కాంగ్రెస్‌లో ఆగ్రహజ్వాలలు

0

హైదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌): మహాకూటమిలో భాగంగా సోమవారం అర్థరాత్రి కాంగ్రెస్‌ అభ్యర్ధుల జాబితాను అధిష్టానం ప్రకటించింది.. 65 పేర్లతో తొలిజాబితాను విడుదల చేస్తుంది.. కాగా ఈ జాబితాపై పలు జిల్లాల్లో కాంగ్రెస్‌ శ్రేణులు నిరసన వ్యక్తం చేస్తున్నాయి.. పార్టీకి సుదీర్ఘకాలం నుండి పనిచేస్తున్న వారికి న్యాయం జరగలేదని, కొత్తగా వచ్చిన వారికి, బలం లేకున్నా కూటమిలోని మిగిలిన పార్టీలకు కేటాయించటం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 65మంది అభ్యర్థులతో తాజాగా కాంగ్రెస్‌ పార్టీ విడుదల చేసిన తొలి జాబితాలో కేవలం 13మంది బీసీ నేతలకు మాత్రమే టికెట్లు కేటాయించింది. దీంతో ఆ పార్టీలోని బీసీ నేతలు తీవ్ర అసమ్మతి వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్‌ అధినాయకత్వం తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీనియర్‌ నేత, పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య సహా చాలామంది బీసీ నేతలకు పార్టీ మొండిచేయి చూపడంపై అసమ్మతి సెగలు ఎగిసిపడుతున్నాయి. తనకు టికెట్‌ దక్కకపోవడంతో పొన్నాల హుటాహుటిన ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. మహూకూటమి పొత్తుల్లో భాగంగా జనగాం సీటును టీజేఎస్‌కు ఇస్తారనే ప్రచారం నేపథ్యంలో ఆ స్థానాన్ని ప్రస్తుతం పెండింగ్‌లో ఉంచారు. ఎట్టి పరిస్థితుల్లో టికెట్‌ సాధించాలనే పట్టుదలతో పొన్నాల ఢిల్లీ వెళ్లారని ఆయన అనుచరులు చెప్తున్నారు. శేరిలింగంపల్లి టికెట్‌ ఆశించి భంగపడ్డ మాజీ ఎమ్మెల్యే భిక్షపతి యాదవ్‌ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది. టిక్కెట్‌ రాకపోవడంతో భవిష్యత్‌ కార్యాచరణపై ఆయన తన అనుచరులతో భేటీ అయ్యారు. ఇండింపెండెంట్‌ అభ్యర్థిగా పోటీ చేయాలని భిక్షపతి యాదవ్‌ భావిస్తున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్‌ పార్టీ బీసీలకు తక్కువ స్థానాలు కేటాయించడంపై ఆ సామాజిక వర్గానికి చెందిన నేతలు మండిపడుతున్నారు. బీసీలకు అన్నింటా అన్యాయం జరుగుతోందని ఆగ్ర¬దగ్రు లవుతున్నారు. బీసీలకు టికెట్ల కేటాయింపులో అన్యాయం చేయడంపై నిరసనగా ఈ నెల 17న తెలంగాణ బంద్‌కు బీసీ నేత ఆర్‌ కృష్ణయ్య పిలుపునిచ్చారు. బీసీలకు తగినమొత్తంలో సీట్లు కేటాయించి న్యాయం చేస్తామన్న కాంగ్రెస్‌ పార్టే అన్యాయం చేసిందని ఆర్‌ కృష్ణయ్య మండిపడ్డారు.

వరంగల్‌ పార్టీ కార్యాలయం వద్ద పటిష్ఠ బందోబస్తు.. వరంగల్‌ పశ్చిమ స్థానాన్ని కేటాయించాలని డిమాండ్‌ చేస్తూ గత రెండు రోజులుగా కాంగ్రెస్‌ పార్టీ నేత నాయిని రాజేందర్‌ రెడ్డి , అతని అనుచరులు ఆందోళన చేస్తున్న విషయం విధితమే. కాగా సోమవారం పార్టీ కార్యాలయంను ముట్టడించి నాయిని రాజేందర్‌రెడ్డికే కూటమి టికెట్‌ కేటాయించాలని ఆందోళన నిర్వహించారు. కాగా సోమవారం అర్థరాత్రి ప్రకటించిన కాంగ్రెస్‌ అభ్యర్ధుల జాబితాలో రాజేందర్‌ రెడ్డికి అవకాశం కల్పించలేదు. అదే స్థానం నుండి టీడీపీ నేత రేవూరి ప్రకాశ్‌రెడ్డిని ప్రకటించింది. దీంతో రాజేందర్‌రెడ్డి అనుచరులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజేందర్‌రెడ్డి మద్దతు దారులు మంగళవారం ఉదయం కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయం వద్ద బైఠాయించి ఆందోళను నిర్వహించారు. పార్టీ కార్యాలయం పైకి ఎక్కిన కొందరు మహిళలు రాజేందర్‌రెడ్డికి టికెట్‌ కేటాయించాలని డిమాండ్‌ చేశారు. ఈసందర్భంగా రాజేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ ప్రకటించిన జాబితా చూస్తుంటే పైరవీదారులకే పెద్దపీట వేసినట్లు కనిపిస్తుందని ఆరోపించారు. ఎవరి వర్గం వారు వారి వర్గీయులు టికెట్‌లు కేటాయించుకున్నారని, కాంగ్రెస్‌ పార్టీయే వర్గంగా ఉన్న వారికి టికెట్లు దక్కలేదన్నారు. తనకు టికెట్‌ దక్కకపోవటం తీవ్ర అవమానానికి గురిచేసిందన్నారు. పార్టీ అధిష్టానంపై పూర్తినమ్మకం పోయిందన్నారు. కార్యకర్తలతో సమావేశం నిర్వహించి తదుపరి కార్యాచరణపై చర్చించి పార్టీలో ఉండాలా? పార్టీని వీడాలా? లేక ఇండిపెండెంట్‌గా బరిలోకి దిగాలా అనే దానిపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని అన్నారు.

సామాజిక న్యాయం పాటించలేదు – రేణుకాచౌదరి .. కాంగ్రెస్‌ పార్టీ సోమవారం అర్థరాత్రి ప్రకటించిన జాబితాపై కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, మాజీ కేంద్ర మంత్రి రేణుకాచౌదరి అసంతృప్తి వ్యక్తం చేశారు. అభ్యర్ధుల జాబితాను చూస్తూ పార్టీ సామాజిక న్యాయం ప్రకటించలేదని తెలుస్తోందన్నారు. తెలంగాణలో కమ్మ సామాజిక వర్గం లేనట్లు పార్టీ వ్యవహరించడం బాధాకరమన్నారు. ఖమ్మంలో కమ్మ సామాజిక వర్గానిదే ఆధిపత్యమని, కాంగ్రెస్‌లో ఉన్న కమ్మ వారికి టికెట్‌ కేటాయించకుండా వేరే వారికి కేటాయించటం సరికాదన్నారు. తాను టికెట్‌ కావాలని అడగలేదని, అడిగితే తనకు టికెట్‌ తెచ్చుకోవటం పెద్ద పనికాదన్నారు. కానీ కాంగ్రెస్‌ పార్టీని ఎన్నో ఏళ్ల నుంచి నమ్ముకొని పనిచేస్తున్న వారిని కాదని ఎవరెవరికో టికెట్లు ఇవ్వటం బాధాకరమన్నారు. రెండవ జాబితాలోనైనా అన్ని వర్గాల వారికి సమన్యాయం కలిగించేలా చర్యలు తీసుకోవాలని అధిష్టానాన్ని కోరుతానని అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here