కూటమి గెలుపు -కేంద్రానికి ఇంటిలిజెన్స్‌ నివేదిక

0

(అనంచిన్ని వెంకటేశ్వరరావు, న్యూఢిల్లీ, ఆదాబ్‌ హైదరాబాద్‌) కేంద్ర హోంశాఖకు నిఘావర్గాలు తెలంగాణ ఎన్నికల ఫలితాల జాబితా అందించాయి. దీనితోపాటు ఎన్నికల సంఘం ఓట్ల గల్లంతు వ్యవహారంపై ఘోరంగా విఫలమైందని తెలిపాయి. అలాగే గత ఎన్నికల్లో ఏపార్టీ విజయం సాధించింది.. తాజా ఫలితాలు ఎలా ఉన్నాయి అనే విషయాలను నిఘా నివేదికలో వివరించారు. ఎన్నికలు ఏకపక్షంగా జరుగుతాయని అన్ని పార్టీలు చెప్పాయి. పోలింగ్‌ తేదీనాటికి తెరాస, కూటమి మధ్య నువ్వా-నేనా అన్న పరిస్థితి. పోలింగ్‌ సరళి ఎవరికి అనుకూలం.. ఎవరికి ప్రతికూలమనే విషయాలపై నిఘా విభాగం పూర్తి వివరాలు తెలిపింది. ఎక్కడ డబ్బు, మద్యం ప్రభావం గురించి కూడా వివరించింది. గ్రామీణ ప్రాంతాల్లో ఓటర్లు చురుగ్గా పాల్గొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పెరిగిన ఓటింగ్‌ తమకే అనుకూలమనే అంచనాల్లో అధికార, ప్రతిపక్ష పార్టీలున్నాయి. లబ్ధిదారులు తరలి వచ్చారని అధికార పార్టీ భావిస్తుంటే.. ప్రభుత్వ వ్యతిరేకత వెల్లువెత్తిందని కూటమి నేతలు అంచనా వేశారు. ప్రతి లబ్ధిదారునూ పోలింగ్‌ కేంద్రానికి తీసుకెళ్లాలన్న కేసీఆర్‌ ఆదేశాన్ని తెరాస కార్యకర్తలు చాలా చోట్ల పాటించారు. ఇది తమకు లాభమని అధికార పార్టీ భావిస్తుంది. కూటమి మధ్య ఓట్ల బదిలీ జరగటం ఓటింగ్‌ పెరగడానికి ఒక కారణం. సుమారు 13 వందల మంది దరావత్తు కోల్పోవడం జరుగనున్నది. నాలుగు స్థానాలలో స్వతంత్రుల ప్రభావం ఉంటుంది. ఇది ఎవరికి లాభం: పట్టణ ప్రాంతాల్లో తగ్గిన ఓటింగ్‌ ఎవరికి లాభిస్తుందనే అంచనాల్లో పార్టీలు ఉన్నాయి. పట్టణ ఓట్లన్నీ తమకే మేలు చేస్తుందని ఇరు వర్గాలూ అంచనా వేస్తున్నాయి. ఇటు తెరాసలోనూ అటు కాంగ్రెస్‌ లోనూ కొందరు ప్రముఖులు ఎదురీదుతున్నారనే అంచనాలు ఉన్నాయి. లగడపాటి కూడా మీడియాతో మాట్లాడుతూ కొందరు ప్రముఖులకు ఓటమి తప్పదనే సంకేతాలు ఇచ్చారు. గెలుపుపై ఇరు వర్గాలూ ధీమా వ్యక్తం చేస్తున్నాయి. చింతమడకలో ఎన్నికల ఫలితంపై కేసీఆర్‌ తమకు 70 నుంచి 80 సీట్లు వస్తాయని సన్నిహితుల వద్ద ఆయన వ్యాఖ్యానించారు. పోలింగ్‌ తర్వాత టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కూడా తమ కూటమికి 80కిపైనే సీట్లు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. ఇలా ఫలితాలు: హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాల్లో కలిపి 29 నియోజక వర్గాలున్నాయి. 2014 ఎన్నికల్లో తెరాస ఐదు సీట్లలోనే గెలిచింది. ఈసారి 8 చోట్ల తెరాస గెలుస్తుంది. ఇబ్రహీంపట్నం, పరిగి, చేవెళ్ల, మల్కాజిగిరి, శేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్‌, సనత్‌ నగర్‌, గోషామహల్‌ స్థానాలు ఈ జాబితాలో ఉన్నాయి. గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ రెండు సీట్లు గెలిచింది. ఇప్పుడు కూటమికి 11 వస్తాయి. మహేశ్వరం, వికారాబాద్‌, మేడ్చల్‌, తాండూర్‌, ఎల్బీనగర్‌, ఉప్పల్‌, కూకట్‌పల్లి, సికింద్రాబాద్‌, కంటోన్మెంట్‌, నాంపల్లి, జూబ్లీహిల్స్‌ స్థానాలు కాంగ్రెస్‌ ఖాతాలో చేరనున్నాయి. ఖైరతాబాద్‌, అంబర్‌ పేట్‌, ముషీరాబాద్‌ స్థానాలలో బీజేపీ గెలవనున్నది. పాతనగరంలో మజ్లిస్‌కు విజయావకాశాలు ఉన్నాయి. ఉమ్మడి నిజామాబాద్‌, ఆదిలాబాద్‌, కరీంనగర్‌, వరంగల్‌ జిల్లాల్లోని 44 నియోజకవర్గాల్లో 2014 ఎన్నికల్లో తెరాస 36 సీట్లలో విజయం సాధించింది. కంచుకోట బీటలు వారకుండా చూసుకోవడంతో పాటు అధిక సీట్లను తిరిగి పొందడం ద్వారా అధికారాన్ని మళ్లీ చేజిక్కించుకోవాలని తెరాస సర్వశక్తులనూ ఒడ్డింది. అభ్యర్థుల ఎంపిక, స్థానిక పరిస్థితుల కారణంగా కొన్ని సీట్లలో ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కోవాల్సి వచ్చిందనే అభిప్రాయం. నిజామాబాద్‌ జిల్లాలో 9 స్థానాలుంటే.. గత ఎన్నికల్లో తెరాస అన్ని సీట్లు గెలుచుకుంది. ఈ ఎన్నికల్లో ఐదు చోట్ల ఆర్మూర్‌, బాల్కొండ, బాన్సువాడ, కామారెడ్డి, జుక్కల్‌ మాత్రమే తెరాస పార్టీ గెలిచే అవకాశాలు ఉన్నాయి. బోధన్‌, నిజామాబాద్‌ అర్బన్‌, నిజామాబాద్‌ రూరల్‌, ఎల్లారెడ్డి స్థానాలలో కాంగ్రెస్‌ గెలిచే అవకాశాలున్నాయి. ఆదిలాబాద్‌ జిల్లాలో 10 స్థానాలున్నాయి. గత ఎన్నికల్లో తెరాస వీటిలో ఏడు గెలిచింది. ఆదిలాబాద్‌, ముథోల్‌, చెన్నూర్‌, ఆసిఫాబాద్‌, సిర్పూర్‌ లతో కలిపి ఐదు సీట్లకు పరిమితం కానున్నది. ఖానాపూర్‌, బోథ్‌, నిర్మల్‌, మంచిర్యాల స్థానాలలో కాంగ్రెస్‌ కు అనుకూలం. బెల్లంపల్లిలో ఇతరులు గెలిచే అవకాశం ఉంది. కరీంనగర్‌ జిల్లాలో 13 నియోజక వర్గాలుంటే.. గత ఎన్నికల్లో తెరాస 12 సీట్లలో గెలిచింది. ఒక్క జగిత్యాలలో కాంగ్రెస్‌ గెలిచింది. ఈసారి పెద్దపల్లి, మానకొండూర్‌, కోరుట్ల, మంథని, వేములవాడ స్థానాలు కాంగ్రెస్‌ ఖాతాలోకి వెళ్లే అవకాశాలు ఉన్నాయి. కరీంనగర్‌, చొప్పదండి, హుజూరాబాద్‌, సిరిసిల్ల, జగిత్యాల, హస్నాబాద్‌, ధర్మపురిల్లో తెరాస గెలిచే అవకాశం ఉంది. రామగుండంలో ఇతరులు పాగా వేయనున్నారు. వరంగల్‌ జిల్లాలో 12 నియోజకవర్గాలు ఉంటే.. గత ఎన్నికల్లో తెరాస 8 సీట్లలో గెలిచింది. ఈ ఎన్నికల్లో కూడా 7 స్థానాలు నర్సంపేట, పరకాల, పాలకుర్తి, వర్ధన్నపేట, జనగామ, వరంగల్‌ తూర్పు, వరంగల్‌ పశ్చిమ నియోజక వర్గాల్లో తెరాస గెలిచే అవకాశాలు ఉంది. ములుగు, భూపాలపల్లి, డోర్నకల్‌, మహబూబాబాద్‌, స్టేషన్‌ఘన్‌పూర్‌ లలో కాంగ్రెస్‌ అభ్యర్థులకు విజయావకాశాలు. 44 నియోజకవర్గాల్లో 24 సీట్లు తెరాస, 18 సీట్లు కాంగ్రెస్‌, రెండుచోట్ల ఇతరులు గెలిచే అవకాశం ఉంది. ఉమ్మడి మహబూబ్‌నగర్‌, నల్లగొండ, ఖమ్మం, మెదక్‌ జిల్లాల్లో 46 సెగ్మెంట్లున్నాయి. గత ఎన్నికల్లో తెరాస 22 సీట్లలో గెలిచింది. ఇప్పుడు 19 స్థానాల్లో గెలిచే అవకాశం ఉంది. కాంగ్రెస్‌ బలం 7 సీట్లు పెరిగి 23కు చేరే అవకాశం ఉంది. ఖమ్మం జిల్లాలో పాలేరు, ఖమ్మం నియోజకవర్గాలు, నల్లగొండ జిల్లాలో భువనగిరి, మిర్యాలగూడ, దేవరకొండ, నల్లగొండ నియోజకవర్గాలు, మహబూబ్‌నగర్‌లో జడ్చర్ల, దేవరకద్ర, మక్తల్‌, వనపర్తి, నాగర్‌కర్నూల్‌, అలంపూర్‌ స్థానాలు, మెదక్‌లో సిద్దిపేట, గజ్వేల్‌, మెదక్‌, నర్సాపూర్‌, జహీరాబాద్‌, నారాయణ్‌ ఖేడ్‌, పటాన్‌ చెర్వు నియోజకవర్గాల్లో తెరాస గెలిచే అవకాశాలున్నాయి. కొసమెరుపు ఏమింమటంటే… గెలుస్తామనే ధీమాతో ఖమ్మం, పాలేరు, వరంగల్‌ లో కూటమి అభ్యర్థులు సరైన రీతిలో ఖర్చు పెట్టలేదు. దీనికితోడు కొందరు కోవర్టు ఆపరేషన్లు వీరి విజయావకాశాలను దెబ్బతీశారని తెలిసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here