Featuredరాజకీయ వార్తలు

ఏపీలో పొత్తులు పొడుస్తున్నాయి..

రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తుల కోసం పార్టీలు తహతహలాడుతున్నాయి. ఇందులో భాగంగా భారతీయ జనతా పార్టీతో జగన్‌ వడివడిగా అడుగులు వేస్తున్నారు. జనసేనాతో జత కట్టడానికి ఉభయ కమ్యూనిస్టు పార్టీలు ఇప్పటికే చర్చలు పూర్తి చేశాయి. ఇప్పటికే ఏ దిక్కు లేకుండా బిక్క చూపులు చూస్తున్న కాంగ్రెస్‌ పార్టీ ఒంటరిగా బరిలో దిగనున్నది. ఇదిలా ఉండగా పవన్‌ కళ్యాణ్‌ తెలంగాణ ఎన్నికల సందర్భంలో టీఆర్‌ఎస్‌ పొత్తు కోసం చర్చలు జరిపారని చెప్పారు. సందట్లో సడేమియాగా నేనే సీఎం అంటూ కేఎ పాల్‌ గత కొద్ది రోజులుగా మీడియాతో హల్‌చల్‌ చేస్తున్నారు.

ఆదాబ్‌ హైదరాబాద్‌ ప్రత్యేక ప్రతినిధి

రానున్న సాధారణ ఎన్నికల్లో జనసేనతో కలిసి వామపక్ష పార్టీలు పోటీ చేయనున్నాయని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు స్పష్టంచేశారు. విశాఖలోని పార్టీ కార్యాలయంలో ఆయన విూడియాతో మాట్లాడుతూ.. పవన్‌ ప్రజలకు సేవ చేసేందుకు వచ్చారని, తమ కూటమి ద్వారా ప్రత్యామ్నా యం తీసుకొస్తామని వివరించారు.ఈ నెల 18, 19, 20 తేదీల్లో ఏ నియోజకవర్గం నుంచి ఎవరు పోటీచేయాలన్న దానిపై చర్చిస్తామని ప్రకటించారు. రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వానికి ప్రజల మద్దతులేదన్నారు. అదే విధంగా ఇటీవ లి ఎన్నికల్లో దేశ వ్యాప్తంగా దళితులు భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేశారన్నారు. అందుకనే అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్‌ను కేంద్రం చట్టం ద్వారా కల్పిస్తోందన్నారు. ప్రస్తుత తరుణంలో కూటముల వల్ల ప్రయోజనం లేదని, ఫెడరల్‌ ఫ్రంట్‌ వల్ల కూడా ఉపయోగం లేదన్నారు.

నాతో పొత్తుకు టీఆర్‌ఎస్‌తో రాయబారాలు: పవన్‌

తమతో పొత్తు కోసం వైసీపీ నేతలు ప్రయత్నిస్తున్నారని జనసేన చీఫ్‌ పవన్‌ కళ్యాణ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం నాడు విజయవాడలో జరిగిన కృష్ణా జిల్లా కార్యకర్తల సమావేశంలో పవన్‌ కళ్యాణ్‌ సంచలన వ్యఖ్యలు చేశారు.జనసేనకు బలం లేదనే నేతలే… జనసేనతో పొత్తు కోసం రాయబారాలు చేస్తున్నారని వైసీపీ నేతలనుద్దేశించి పవన్‌ కళ్యాణ్‌ పరోక్ష వ్యాఖ్యలు చేశారు. పొత్తు కోసం టీఆర్‌ఎస్‌ నేతలతో రాయబారాలు నడిపిస్తున్నారని పరోక్షంగా వైసీపీ పై పవన్‌ కళ్యాణ్‌ వ్యాఖ్యలు చేశారు.. బలం లేదంటూనే ఎందుకు పొత్తు కోసం ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. 2014 ఎన్నికల సమయంలో టీడీపీకి మద్దతు ఇవ్వడం వ్యూహంలో భాగమేనని ఆయన అభిప్రాయపడ్డారు. 30 ఏళ్ల పాటు ముఖ్యమంత్రి కావాలని జగన్‌ కలలు కంటున్నారని, మరోసారి ఏపీకి సీఎం కావాలని చంద్రబాబునాయుడు పోస్టర్లు వేయించుకొంటున్నారని ఆయన చెప్పారు.కానీ, వీరిద్దరికి జనం బాధలు పట్టడం లేదన్నారు. ఇదిలా ఉంటే జనసేన సమావేశంలో టీఆర్‌ఎస్‌ నేతల రాయబారాల గురించి పవన్‌ కళ్యాణ్‌ చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో వేడి పుట్టించనున్నాయి..ఏపీ రాజకీయాల్లో జనసేన పాత్ర కీలకంగా మారనుందని పవన్‌ కళ్యాణ్‌ క్యాడర్‌ కు తేల్చి చెప్పారు. టీఆర్‌ఎస్‌తో వైసీపీకి సత్సంబంధాలు ఉన్నాయని టీడీపీ నేతలు పదే పదే విమర్శలు గుప్పిస్తున్నారు. తెలంగాణలో టీఆర్‌ఎస్‌ విజయం సాధిస్తే ఏపీలో వైసీపీ నేతలు సంబరాలు చేసుకొన్నారు. ఈ విషయాన్ని చంద్రబాబు సహా పలువురు నేతలు ప్రస్తావిస్తున్నారు. ఏపీ ఎన్నికల్లో చంద్రబాబునాయుడుకు రిటర్న్‌ గిఫ్ట్‌ ఇస్తానని కేసీఆర్‌ ప్రకటించారు. ఈ రిటర్న్‌ గిఫ్ట్‌లో భాగంగా చంద్రబాబునాయుడుకు వ్యతిరేకంగా వైసీపీకి టీఆర్‌ఎస్‌ మద్దతిచ్చే అవకాశం లేకపోలేదనే ప్రచారం కూడ సాగుతోంది. ఏపీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ వైసీపీ తరపున ప్రచారం చేసినా తమకు అభ్యంతరం కూడ లేదని బాబు ఆఫర్‌ ఇచ్చిన విషయం తెలిసిందే. కేసీఆర్‌ తలపెట్టిన ఫెడరల్‌ ఫ్రంట్‌కు జగన్‌ సానుకూల సంకేతాలను ఇచ్చారు. ఏపీకి ప్రత్యేక¬దా ఇవ్వాలని కేసీఆర్‌ లేఖ రాస్తానని చెప్పడం జగన్‌ స్వాగతించడం కూడ ఈ రెండు పార్టీల మధ్య ఉన్న సంబంధాలను బట్టబయలు చేస్తున్నాయని టీడీపీ నేతలు విమర్శలు చేసిన విషయం తెలిసిందే.అయితే పవన్‌ వ్యాఖ్యలపై వైసీపీ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.

ఏపీ సిఎం నేనే : కేఏ పాల్‌ : చంద్రబాబు నాయుడు మళ్లీ సీఎం అయ్యే ఛాన్స్‌ లేదు, వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ సీఎం కాలేడు, జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ ఎఫెక్ట్‌ అసలే ఉండదు. ఖచ్చితంగా నేనే సీఎం అవుతా అందులో ఎలాంటి సందేహం లేదు. నేను సీఎం అయితే చంద్రబాబును నా సలహా దారుగా పెట్టుకుంటా అంటున్నారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు, కేఏపాల్‌. విజయవాడలో మీడియాతో మాట్లాడిన కేఏపాల్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. తాన సీఎం అవుతానని ధీమా వ్యక్తం చేశారు. అంతేకాదు సీఎం అయితే ఎవరెవరికి ఏ పోస్టులు ఇవ్వాలో కూడా నిర్ణయించేశారు కేఏ పాల్‌. ఏపీ సీఎం చంద్రబాబునాయుడును సలహాదారుడిగా పెట్టుకుంటానని ప్రకటించేశారు. 2019లో తాను అధికారంలోకి రావడం ఖాయమన్నారు. ఇప్పటికే అనేక సర్వేలు ఈ విషయాన్ని నిర్ధారించాయని చెప్పుకొచ్చారు. సర్వే నివేదికలను చూసి సీఎం చంద్రబాబు తనను అడ్డుకోడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. ఇకపోతే ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ సీఎం కాలేడు అని స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్రమోదీ, సీఎం చంద్రబాబు కలిసి నా సంస్థకు నిధులు రాకుండా నిలిపేశారని ఆరోపించారు. మోదీ, చంద్రబాబు ఇద్దరూ శాశ్వత మిత్రులని చెప్పుకొచ్చారు. మోదీ, చంద్రబాబులతో వైఎస్‌ జగన్‌ కూడా కలిశారని తెలిపారు. జగన, చంద్రబాబులలో ఎవరికి ఓటు వేసినా మోదీకి వేసినట్లేనని స్పష్టం చేశారు. దేశంలో మోదీకి ఏకైక ప్రత్యామ్నాయం తాను మాత్రమేనని చెప్పుకొచ్చారు. మోదీ రెండోసారి ప్రధాని కావడం అసంభవమన్నారు. 18 పార్టీలతో కూడిన థర్డ్‌ ఫ్రంట్‌కు 300కు పైగా సీట్లు వస్తాయన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌తో కలిసి పని చేస్తానని చెప్పుకొచ్చారు. ఏపీలో రాబోయే ఎన్నికల్లో జనసేన పార్టీ ప్రభావం ఉండదన్నారు. పవన్‌ కళ్యాణ్‌ సెట్‌ అవ్వడంటూ కామెంట్‌ చేశారు కేఏపాల్‌. నేను గెలిస్తే 7కోట్ల కోట్ల రూపాయల నిధులు తమ పార్టీ అధికారంలోకి వస్తే లోటు బడ్జెట్‌ ఉండదు. మిగులు బడ్జెట్‌ ఉంటుంది. రెండు లక్షల కోట్ల రూపాయలతో రుణమాఫీ చేస్తాం. ఐదు లక్షల కోట్లతో ఐదేళ్లు రాష్ట్రాన్ని అభివ ద్ధి బాటలో నడిపిస్తానన్నారు. అధికారంలోకి వచ్చాక నిధుల వరద పారిస్తానని హామీ ఇచ్చారు. యేటా పెద్దయెత్తున అప్పులు చేస్తున్న వాళ్లు రాబడి లేనప్పుడు వాటిని ఎలా తీరుస్తారని ప్రశ్నించారు. రాబడి రావాలంటే పెట్టుపడులు, డొనేషన్లు కావాలని గుర్తు చేశారు.

గతంలో తాను 200 దేశాల నుంచి 2045 మందితో బిజినెస్‌ కాన్ఫరెన్సులు పెట్టిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే సదస్సులు పెట్టి డొనేషన్లు రాబడతానని స్పష్టం చేశారు. బిజినెస్‌ కాన్ఫరెన్సులు ఏర్పాటు చేసి ఏడు కోట్ల కోట్ల రూపాయలలో ఏడు లక్షల కోట్లు తీసుకొస్తానన్నారు. వాటిలో రెండు లక్షల కోట్లతో రుణమాఫీ తీరుస్తానని మిగిలిన ఐదు లక్షల కోట్లతో ఐదేళ్లకు బడ్జెట్‌ కేటాయింపులు జరుపుతామన్నారు. ఈ విషయాన్ని నిరుద్యోగులు, మహిళలు ఒక్కొక్కరూ వంద, వెయ్యి మందికి చెప్పి ప్రజాశాంతి పార్టీని గెలిపించాలంటూ కేఏ పాల్‌ కోరారు. జగన్‌ పై కేఏ పాల్‌ మండిపాటుతన ఎమ్మెల్యేలను కాపాడుకోలేని వ్యక్తి వైఎస్‌ జగన్‌ అంటూ విరుచుకుపడ్డారు. తన ఎమ్మెల్యేలనే కాపాడుకోలేని వ్యక్తి రాష్ట్రాన్ని ఏం పరిపా లిస్తాడని దుయ్యబట్టారు. తాను శ్రీకాకుళం జిల్లాకు చెందిన తూర్పు కాపు సామా జికవర్గానికి చెందిన వ్యక్తినని అయితే తాను వివాహమాడింది దళిత స్త్రీని అని చెప్పుకొచ్చారు. ఇప్పటి పాలకులకు నా సామర్థ్యం తెలియనిది కాదన్నారు. ఇప్పటీకే కోటి ఇరవై వేల మంది పాల్‌ అభిమానులు ప్రజల్లో పనిచేస్తున్నారని చెప్పుకొచ్చారు. మార్చి నాటికి రాష్ట్రంలో విశేషమైన రాజకీయ మార్పులు చోటు చేసుకుంటాయని ఎన్నో కొత్త పార్టీలు ఆవిర్భవిస్తాయని జోస్యం చెప్పారు. ఫ్రిబవరి 21 నుంచి పార్టీ కార్యకలాపాలను ముమ్మరం చేస్తానని కేఏ పాల్‌ స్పష్టం చేశారు.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close