అమిత్‌షా గూండా..మోడీ ఓ సైతాను..!

0

  • బీజేపీ అబద్దాల పార్టీ.. హింసను రెచ్చగొడుతోంది
  • బెంగాల్‌ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారు
  • ప్రతీకారం తీర్చుకుంటాం
  • నన్నెవ్వరూ బెదిరించలేరు..
  • బీజేపీకి గట్టి గుణపాఠం చెప్పాలి
  • ఎన్నికల ప్రచార సభలో ధ్వజమెత్తిన దీదీ

కోల్‌కత్తా : బెంగాల్‌ ఆత్మగౌరవాన్ని మోడీ, అమిత్‌షాలు తమ గుండాలతో దెబ్బతీశారని, మోడీ సైతాను, అమిత్‌షా ఓ గుండా అంటూ పశ్చిమబెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. షెడ్యూల్‌ కంటే ఒకరోజు ముందే ప్రచారాన్ని కుదిస్తూ ఈసీ ఇచ్చిన ఉత్తర్వుతో పశ్చిమబెంగాల్‌లో ఎన్నికల ప్రచారం గురువారం ఒక్కసారిగా వేడెక్కింది. ఈ సందర్భంవగా మధురాపూర్‌లో జరిగిన ర్యాలీలో మమతా బెనర్జీ ఉద్వేగభరితమైన ప్రసంగం చేశారు. పశ్చిమబెంగాల్‌లో అల్లర్లపై ప్రధాని మోడీ, ఆ పార్టీ అధ్యక్షుడు అమిత్‌షాను మమతా బెనర్జీ తప్పుపట్టారు. బీజేపీకి అనుకూలంగానే ఎన్నికల ప్రచారాన్ని ఈసీ కుదించిందంటూ మండిపడ్డారు. ప్రధాని ఒక ‘సైతాన్‌’ అని, అమిత్‌షా ‘గూండా’ అని తూర్పారబట్టారు. బీజేపీ ‘అబద్ధాల’ పార్టీ అని, హింసను రెచ్చగొడుతోందని, ప్రజలను వేధించి పాలన సాగించడమే మోడీ, షా లక్ష్యమని నిప్పులు చెరిగారు. దేశ ఐక్యతను, బెంగాల్‌ ప్రతిష్టను బీజేపీ దెబ్బతీసిందని అన్నారు. బెంగాల్‌ గౌరవాన్ని బీజేపీ దెబ్బతీసింది. అమిత్‌షా గూండాలు హింసను రేకెత్తించి, విగ్రహాలను ధ్వంసం చేశారన్నారు. హింసకు పాల్పడిన వాళ్లను ఎంతమాత్రం ఒదిలిపెట్టమని, జైలుకు ఈడుస్తామని మమతా హెచ్చరించారు. బెంగాల్‌ ప్రజలను ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తుంటే చూస్తూ ఊరుకోవాలా? ప్రతీకారం తీర్చుకుంటామన్నారు. ఒక్క బెంగాలీ కూడా బీజేపీకి ఓటేయొద్దని, ఆ పార్టీ పాలనలో 12,000 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు. కేవలం అధికారం కోసం నిస్సిగ్గుగా వ్యవహరిస్తున్నారని, ప్రజలను దోచుకుంటున్నారని, ఒక క్రిమినల్‌ సాయంతో ప్రధాని ర్యాలీ నిర్వహించారంటూ మమత విమర్శలు గుప్పించారు. నన్నుఎవరూ బెదరించలేరని, కనీసం తట్టుకోనూ లేరని మమత సవాలు చేశారు. ఈ ఒక్కరోజులోనే తాను అన్నిర్యాలీలను చుట్టేస్తానని చెప్పారు. టీఎంసీపై అసత్యాలు ప్రచారం చేస్తున్న బీజేపీ ముందు సొంత ఇల్లు చక్కబెట్టుకోవాలని హితవు పలికారు. తమ ప్రభుత్వం బెంగాల్‌ అభివృద్ధిపైన, రోడ్ల అనుసంధానంపైన, పేదలకు మెరుగైన వైద్యం అందిచడం పైనా దృష్టి సారించిందని, ప్రకృతిని వైపరీత్యాలనుసైతం టీఎంసీ ప్రభుత్వం సమర్ధవంతంగా ఎదుర్కొందని గుర్తు చేశారు. దేహీ అంటూ బీజేపీకి సాగిలపడే ప్రసక్తే లేదని ఆమె కుండబద్ధలు కొట్టారు. అబద్ధాలతో ప్రచారం సాగించిన మోడీకి బెంగాల్‌ ప్రజలు గట్టి గుణపాఠం చెప్పాలని మమతా బెనర్జీ పిలుపునిచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here