Featuredస్టేట్ న్యూస్

లాటరీ ద్వారా నేడు మద్యం దుకాణాల కేటాయింపు

భారీగా దరఖాస్తుల రాక..పెరిగిన ఆదాయం

వ్యాపారంతో సంబంధం లేని వారు సైతం పోటీ

మద్యం వ్యాపారంలో లాభాలే కారణమని విశ్లేషణ

హైదరాబాద్‌

రాష్ట్రంలో మద్యం దుకాణాల ఏర్పాటు కోసం దరఖాస్తులు వెల్లువెత్తాయి. మొత్తం 41 వేల దరఖాస్తులు ఎక్సైజ్‌ శాఖకు అందాయి. దుకాణాల కేటాయింపుల కోసం శుక్రవారం ‘డ్రా’ నిర్వహించనున్నారు. 2019-21 సంవత్సరానికిగాను ఈ కేటాయింపులు జరగనున్నాయి. మద్యం దుకాణాల కోసం దరఖాస్తుల స్వీకరణ బుధవారంతో ముగిసింది. చివరి మూడు రోజుల్లో దరఖాస్తుదారులు క్యూ కట్టారు. ప్రత్యేకించి హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ల్లోని 173 దుకాణాల కోసం దరఖాస్తులు వెల్లువెత్తాయి. విశేషమేమిటంటే… మద్యం వ్యాపారంతో ఏ మాత్రం సంబంధం లేని వ్యక్తులు ఈ దఫా దుకాణాల కోసం క్యూ కట్టడం. హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ల్లో… దుకాణాల కోసం 825 దరఖాస్తులొచ్చాయి. రాష్ట్రంలో మొత్తం 2,216 వైన్‌ షాపుల కేటాయింపునకుగాను ఈ నెల ఒకటిన నోటిఫికేషన్‌ వెలువడిన విషయం తెలిసిందే. కాగా గత ఎక్సైజ్‌ సంవత్సరంలో వైన్‌ షాపుల కోసం దరఖాస్తుల ద్వారా వచ్చిన ఆదాయం రూ. 410 కోట్లు కాగా… ఈ దఫా ఆదాయం రెట్టింపవుతుందని భావిస్తున్నారు. కాగా వైన్‌ షాపుల ఏర్పాటులో స్థానికేతరులకు అవకాశమవ్వొద్దంటూ హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ల్లో ఇప్పటికే మద్యం వ్యాపారంలో ఉన్న వారు తీవ్రస్థాయిలో డిమాండ్‌ చేశారు. దీంతో హైదరాబాద్‌లోని బండ్లగూడలోని ఎక్సైజ్‌ కౌంటర్ల వద్ద చివరి రోజైన బుధవారం ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో ఎక్సైజ్‌ అధికారులు పోలీస్‌ శాఖ సహకారాన్ని కోరాల్సి వచ్చింది.

కొత్తగూడెంలో అధిక కిక్కు

కొత్తగూడెం జిల్లాలో ఆబ్కారీ శాఖ ఆదాయం మద్యం కిక్కుతో తడిసి ముద్దయింది. మద్యం దుకాణాల దరఖాస్తుల రూపంలో జిల్లాలో దండిగా ఆదాయం సమకూరింది. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఇబ్బడిముబ్బడిగా దరఖాస్తులు రావడంతో ఎక్సైజ్‌ శాఖ మరింత ఉత్సాహంగా ఉంది. 2017 సెప్టెంబర్‌లో మద్యం దుకాణాలకు దరఖాస్తుల రూపంలో రూ.22 కోట్ల ఆదాయం రాగా.. ప్రస్తుతం సరికొత్త మద్యం పాలసీ ద్వారా మరింత రాబడి వచ్చింది. గత సీజన్‌తో పోలిస్తే జిల్లాలో దాదాపు మూడు రెట్ల ఆదాయం అధికంగా రావడం విశేషం. దరఖాస్తు ఫీజు గత సీజన్‌లో రూ.లక్ష ఉన్నప్పుడు మొత్తం 2,204 దరఖాస్తులు రాగా, ప్రస్తుతం 3402 దరఖాస్తులు వచ్చాయి. దీంతో ఎక్సైజ్‌ శాఖకు ఈ ఏడాది రూ.68.04 కోట్ల ఆదాయం సమకూరింది. దరఖాస్తు రుసుము రూ.2 లక్షలకు పెంచినా, ఊహించని రీతిలో భారీగా అప్లికేషన్లు వచ్చాయి. ఈ ఏడాది దరఖాస్తులు తగ్గినా పెంచిన దరఖాస్తు ఫీజుల ద్వారా ఆదాయం బాగానే వస్తుందని అధికారులు భావించారు. అయితే అందరి అంచనాలను తారు మారు చేస్తూ మద్యం వ్యాపార ఆశావహులు ఇబ్బడిముబ్బడిగా దరఖాస్తులు దాఖలు చేశారు. దీంతో ఆదాయం గ్రాఫ్‌లో మరింతగా పైకి దూసుకుని పోయింది. ఇక దరఖాస్తుదారులు తమ అదృష్టం పరీక్షించుకునేందుకు వేచి చూస్తున్నారు. కాగా, కొత్తగూడెం లోని కమ్మవారి కల్యాణ మండపంలో శుక్రవారం కలెక్టర్‌ రజత్‌కుమార్‌ శైనీ లాటరీ తీయనున్నారు. ఇందుకోసం ఆశావహులైన వ్యాపారులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. జిల్లాలో మొత్తం 76 మద్యం దుకాణాలు ఉండగా, 35 ఏజెన్సీ పరిధిలో, 41 మైదాన, మున్సిపాలిటీల పరిధిలో ఉన్నాయి.

ఈసారి ప్రకటించిన మద్యం పాలసీ ప్రకారం దరఖాస్తు ఫీజు రెట్టింపు చేయడంతో పాటు లైసెన్సు ఫీజులు జనాభా ప్రాతిపదికన మరింతగా పెంచారు. దీంతో పాటు ప్రతి దుకాణానికి ప్రత్యేక రిటైల్‌ ట్యాక్స్‌ పేరుతో అదనంగా రూ.5 లక్షలు వసూలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయినప్పటికీ వ్యాపారులు, ఆశావహులు వెనుకడుగు వేయలేదు. ఇప్పటివరకు మద్యం వ్యాపారం చేస్తున్న వారు గతం కంటే ఎక్కువగా దరఖాస్తులు దాఖలు చేయడం గమనార్హం. ఎప్పటిలాగే ఒకటి, రెండు దరఖాస్తులు వేస్తూ అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకునే వారు సైతం దాఖలు చేశారు. ఇక కొత్తగా ఎన్‌ఆర్‌ఐలు సైతం మద్యం వ్యాపారంలోకి దిగారు. ఇక్కడ ఉన్న తమ కుటుంబ సభ్యుల ద్వారా ఇబ్బడిముబ్బడిగా దరఖాస్తులు దాఖలు చేయించారు. కొందరు ఎన్‌ఆర్‌ఐలు చుట్టుపక్కల ఐదారు జిల్లాల్లోనూ భారీ సంఖ్యలో దరఖాస్తులు దాఖలు చేశారు. ఇక సరిహద్దున ఉన్న ఆంధప్రదేశ్‌కు చెందిన వ్యాపారులు సైతం జిల్లాలో భారీగానే దరఖాస్తులు దాఖలు చేశారు. జిల్లాలో 3402 దరఖాస్తులు దాఖలు కాగా, అందులో సుమారు 1000 అప్లికేషన్లు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారు దాఖలు చేసినవేనని తెలుస్తోంది. శ్రీకాకుళం జిల్లా నుంచి కూడా వచ్చి ఇక్కడ టెండర్‌ వేయడం గమనార్హం.

Tags
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close