Featuredప్రాంతీయ వార్తలువార్తలుస్టేట్ న్యూస్

అమీర్‌పేట-ఎల్బీనగర్‌ మెట్రో ప్రారంభం

హైదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌): హైదరాబాద్‌ నగరవాసులు ఎంతో కాలంగా ఎదురుచూసిన మెట్రో రైలు కారిడార్‌-1 (మియాపూర్‌-ఎల్‌బీనగర్‌) మార్గం సోమవారం ప్రారంభమైంది. తెలుగు రాష్ట్రాల గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌.. అమీర్‌పేట నుంచి ఎల్బీనగర్‌ వెళ్లే మెట్రో తొలి రైలుకు జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి హాజరైన మంత్రులు కేటీఆర్‌, నాయిని నర్సింహారెడ్డి, తలసాని శ్రీనివాసయాదవ్‌, మేయర్‌ బొంతురామ్మోహన్‌ సహా పలువురు ప్రజాప్రతినిధులతో కలిసి గవర్నర్‌ మెట్రోలో ఎల్బీనగర్‌ వరకు ప్రయాణించారు. సాయంత్రం 6 గంటల నుంచి ఈ మార్గంలో మెట్రో ప్రయాణికులను అందుబాటులోకి వచ్చింది.

ఎల్‌బి నగర్‌ స్టేషన్‌లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో గవర్నర్‌ నరసింహన్‌ మాట్లాడుతూ కాలుష్యం తగ్గాలంటే మెట్రో ప్రయాణమే మంచిదనీ, దీని వల్ల ట్రాఫిక్‌ సమస్య కూడా తగ్గుతుందనీ అన్నారు. మెట్రో ప్రయాణం వల్ల అంబులెన్స్‌లు సహా అత్యవసర సేవల ప్రయాణాలకు ఆటంకం కలగదని తెలిపారు. కనుక నగర ప్రజలు మెట్రో సేవలను వినియోగించుకోవాలన్నారు. మెట్రో స్టేషన్‌లలో అన్ని వస్తువులు అందుబాటులో ఉన్నాయని, ఒక్క స్మార్ట్‌ కార్డ్‌ ద్వారా అన్ని సౌకర్యాలు పొందేలా చర్యలు తీసుకోవాలని మెట్రో అధికారులకు సూచించారు. డిసెంబర్‌ 15 లోగా హైటెక్‌ సిటీ మార్గాన్ని కూడా పూర్తి చేయాలని కోరారు. ‘ఇది మన మెట్రో దీన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత’ మనందరిపై ఉందన్నారు.

నగరంలోనే అత్యంత రద్దీగా ఉండే ఎల్బీనగర్‌-అమీర్‌పేట మార్గంలో మెట్రో రైలు ప్రారంభం కావడంతో నగరవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నగరంలోని ప్రధాన కేంద్రాలను టచ్‌చేస్తూ వెళ్ళే ఈ మెట్రోసర్వీసుకు ప్రజాదరణ బాగా ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. ఈ మార్గం అందుబాటులోకి వచ్చినందున మెట్రోలో ప్రయాణించేవారి సంఖ్య రెట్టింపు కాగలదని మున్సిపల్‌ శాఖ ఆపద్ధర్మమంత్రి కెటిఆర్‌ ఆకాంక్షించారు. నగర ప్రజలు మెట్రోసర్వీసులను విరివిగా ఉపయోగించుకుని గమ్యస్థానాలకు త్వరగా చేరుకోవాలని, కాలుష్యంలేని ప్రయాణానికి అలవాటుపడాలని గవర్నర్‌ నరసింహన్‌ కోరారు.

మెట్రోరైలు కారిడార్‌-1లోని కొంత దూరం మియాపూర్‌ నుంచి అమీర్‌పేట, కారిడార్‌-2లోని నాగోల్‌ నుంచి అమీర్‌పేట వరకు 30 కి.మీ. మార్గాన్ని ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్‌ గత ఏడాది నవంబరు 28న ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఆ మరుసటి రోజు నుంచి ప్రయాణికులకు మెట్రోలో అనుమతించారు. ఈ సారి మాత్రం ప్రారంభోత్సవం రోజు సాయంత్రం నుంచే ప్రయాణికులను అనుమతిస్తున్నారు.

ఢిల్లీ తర్వాత మనదే పెద్దది : నేడు ప్రారంభమైన 16 కిలోమీటర్ల మెట్రోమార్గంతో కలిపి హైదరాబాద్‌లో అందుబాటులోకి వచ్చిన మెట్రో రైలు మార్గం పొడవు 46 కిలోమీటర్లకు చేరింది. దీంతో దేశంలో ఢిల్లీ తర్వాత ఎక్కువ దూరం మెట్రో రైలు మార్గం ఉన్న నగరంగా హైదరాబాద్‌ గుర్తింపు పొందింది. ఇప్పటివరకు రెండు, మూడు స్థానాల్లో ఉన్న బెంగళూరు (42.3కి.మీ.), చెన్నై (35.3) నగరాల మెట్రోలను మూడు, నాలుగు స్థానాలకు హైదరాబాద్‌ మెట్రో నెట్టేసింది.

ఆసియాలోనే అతిపెద్ద మెట్రో స్టేషన్‌ ఎంజీబీఎస్‌.. : ఎల్బీనగర్‌-మియాపూర్‌ మార్గంలో గల ఎంజీబీఎస్‌ స్టేషన్‌.. ఆసియాలోనే అతిపెద్ద మెట్రో స్టేషన్‌గా రికార్డులకెక్కింది. మియాపూర్‌-ఎల్బీనగర్‌, జేబీఎస్‌-ఫలక్‌నుమా మెట్రో మార్గాలకు ఇది ఇంటర్‌ ఛేంజ్‌ స్టేషన్‌. ఒకటి, రెండు అంతస్తుల్లో ఎల్బీనగర్‌ మెట్రో ప్లాట్‌ఫాం, మూడు, నాలుగు అంతస్తుల్లో జేబీఎస్‌కు ప్లాట్‌పామ్‌లు ఉంటాయి. 58 స్తంభాలు, 6 గ్రిడ్స్‌తో అత్యంత ఎత్తుగా ఈ స్టేషన్‌ నిర్మించారు. 140 మీటర్ల పొడవు, 45 మీటర్ల వెడల్పుతో స్టేషన్‌ ఉంటుంది. ఎంజీబీఎస్‌ స్టేషన్‌ వైపు ‘ఎ’ మార్గం, చాదర్‌ఘాట్‌ వైపు ‘బి’ మార్గం కోసం పొడవైన ఆకాశ మార్గాలను నిర్మించారు.

నేరుగా మియాపూర్‌కు.. : మియాపూర్‌ వాసులు ఎల్‌బీనగర్‌ వరకు వెళ్లాలంటే అమీర్‌పేట స్టేషన్‌లో మెట్రో మారాల్సిన పనిలేదు. ఒకే మెట్రోలో వెళ్లొచ్చు. బస్సులో గంటన్నర పట్టే ఈ దూరాన్ని మెట్రోలో 52 నిమిషాల్లో చేరుకోవచ్చు. 8 నిమిషాలకు ఒక మెట్రో నడపనున్నారు. రద్దీ వేళల్లో ఆరున్నర నిమిషాలకు ఒకటి నడుపుతారు.

బైక్‌పై రాజ్‌భవన్‌కు నరసింహన్‌ : తిరుగు ప్రయాణంలో గవర్నర్‌ ఖైరతాబాద్‌ మెట్రో స్టేషన్‌లో దిగి గవర్నర్‌ నరసింహన్‌ స్మార్ట్‌ బైక్‌పై రాజ్‌భవన్‌కు వెళ్ళి దారంతా సందడి చేశారు. మంత్రి కేటీఆర్‌ కూడా మరో బైక్‌ తొక్కుతూ ఆయనకు కంపెనీ ఇచ్చారు.

ప్రపంచంలోనే ది బెస్ట్‌ : కెటిఆర్‌ – ఇకపోతే ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ప్రతీ మెట్రో స్టేషన్‌ను తీర్చిదిద్దామని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ స్పష్టం చేశారు. ప్రపంచంలో అత్యుత్తమ మెట్రోలతో పోటీ పడే విధంగా హైదరాబాద్‌ మెట్రోను తీర్చిదిద్దామని చెప్పారు. అందరికీ సౌకర్యంగా ఉండేలా ప్రతి మెట్రో స్టేషన్‌ను తీర్చిదిద్దామని తెలిపారు. ఇప్పటికే హైదరాబాద్‌ మెట్రో రైలుకు చాలా అవార్డులు వచ్చాయన్నారు. ఐజీబీఎస్‌ సంస్థ.. హైదరాబాద్‌ మెట్రోకు ఎలాంటి అవార్డును అందజేసిందని గుర్తు చేశారు. దేశంలోనే రెండో అతిపెద్ద మెట్రో రైలు మార్గం అందుబాటులోకి వచ్చిందన్నారు. ప్రపంచంలోనే ప్రభుత్వ – ప్రయివేటు భాగస్వామ్యంలో అతిపెద్ద ప్రాజెక్టును చేపట్టామని గుర్తు చేశారు. ప్రాజెక్టుపై ఎల్‌ అండ్‌ టీ రూ. 12 వేల కోట్లకు పైగా ఖర్చు చేశారని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఖర్చుతోనే భూసేకరణ చేశామన్నారు. నీరు నిల్వ ఉండే ప్రాంతాల్లో మరమ్మతులు చేపట్టామని తెలిపారు. పంజాగుట్టలో రద్దీ ఉన్నా.. ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా ఏర్పాట్లు చేశామన్నారు. అన్ని రకాల నాణ్యతా ప్రమాణాలు పాటించి మెట్రో స్టేషన్ల నిర్మాణం చేపట్టామని కేటీఆర్‌ స్పష్టం చేశారు. ప్రయాణికులు నడక ద్వారా మెట్రో స్టేషన్లకు వచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నామని ప్రకటించారు. ఎప్పటికప్పుడు అధికారులు మెట్రో స్టేషన్లను తనిఖీ చేస్తున్నారని తెలిపారు. హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దుతామని కేటీఆర్‌ ఉద్ఘాటించారు.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close