-అంబేద్కర్‌ రాజ్యాంగం వల్లే.. తెలంగాణ వచ్చింది

0

పంజాగుట్టలో అంబేద్కర్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి

  • ఢిల్లీలో జంతర్‌మంతర్‌ వద్ద ఒక్కరోజు దీక్షచేపట్టిన వీహెచ్‌

న్యూఢిల్లీ, జులై11(ఆర్‌ఎన్‌ఎ) : అంబేద్కర్‌ రాసిన రాజ్యాంగం వల్లే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చిందని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వీ.హనుమంతరావు అన్నారు. హైదరాబాద్‌, పంజాగుట్టలో అంబేద్కర్‌ విగ్రహం తొలగించడంపై ఆయన నిరసన తెలుపుతూ గురువారం ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ దగ్గర ఒకరోజు దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా వీహెచ్‌ మాట్లాడుతూ.. రాజ్యాంగ నిర్మాత విగ్రహాన్ని తొలగించారని, అంబేద్కర్‌ విగ్రహం ఏర్పాటును ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఎందుకు వ్యతిరేకిస్తున్నారని ప్రశ్నించారు. అక్రమంగా రాత్రికి రాత్రే విగ్రహాన్ని తొలగించడంతో పాటు, ఎలక్షన్‌ కోడ్‌ పేరుతో అంబేద్కర్‌ విగ్రహాన్ని లాకప్‌లో పెట్టడం సిగ్గుచేటన్నారు. విగ్రహాన్ని పునఃప్రతిష్టించాలని కోరిన తమను పోలీసులతో అరెస్టు చేయించారని, ఇంత జరుగుతున్నా టీఆర్‌ఎస్‌లోని దళిత నేతలు మాట్లాడకపోవడం దారుణమన్నారు. తెలంగాణలో దళితులను అణగదొక్కే ప్రయత్నం జరుగుతుందని, వారికి కేటాయిస్తామని మూడెకరాల భూమి ఏమైందని హన్మంతరావు ప్రశ్నించారు. దళితుల పట్ల పూర్తి వివక్షతను ప్రదర్శిస్తూ, అంబేద్కర్‌ విగ్రహాలను తొలగిస్తూ కేసీఆర్‌ దుర్మార్గపు పాలనను సాగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా పంజాగుట్టలో అంబేద్కర్‌ విగ్రహం ఏర్పాటు చేయాలని వీహెచ్‌ డిమాండ్‌ చేశారు. కాగా హనుమంతరావు దీక్షకు కాంగ్రెస్‌ నేతలు కుంతియా, మాజీ ఎంపీ హర్షకుమార్‌ సంఘీభావం తెలిపారు.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here