కోహ్లీపై కోపం.. అద్దం పగలగొట్టిన అంపైర్‌!

0

న్యూఢీల్లీ : ఆర్సీబీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీతో వాగ్వాదానికి దిగిన ఇంగ్లిష్‌ అంపైర్‌ నిగెల్‌ లాంగ్‌ బీసీసీఐ విచారణను ఎదుర్కొనే అవకాశం కనిపిస్తోంది. కోహ్లీతో వాగ్వాదానికి దిగి స్టేడియంలోని ఓ గది తలుపును నిగెల్‌ ధ్వంసం చేసినట్లు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే ఈ కారణంగా మే 12న జరిగే ఐపీఎల్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో అంపైరింగ్‌ బాధ్యతల నుంచి అతడిని బీసీసీఐ తొలగించకపోవచ్చని సమాచారం. శనివారం బెంగళూరులో హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ బౌలర్‌ ఉమేశ్‌యాదవ్‌ వేసిన ఓ బంతిని నిగెల్‌ నోబాల్‌గా ప్రకటించాడు. అయితే రీప్లేలో అది సరైన బంతిగా తేలడంతో కోహ్లీకి, అంపైర్‌కి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో సహనం కోల్పోయిన నిగేల్‌ ఇన్నింగ్స్‌ విరామం సమయంలో అంపైర్‌ గది తలుపును పగలగొట్టాడు. ఈ ఘటనపై అంపైర్‌ వివరణ ఇవ్వాల్సి ఉంటుందని అయితే.. ఐపీఎల్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో అంపైర్‌ బాధ్యతల నుంచి అతడిని తప్పించకపోవచ్చని ఓ బీసీసీఐ అధికారి తెలిపారు. దురుసుగా ప్రవర్తించిన అంపైర్‌పై చర్య తీసుకోవాలని కర్ణాటక క్రికెట్‌ సంఘం కార్యదర్శి సుధాకర్‌ డిమాండ్‌ చేశారు. తాము దీనిపై బీసీసీఐ పాలకుల కమిటీకి ఫిర్యాదు చేశామని చెప్పారు. దురుసు ప్రవర్తనకు సంబంధించి ఆటగాళ్లపై చర్యలు తీసుకొని జరిమానా విధిస్తున్నప్పుడు.. అంపైర్లపై అలాంటి చర్యలు ఎందుకు తీసుకోరని ప్రశ్నించారు. తలుపును ధ్వంసం చేసినందుకు అంపైర్‌ కర్ణాటక క్రికెట్‌ సంఘానికి రూ.5000 చెల్లించాడు. అయితే దానికి రశీద్‌ ఇవ్వాల్సిందిగా డిమాండ్‌ చేశాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో సుదీర్ఘ అనుభవం ఉన్న నిగెల్‌ లాంగ్‌ ఇప్పటివరకూ 56 టెస్టులు, 123 వన్డేలు, 32 టీ20 మ్యాచ్‌లకు అంపైరింగ్‌ బాధ్యతలు నిర్వర్తించాడు. మే 30 నుంచి ప్రారంభం కానున్న ప్రపంచకప్‌లో కూడా బాధ్యతలు నిర్వర్తించనున్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here