అమ్మా మాంకాళీ

వైభవంగా లష్కర్ భోనాలు
- తొలి బోనం సమర్పించిన తలసాని దంపతులు
- అమ్మవారికి బోనం సమర్పించిన కేసీఆర్
- నగరానికి పండుగ శోభ
- భారీ ఏర్పాట్లు చేసిన అధికార యంత్రాంగం
సికింద్రాబాద్ ఉజ్జయిని మహాకాళి ఆషాఢమాస బోనాల ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో తొలిరోజు ఆదివారం తెల్లవారుజామున 4 గంటల నుంచే ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ కుటుంబ సభ్యులు మహాకాళికి తొలి బోనం, వెండి తొట్టెలు సమర్పించారు. ఉదయం 11.30 గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్, పలువురు ప్రముఖులు అమ్మవారిని దర్శించుకోనున్నారు. ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి తలసాని.. డప్పు, డోలు వాయిద్యాలకు అభిమానులు, భక్తులతో కలిసి స్టెప్పులేశారు. తెల్లవారుజామున మూడు గంటల నుంచి బోనాలతో వచ్చిన మహిళలతో ఆలయ క్యూలైన్లు నిండిపోయాయి. ఉదయం ప్రత్యేక పూజల అనంతరం భక్తులను అమ్మవారి దర్శనానికి వదిలారు. క్యూలైన్లు నెమ్మదిగా సాగుతున్నాయని, ఇప్పుడు అమ్మ దర్శనానికి వచ్చేవారికి కనీసం నాలుగు గంటల తరువాతే దర్శనమవుతుందని ఆలయ అధికారులు వెల్లడించారు. అధికారులు వీఐపీలకు పెద్దపీట వేస్తూ, సామాన్య భక్తులను పట్టించుకోవడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. కాగా, శనివారం తెల్లవారుజాము నుంచే ఆలయ పరిసరాలు జాతరను తలపించాయి. జనరల్ బజార్, టొబాకో బజార్, ఎంజీ రోడ్డు, ఆర్పీ రోడ్డు, బాటా నుంచి క్యూలైన్లు ఏర్పాట్లు చేశారు. వివిధ రకాల పుష్పాలతో ముఖద్వారం నుంచి ఆలయం వరకూ అలంకరించారు. గుడి ఆవరణలో క్యూలైన్లను కోల్‌కతా బృందాల సాయంతో ముస్తాబు చేశారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా ఎక్కడికక్కడ సూచిక బోర్డులు అమర్చారు. మాతాంగేశ్వరీ వద్ద బోనం సమర్పించేలా ఏర్పాట్లు చేశారు. వీఐపీల దర్శనం కొనసాగుతున్న సమయంలోనూ సర్వదర్శనానికి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకున్నారు. ఆదివారం మధ్యాహ్నం సికింద్రాబాద్ సిటీ లైట్ కూడలి, ఆదయ్యనగర్ నుంచి మంత్రి తలసాని నేతృత్వంలో భారీ ఊరేగింపు నిర్వహించనున్నారు. ఈ ఊరేగింపునకు డిప్యూటీ స్పీకర్ పద్మారావు ముఖ్య అతిథిగా విచ్చేస్తారు. మొత్తం 1008 మంది మహిళలు బోనాలతో తోడురాగా మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత బోనం సమర్పించనున్నారు. ఒగ్గు డోలు, డప్పు వాద్యాలు, సుమారు 600 మంది కళాకారులు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు. ఈ ఊరేగింపులో బంగారు బోనాన్ని భక్తులందరూ తిలకించేలా ఎత్తయిన వాహనంలో ఉంచుతారు. ఆర్పీ రోడ్డు పెద్దమ్మ గుడి, సికింద్రాబాద్ బాటా, సుభాష్‌రోడ్డు మీదుగా మహాకాళి ఆలయానికి ఈ ఊరేగింపు చేరుకోనుంది. అమ్మవారికి డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ వెండి ఫలహార బండి సిద్ధం చేయించారు. పుణె, ముంబయి నుంచి కళాకారులను పిలిపించి రథాన్ని వెండి తొడుగులతో అలంకరించారు.
రెండు రోజుల పాటు కార్యక్రమాలు :
రెండురోజుల పాటు జరగనున్న ఈ ఉత్సవాల్లో 2019, జులై 21వ తేదీ ఆదివారం బోనాలు, జులై 22వ తేదీ సోమవారం రంగం కార్యక్రమం నిర్వహిస్తారు. వేడుకల కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆలయంతో పాటు చుట్టపక్కల ప్రత్యేక లైటింగ్ ఏర్పాటు చేయడంతో ఆ ప్రాంతమంతా వెలుగులు విరజిమ్ముతున్నాయి. ఈ ఉత్సవాలకు లక్షలాది మంది భక్తులు తరలిరానున్న దృష్ట్యా వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
దర్శనానికి ఏర్పాట్లు :
సాధారణ భక్తుల కోసం జనరల్ బజార్, టొబాకో బజార్, జేమ్స్‌స్ట్రీట్ పోలీస్స్టేషన్ల వైపు నుంచి క్యూలైన్లను ఏర్పాటు చేశారు. బోనాల కోసం బాటా చౌరస్తా నుంచి ప్రత్యేక క్యూలైన్, వీఐపీ దర్శనానికి జేమ్స్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్ వైపు నుంచి క్యూలైన్లు ఏర్పాటుచేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా నిమిషాల వ్యవధిలో దర్శనం జరిగేలా అన్ని ఏర్పాట్లు చేశారు.
బోనాల సందర్భంగా పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. మహంకాళి ఆలయం, టొబాకో బజార్, జనరల్ బజార్ రోడ్లను మూసివేశారు. జనరల్ బజార్ నుంచి ఆలయ మార్గం, ఆడవయ్య చౌరస్తా నుంచి మహంకాళి ఆలయ మార్గం, సుభాష్ రోడ్డు, బాటా, రాంగోపాల్ పేట మార్గాలను కూడా క్లోజ్ చేశారు. ఆలయానికి వచ్చే భక్తులు కోసం ప్రత్యేక పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేశారు.
ట్రాఫిక్ ఆంక్షలు :
ట్రాఫిక్ ఆంక్షల మూలంగా… సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి హకీంపేట, బోయిన్ పల్లి, బాలానగర్, అమీర్ పేట వెళ్లేవారు.. క్లాక్ టవర్ నుంచి వయా ప్యాట్నీ ఎస్‌బిహెచ్ వైపు నుంచి వెళ్లాలి. క్లాక్ టవర్ నుంచి ఆర్పీ రోడ్డు వైపు వెళ్లే వాహనాలను ప్యాట్నీ చౌరస్తా నుంచి ఎస్బీహెచ్ క్రాస్ రోడ్డు, ప్యారడైజ్ వైపు మళ్లిస్తున్నారు. సీటీవో జంక్షన్ నుంచి ఎంజీ రోడ్డు వెళ్లే వాహనాలను ప్యారడైజ్ క్రాస్ రోడ్డు వద్ద హెచ్డీఎఫ్సీ బ్యాంకు వైపు మళ్లిస్తున్నారు. ఇక.. ఆర్టీసీ బస్సులు రైల్వే స్టేషన్ నుంచి ట్యాంక్ బండ్ వైపు వెళ్లేవి అల్ఫా ¬టల్, గాంధీ ఎక్స్ రోడ్, ఓల్డ్ మహంకాళీ ట్రాఫిక్, బైబుల్ హౌస్ కర్బాల మైదాన్ రూట్లో వెళ్లాల్సి ఉంటుందని తెలిపారు. తాడ్ బండ్ వైపు వెళ్లే వాహనాలు క్లాక్ టవర్, ప్యాట్నీ, వైఎంసీఏ, ఎస్‌బిహెచ్ ఎక్స్ రోడ్డు మీదుగా వెళ్లాలి. బైబిల్ హౌస్ నుంచి వచ్చే వాహనాలను ఝాన్సీమండి ఎక్స్ రోడ్డు నుంచి సజ్జనాల్ స్ట్రీట్, హిల్స్ స్ట్రీట్ వైపు మళ్లిస్తున్నారు. ఎస్‌బిహెచ్ చౌరస్తా నుంచి ఆర్పీ రోడ్డు వైపు వెళ్లే ట్రాఫిక్‌ను ప్యాట్నీ చౌరస్తాలో దారి మళ్లిస్తున్నారు. ఈ ఆంక్షలు సోమవారం రాత్రి 10 గంటల వరకు అమలులో ఉంటాయని పోలీసులు తెలిపారు.
ఉజ్జయినీ అమ్మవారి సేవలో రత్నయ్య కుటుంబం..!
అత్యంత ప్రాధాన్యం కలిగిన ఘటం తయారీ బాధ్యతను మారేడుపల్లికి చెందిన రత్నయ్య వంశస్థులే సుమారు ఐదు తరాలుగా నిర్వహిస్తున్నారు. ఘటాన్ని రూపొందించడానికి ఉపయోగించే అమ్మవారి ముఖ ప్రతిమ, ఇతర వస్తులకు తొలుత మహంకాళి ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తారు. సికింద్రాబాద్ కర్భలా మైదానంలోని డొక్కలమ్మ ఆలయానికి తరలిస్తారు. వేలాది మంది భక్తజనం ఊరేగింపుతో కర్భలామైదానం, డిస్టిల్లరీరోడ్డు, విక్టోరియాగంజ్, పాన్‌బజార్, రంగ్రేజీబజార్ ప్రాంతాల మీదుగా మహంకాళి అమ్మవారు ఆలయానికి చేరుకుంటుంది. దారిపొడవునా మహిళలు హారతులు పడతారు. 11 నుంచి అమ్మవారు ఆయా ప్రాంతాల్లో భక్తులకు దర్శనమిస్తారు. ఉత్సవాల్లో రెండో రోజు అమ్మవారు భవిష్యవాణి చెబుతుంది. పచ్చికుండపై ఓ కాలు పెట్టి మాతంగి స్వర్ణలత భవిష్యవాణి వినిపిస్తుంది. ఆ పచ్చికుండను కూడా రత్నయ్య వంశస్థులే తరతరాలుగా అందిస్తున్నారు.
మహంకాళీ అమ్మవారిని దర్శించుకున్న కేసీఆర్
సికింద్రాబాద్ శ్రీ మహంకాళీ అమ్మవారిని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దర్శించుకున్నారు. కుటుంబసభ్యులతో కలిసి ఆలయానికి వచ్చిన ఆయన అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. క్యూలో నిల్చున్న భక్తులకు అభివాదం చేశారు. అంతకుముందు పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పట్టు వస్త్రాలతోపాటు అమ్మవారికి తొలి బోనాన్ని సమర్పించారు. కుటుంబ సమేతంగా ఆలయానికి వచ్చి మంత్రి అమ్మవారిని దర్శించుక్నారు. తెల్లవారు జాము నుంచే అమ్మవారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. దాదాపుగా క్యూ లైన్లన్నీ నిండిపోయి ఆలయ ప్రాంగణం భక్తులతో కోలాహలంగా మారింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఆలయం వద్ద పోలీసులు పటిష్ఠమైన భద్రత ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ బోనాలను తెలంగాణ రాష్ట్ర పండుగగా గుర్తించిన తర్వాత ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు..భారీగా వర్షాలు కురిసి పాడిపంటలతో రాష్ట్రం సుభిక్షంగా వుండాలని అమ్మవారిని కోరుకున్నట్టు తెలిపారు. కేంద్ర సహాయ మంత్రి కిషన్‌రెడ్డి , కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ, మంత్రులు శ్రీనివాస్ గౌడ్, ఇంద్రకరణ్ రెడ్డి, మల్లారెడ్డి, తెలంగాణ శాసనసభ మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డి తదితరులు తమ కుటుంబ సభ్యులతో కలిసి మహంకాళీ అమ్మవారిని దర్శించుకున్నారు.