Featuredజాతీయ వార్తలు

విపక్షాల నినాదాల మధ్య..

లోక్‌సభ సమావేశాలు ప్రారంభం

  • ఆర్టికల్‌ 370 రద్దు తర్వాత పరిస్థితులపై కాంగ్రెస్‌ వాయిదా తీర్మానం
  • గందరగోళం మధ్యనే కొనసాగిన ప్రశ్నోత్తరాలు
  • సభనుంచి వాకౌట్‌ చేసిన శివసేన
  • ప్రాంతీయ భాషా పరిరక్షణపై కేంద్రాన్ని ప్రశ్నించిన కేశినేని నాని
  • తెలుగు అకాడమీకి కేంద్రం నిధులు కేటాయించాలన్న వైసీపీ ఎంపీ

న్యూఢిల్లీ

విపక్షాల నినాదాల మధ్య పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. లోక్‌సభలో విపక్షాలు వాయిదా తీర్మానాలు ఇచ్చాయి. ఆర్టికల్‌ 370 రద్దు తర్వాత జమ్ముకశ్మీర్‌లో పరిస్థితులపై లోక్‌సభలో కాంగ్రెస్‌ వాయిదా తీర్మానం ఇచ్చింది. అదేవిధంగా మహారాష్ట్రలో భారీ వర్షాలకు నష్టపోయిన పంటపై శివసేన సభలో వాయిదా తీర్మానం ఇచ్చింది. ఫరూక్‌ అబ్దుల్లా విడుదలకు సంబంధించి టీఎంసీ లోక్‌సభలో వాయిదా తీర్మానం ఇచ్చింది. ప్రశ్నోత్తరాల్లో భాగంగా లోక్‌సభలో విపక్షాలు గందరగోళం సృష్టించాయి. పలు అంశాలపై చర్చకు పట్టబట్టాయి. విపక్షాల నినాదాల మధ్యే స్పీకర్‌ ఓం బిర్లా సభను నిర్వహించారు. అంతకు ముందు లోక్‌సభకు కొత్తగా ఎన్నికైన సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. లోక్‌సభ స్పీకర్‌ ఓంబిర్లా వారితో ప్రమాణ స్వీకారం చేయించారు. మరోవైపు రాజ్యసభలో ఇటీవల మృతి చెందిన పార్లమెంటు సభ్యులకు సంతాపం తెలిపారు. అరుణ్‌ జైట్లీ, జగన్నాథ్‌ మిశ్రా, సుష్మా స్వరాజ్‌ సహా ఇటీవల మృతి చెందిన సభ్యులకు ఉభయ సభలు సంతాపం తెలిపాయి. ఇదిలాఉంటే ప్రశ్నోత్తరాల నుంచి శివసేన సభ్యుల వాకౌట్‌ చేశారు.

ప్రాంతీయ భాషా పరిరక్షణపై ప్రశ్నించిన కేశినేని..

తొలిరోజే పార్లమెంట్‌ సభలో గందరగోళం నెలకొంది. ప్రశ్నోత్తరాలను అడ్డుకునేందుకు విపక్ష సభ్యుల ప్రయత్నించారు. పలు అంశాలపై చర్చకు విపక్షాల పట్టుబట్టాయి. ఈ గందరగోళం మధ్యనే సభలో ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. ప్రశ్నోత్తరాల కార్యక్రమాల్లో భాగంగా మొదటి ప్రశ్న ఏపీ కి చెందిన టీడీపీ ఎంపీ కేశినేని సంధించారు. ప్రాంతీయ భాషల పరిరక్షణకు కేంద్రం తీసుకుంటున్న చర్యలను వివరించాలని ఆయన ప్రశ్నించారు. స్వాతంత్రం అనంతరం భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఏపీ ఏర్పడిందని.. రాష్ట్రంలో భాషా సంస్కృతులు కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. ఏపీ సీఎం జగన్‌ ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషును ప్రభుత్వం తప్పని సరిచేసిందని కనుక త్రిభాషా విధానాన్ని అమలు చేయాలని కోరారు. ప్రాంతీయ భాషల్ని రక్షించాల్సిన అవసరం ఉందని రాష్ట్రాల్లో భాషను ప్రమోట్‌ చేయడానికి సంబంధిత శాఖ ఏం చర్యలు తీసుకుందో వివరించాలని కోరారు. తెలుగు భాషా పరిరక్షణకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు మానవ వనరుల శాఖా మంత్రి రమేష్‌ పోఖ్రియాల్‌ కేశినేని నాని ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. తెలుగు భాష ఉన్నతికి అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. హైదరాబాద్‌, బెనారస్‌ తదితర విశ్వవిద్యాలయాల్లో తెలుగు భాషా పీఠాల అభివృద్ధికి చర్యలు చేపట్టామన్నారు. భారతీయ భాషల పరిపుష్టి చేయడానికి కేంద్రం కట్టుబడి ఉందని పోఖ్రియాల్‌ తెలిపారు. దీనిలో భాగంగా శాస్త్రీయ అధ్యయన కేంద్రాన్ని నెల్లూరులో ఏర్పాటు చేశామని.. 2019,నవంబర్‌ 13న కార్యకలాపాలు ప్రారంభమయ్యాయన్నారు. 2011లో హైదరాబాద్‌ యూనివర్సిటీలో తెలుగు అధ్యయన కేంద్రాన్ని నెలకొల్పామని.. నిధులు కూడా మంజూరు చేసిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. వైసీపీ ఎంపీ మాట్లాడుతూ.. తెలుగు భాషా పరిరక్షణకు వైసీపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అన్నారు. మాజీ సీఎం ఎన్టీఆర్‌ సతీమణి లక్ష్మీపార్వతిని తెలుగు అకాడమీ చైర్మన్‌గా నియమించటం జరిగిందని, తెలుగు భాషా అభివృద్ధి చర్యలు తీసుకోవటం జరుగుతుందని ఎంపీ తెలిపారు. అంతేకాకుండా పేద వర్గాల పిల్లలకు ఇంగ్లీష్‌లో ప్రావిణ్యం కల్పించేందుకు ఇంగ్లీష్‌ మీడియాన్ని అమల్లోకి తెస్తున్నామని, దీని వల్ల తెలుగుకు వచ్చే నష్టం ఏమీలేదని, తెలుగును విద్యార్థులు అభ్యసించేలా చర్యలు తీసుకోవటం జరుగుతుందని వైసీపీ ఎంపీ తెలిపారు. కేంద్రం స్పందించి తెలుగు అకామీకి నిధులు కేటాయించాలని ఎంపీ కోరారు. అనంతరం సభ్యుల గందరగోళం మధ్యనే ప్రశ్నోత్తరాలు కొనసాగాయి.

Tags
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close