు పూర్తయ్యాయి. గురువారం పార్లమెంట్‌ ఎన్నికలు ముగిసిన విషయం తెలిసిందే కాగా ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలపై సీఎం కేసీఆర్‌ దృష్టిపెట్టారు. ఈ మేరకు ఉన్నతాధికారులతో సమావేశమపై మండల, జిల్లా పరిషత్‌ ఎన్నికల నిర్వహణపై చర్చలు జరిపారు. త్వరలోనే పదవీకాలం ముగుస్తున్న జిల్లా పరిషత్‌, మండల పరిషత్‌ ప్రాదేశిక నియోజకవర్గాల సభ్యుల ఎన్నికల నిర్వహణకు కేసీఆర్‌ అంగీకారం తెలిపారు. కేంద్ర ఎన్నికల సంఘం కూడా తెలంగాణలో పార్లమెంటు స్థానాలకు ఎన్నికలు ముగిసిన తరువాత మండల పరిషత్‌, జిల్లా పరిషత్‌ ఎన్నికల నిర్వహణకు ఆమోదం తెలిపింది. ఈ క్రమంలో ఈ నెల 22 నుంచి మే 14 వరకు జిల్లా, మండల పరిషత్‌ ఎన్నికల ప్రక్రియను నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ఎన్నికల సంఘానికి ప్రతిపాదించింది. ఐతే ఫలితాలను మాత్రం లోక్‌ సభ ఎన్నికల ఫలితాల తర్వాతే ప్రకటిస్తారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ… ‘ప్రజా ప్రతినిధులు, అధికారులకు ప్రజలకు మంచి సేవలు అందించడం కన్నా గొప్ప బాధ్యతలేవీ లేవు. ప్రజలకు ఎవరికీ ఎక్కడా ఒక్క రూపాయి కూడా లంచం ఇవ్వకుండా పని జరగాలి. రెవెన్యూ కార్యాలయాల్లో, మున్సిపాలిటీల్లో, గ్రామ పంచాయతీల్లో డబ్బులు ఇవ్వకుండా, ఎలాంటి ఇబ్బంది కలుగకుండా కావల్సిన పనులు జరగాలి. దీనికోసం కఠినమైన కొత్త చట్టాలు తేవాలి. రాజకీయ పార్టీల బాధ్యతారాహిత్యం వల్ల స్థానిక సంస్థలు నిర్వీర్యమైపోయాయి. వాటిని పనిచేసే పాలనా విభాగాలుగా మార్చాలి. జిల్లా పరిషత్‌లకు, మండల పరిషత్‌లకు కూడా తమ విధుల విషయంలో స్పష్టత ఇవ్వాలి. కొత్త జిల్లాలను, కొత్త డివిజన్లను, కొత్త మండలాలను, కొత్త మున్సిపాలిటీలను, కొత్త గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేసుకుని పరిపాలనా సంస్కరణలకు శ్రీకారం చుట్టాం. ఆయా కార్యాలయాల్లో అవినీతి లేకుండా ప్రజలకు పని కావడంతోనే ఈ సంస్కరణల లక్ష్యం నెరవేరుతుంది’ అని ముఖ్యమంత్రి అన్నారు. ‘నాకు ప్రజల నుంచి వేల సంఖ్యలో ఫిర్యాదులు అందుతున్నాయి. లంచం ఇవ్వకుంటే పనులు కావట్లేదని మొరపెట్టుకుంటున్నారు. ప్రభుత్వాన్ని నిందిస్తున్నారు. ప్రభుత్వం ఎందుకు తిట్లు పడాలి? ప్రజలు ఎందుకు లంచాలివ్వాలి? లంచాలు లేని వ్యవస్థను తీసుకురావాలి. ఇందుకోసం పటిష్టమైన చట్టాలు రూపొందించి, పకడ్బందీగా అమలు చేయాలి. రెవెన్యూలో, రిజిస్ట్రేషన్లలో, మున్సిపాలిటీలలో, గ్రామ పంచాయతీలలో ఒక్క పైసా ఇవ్వకుండా పనులు జరిగే పరిస్థితులు రావాలి. ఇందుకోసం ఏం చేయడానికైనా ప్రభుత్వం సిద్దంగా ఉంది’ అని ప్రభుత్వ లక్ష్యాన్ని వివరించారు. ‘జిల్లా ముఖ్య పరిపాలనాధికారి సారథ్యంలో సీనియర్‌ అధికారుల నాయకత్వంలో జిల్లా స్థాయిలో పటిష్టమైన అధికారిక వ్యవస్థ ఉండాలి. భూమిశిస్తులు, నీటి రకాలు వసూలు చేసినప్పుడు కలెక్టర్‌ అనే పదం పుట్టింది. ఇప్పటికీ అదే పేరుతో పిలుస్తున్నారు. మారిన పరిస్థితుల్లో ఇంకా కలెక్టర్‌ అనే పిలవాలా? లేక జిల్లా పరిపాలనాధికారి అనే పేరు పెట్టాలా? అని ఆలోచించాలి. కలెక్టర్‌ లేదా జిల్లా పరిపాలనాధికారి ఆధ్వర్యంలో ఐదారుగురు ముఖ్యమైన అధికారుల బృందాన్ని ఏర్పాటు చేయాలి. వారికి కొన్ని నిర్థిష్ట శాఖలు అప్పగించాలి. జిల్లా స్థాయిలో ముఖ్యమైన పనులన్నీ ఐఎఎస్‌ అధికారి నాయకత్వంలోని అధికారుల బృందం పర్యవేక్షించాలి. ప్రభుత్వ కార్యక్రమాలను అమలు చేయడం, ప్రజలకు ఎక్కడా ఇబ్బంది కలగకుండా సేవలు అందించడం, అవినీతికి, అలసత్వానికి పాల్పడే వారిపై చర్యలు తీసుకోవడం ఈ అధికారి బాధ్యత. కలెక్టర్‌/పరిపాలనాధికారి, అడిషనల్‌ కలెక్టర్‌/అడిషనల్‌ అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌ విధులు, బాధ్యతలను నిర్ధిష్టంగా పేర్కొనాలి. లే అవుట్ల అనుమతులు, ఆస్తుల అంచనాలు (ప్రాపర్టీ అసెస్మెంట్స్‌) తదితర పనులు ఐఎఎస్‌ అధికారి నాయకత్వంలోని బృందం చేయాల్సి ఉంటుంది. ఇండియన్‌ అడ్మినిస్ట్రేటివ్‌ సర్వీస్‌ లాగా తెలంగాణ స్టేట్‌ అడ్మినిస్ట్రేటివ్‌ సర్వీస్‌ ను నెలకొల్పి రాష్ట్రంలోని స్థితిగతులకు అనుగుణంగా పాలన సజావుగా సాగే ప్రక్రియను ప్రవేశ పెట్టే అవకాశాలు పరిశీలించాలి’ అని ముఖ్యమంత్రి సూచించారు. జిల్లా స్థాయిలో ఐఎఎస్‌ అధికారి నాయకత్వంలో అధికార యంత్రాంగం ఏర్పడినట్లే, రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నాయకత్వంలో ముఖ్యమైన అధికారుల వ్యవస్థ ఏర్పడాలి. సిఎస్‌ ఆధ్వర్యంలో అడిషనల్‌ సిఎస్‌ లను నియమించాలి. వారికి శాఖలు అప్పగించాలి. జిల్లా స్థాయిలో ఐఎఎస్‌ అధికారి నాయకత్వంలో పనిచేసే బృందం పనితీరును సిఎస్‌ నాయకత్వంలోని బృందం పర్యవేక్షించాలి. ఎప్పటికప్పుడు కావాల్సిన నిర్ణయాలను ఈ బృందం తీసుకోవాలి” అని ముఖ్యమంత్రి సూచించారు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, గ్రామ పంచాయతీలు పారిశుద్యం, పచ్చదనం, ఇతర మౌలిక సదుపాయాల కల్పనపై ఎక్కువ దృష్టి పెట్టాల్సి ఉంది. ప్రతీ గ్రామ పంచాయతీ పరిధిలో విధిగా వైకుంఠధామం నిర్మించాలి. నర్సరీ ఏర్పాటు చేయాలి. అనుమతులు, సర్టిఫికెట్ల జారీలో ఎలాంటి అలసత్వం ఉండకూడదు. ఆలస్యానికి కారకులైన అధికారులపై జరిమానా విధించే పద్ధతి రావాలి. ప్రజలకు జవాబుదారీగా అధికార యంత్రాంగం ఉండాలి. ఇవన్ని అంశాలు కొత్తగా రూపొందించే చట్టంలో పొందుపరచాలి” అని ముఖ్యమంత్రి చెప్పారు. ‘తెలంగాణలో పట్టణ జనాభా బాగా పెరుగుతున్నది. పట్టణాల్లో ఏర్పడే అవసరాలను తీర్చే విధంగా తెలంగాణ అర్బన్‌ పాలసీ రూపొందించాలి. హైదరాబాద్‌ నగరానికి సంబంధించిన జిహెచ్‌ఎంసి, హెచ్‌ఎండిఏలకు ప్రత్యేక విధానం రూపొందించాలి. ఇతర పట్టణాలు, నగరాలను ఎలా తీర్చిదిద్దాలనే విషయంపై తెలంగాణ అర్బన్‌ పాలసీ రూపొందించాలి. ప్రస్తుత, భవిష్యత్‌ అవసరాలను పరిగణలోకి తీసుకుని, దానికి అనుగుణమైన విధాన రూపకల్పన జరగాలి’ అని సిఎం చెప్పారు. ఈ సమీక్షా సమావేశంలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌ రావు, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, వి.శ్రీనివాస్‌ గౌడ్‌, విప్‌ పల్లా రాజేశ్వర్‌ రెడ్డి, ఎమ్మెల్యేలు కెటి రామారావు, బాల్క సుమన్‌, వివేకానంద గౌడ్‌, ఎంపిలు బిబి పాటిల్‌, కొత్త ప్రభాకర్‌ రెడ్డి, ఎమ్మెల్సీ భానుప్రసాద్‌, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌ శర్మ, సిఎస్‌ ఎస్‌.కె.జోషి, సీనియర్‌ ఐఎఎస్‌ అధికారులు ఎస్‌.నర్సింగ్‌ రావు, సునిల్‌ శర్మ, అరవింద్‌ కుమార్‌, నీతూ ప్రసాద్‌, స్మితాసభర్వాల్‌, న్యాయ కార్యదర్శి నిరంజన్‌ రావు తదితరులు పాల్గొన్నారు.

మంత్రులతో సీఎం కేసీఆర్‌ లంచ్‌ మీటింగ్‌

సీఎం కేసీఆర్‌ మంత్రులను లంచ్‌కు ఆహ్వానించారు. పార్లమెంట్‌ ఎన్నికల జరిగిన విషయంపై సమీక్షించేందుకు ప్రగతి భవన్‌కు వారిని లంచ్‌కు ఆహ్వానించారు. జెడ్పీ, ఎంపీటీసీ ఎన్నికలపై కూడా కేసీఆర్‌ చర్చించనున్నారు. కాగా ఈ పార్లమెంట్‌ ఎన్నికల్లో పలువురు మంత్రులను కేసీఆర్‌ ఇన్‌ చార్జ్‌ లుగా నియమించారు. ఈ క్రమంలో జిల్లాలు, పార్లమెంట్‌ నియోజకవర్గాల వారీగా పార్లమెంట్‌ ఎన్నికలు ఎలా జరిగాయి? టీఆర్‌ ఎస్‌ కు వచ్చిన ఓటింగ్‌ ఎలా జరిగింది? వంటి పలు అంశాలపై మంత్రుల వద్ద ఆరా తీయనున్నారు. కాగా ఎన్నికల ముందు మంత్రులకు, కీలక నేతలకు ఎన్నికలకు సంబంధించి దిశా నిర్ధేశం చేసిన కేసీఆర్‌ ఎన్నికల తరువాత కూడా వాటిపై విశ్లేషించేందుకు మంత్రులను లంచ్‌ కు ఆహ్వానించినట్లుగా తెలుస్తోంది.

వాసుదేవ దీక్షితులు మృతిపట్ల సీఎం కేసీఆర్‌ సంతాపం

ప్రముఖ జర్నలిస్టు, సీనియర్‌ ఎడిటర్‌ వి. వాసుదేవ దీక్షితులు కన్నుమూశారు. ఆనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. వాసుదేవ దీక్షితులు మృతిపట్ల సీఎం కేసీఆర్‌ సంతాపం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రభ దినపత్రికకు ఎడిటర్‌గా పనిచేసిన దీక్షితులు మరణం పత్రికా రంగానికి తీరని లోటని పేర్కొన్నారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Tags
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close